
బ్లాక్ బస్టర్ 'బేబీ' జోడీ ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’. '90s' వెబ్ సిరీస్ తో ఆకట్టుకున్న యువ దర్శకుడు ఆదిత్య హాసన్, ఈ చిత్రంతో వెండితెరకు దర్శకుడిగా పరిచయం అవుతుండటం విశేషం. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ‘ఎపిక్’ చిత్రం సెప్టెంబర్ 11, 2026న థియేటర్లలో అడుగుపెట్టనుంది. ఈ నేపథ్యంలో తాజాగా మీడియాతో ముచ్చటించిన హీరోయిన్ వైష్ణవి చైతన్య, పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
షార్ట్ ఫిలిమ్స్ నుంచి వచ్చిన మీరు, ఒక తెలుగమ్మాయిగా స్టార్‌డమ్ చూడటం ఎలా ఉంది?
- చాలా సంతోషంగా ఉంది. నా తల్లిదండ్రుల సపోర్ట్ తో పాటు సినీ పరిశ్రమ, ప్రేక్షకుల మద్దతుతోనే ఇక్కడివరకు వచ్చాను. పలువురు తెలుగమ్మాయిలు సినీ పరిశ్రమలో వారి వారి ప్రత్యేకతను చాటుతున్నారు. అందులో నేను కూడా ఉండటం ఆనందంగా ఉంది.
ఎపిక్ సినిమాలో ఆనంద్, మీరు పోషించిన పాత్రలు ఎలా ఉండబోతున్నాయి?
- ఆనంద్ పోషించిన ఆదిత్య పాత్ర సాఫ్ట్ గా, కామ్ గా ఉంటుంది. జీవితంలో ఎదురైన అనుభవాల నుంచి ఆదిత్య ఏం నేర్చుకున్నాడనేది ఆసక్తికరంగా ఉంటుంది. నేను పోషించిన కడలి పాత్ర స్ట్రాంగ్ అమ్మాయి. తన కోసం తాను నిలబడే అమ్మాయి. క్లారిటీ ఉన్న అమ్మాయి.
'తన కోసం తాను నిలబడే అమ్మాయి' అంటున్నారు. కడలి పాత్ర మీ నిజ జీవితానికి దగ్గరగా ఉంటుందా?
- ప్రతి ఒక్కరిలోనూ కడలి పాత్ర ఉంటుంది. కానీ, కుటుంబం వల్లనో, సమాజం వల్లనో మనలోని ఆ వెర్షన్ లోపలే ఉండిపోతుంది. బయటకు రాదు. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఏదోక సమయంలో వారి కోసం వారు నిలబడాలి. అందుకే కడలి పాత్ర నా మనసుకు బాగా దగ్గరైంది.
బేబీ తర్వాత కథల ఎంపికలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు?
- కథలోనూ, నా పాత్రలోనూ కొత్తదనం ఉండాలి. ఆ పాత్రలో నన్ను నేను చూసుకోగలగాలి. ఎపిక్ ఎంచుకోవడానికి కారణమదే.
దర్శకుడు ఆదిత్య హాసన్ గురించి?
- దర్శకుడు ఆదిత్యతో కలిసి పని చేయడం చాలా సరదాగా ఉంటుంది. ఆయన జీవితాన్ని చాలా లోతుగా గమనిస్తుంటారు. జీవితంలో ఉన్న ప్రతి చిన్న విషయాన్ని గమనిస్తూ, అందులో ఉన్న ప్రాముఖ్యత గురించి మాట్లాడుతుంటారు. ఎపిక్ సినిమాలో కూడా అదే కనిపిస్తుంది. ఆదిత్య, కడలి పాత్రల మధ్య జరిగే చిన్న విషయాలకు ఎంత ఇంపార్టెన్స్ ఉందో చూపిస్తారు. ఆదిత్య యూనిక్ డైరెక్టర్. నాకు బాగా ఇష్టమైన దర్శకులలో ఆయన ఒకరు.
- దర్శకుడు ఆదిత్యతో నాకు ముందు పరిచయం లేదు. ఎపిక్ కథ చెప్పడానికి వచ్చినప్పుడే మొదటిసారి కలిశాను. కానీ, అప్పటికే 90s వెబ్ సిరీస్ చూసి ఉన్నాను. ఆ సిరీస్ నాకు ఎంతగానో నచ్చింది.

బేబీ తర్వాత మీరు, ఆనంద్ గారు కలిసి నటించిన సినిమా కాదా.. ఏమైనా ఒత్తిడి ఉందా?
- బేబీ, ఎపిక్ సినిమాలు దేనికవే ప్రత్యేకమైనవి. ఒత్తిడి లేదు కానీ, ఛాలెంజింగ్ గా తీసుకొని ఎపిక్ సినిమా చేశాము. ఈ సినిమాలో మమ్మల్ని చూస్తున్నప్పుడు బేబీ గుర్తుకు రాకపోతే మేము విజయం సాధించినట్టే. ఎపిక్ ఖచ్చితంగా ప్రేక్షకుల ఆదరణ పొందుతుందనే నమ్మకం మాకు మొదటి నుంచి ఉంది.
నిర్మాత నాగవంశీ గారి గురించి?
- సితార బ్యానర్ లో సినిమా చేయడం సంతోషంగా ఉంది. నాగవంశీ గారు అందరికీ ఫ్రీడమ్ ఇస్తారు. ఖర్చు విషయంలో రాజీపడరు. సినిమా అవుట్ పుట్ బాగా రావాలని మాత్రమే ఆలోచిస్తారు.
'అల వైకుంఠపురములో' సినిమాలో చెల్లి పాత్ర చేసిన మీరు, ఇప్పుడు అదే బ్యానర్ లో హీరోయిన్ గా నటించడం ఎలా ఉంది?
- ప్రతి ఒక్కరూ జీవితంలో పెద్ద పెద్ద గోల్స్ పెట్టుకోవచ్చు అనే ఆశను నాకు కలిగించింది. పెద్ద గోల్స్ పెట్టుకొని, వాటిని రీచ్ అవ్వొచ్చనే నమ్మకాన్ని కలిగించింది. నా జీవితంలో ఇలా జరగడం మాటల్లో చెప్పలేనంత సంతోషంగా ఉంది.
ఎపిక్ సినిమాలో ఉన్న ప్రత్యేకత ఏంటి?
- మనం ఎన్నో లవ్ స్టోరీలు చూసుంటాం. కానీ, ప్రతి లవ్ స్టోరీలోనూ ఏదోక ప్రత్యేకత ఉంటుంది. ఎపిక్ లో కూడా ఆ ప్రత్యేకత ఉంది. భిన్న దారులు, భిన్న మనస్తత్వాలు ఉన్న ఇద్దరు యూకేకి చదువుకోవడానికి వెళ్లి, అక్కడ కలుస్తారు. లివ్ ఇన్ లో ఉంటారు. ఆ ఇద్దరు ప్రైవేట్ గా మాట్లాడుకునే మాటలు ఏవైతే ఉంటాయో, ఆ సంభాషణల మీద నడిచే సినిమా. అమ్మాయి జీవితాన్ని ఒకలా చూస్తుంది. అబ్బాయి ఒకలా చూస్తాడు. అసలు వీరిద్దరూ ఎలా కలిశారు? వీరిద్దరి ఆలోచనలు ఏంటి? అనేది కొత్తదనాన్ని తీసుకొస్తుంది. ఈ సినిమాలో హంగామా ఉండదు. హత్తుకునేలా ఉంటుంది.
ఎపిక్ నుంచి మీరేం నేర్చుకున్నారు?
- నేను ఏదైనా విషయం బయట మాట్లాడాలంటే కాస్త భయపడుతుంటాను. కడలి పాత్ర ద్వారా నేనొక విషయం నేర్చుకున్నాను. ముందు మనల్ని మనం నమ్మాలి, కాన్ఫిడెంట్ గా ఉండాలి.
- అమ్మాయిలు ఇండిపెండెంట్ గా ఉన్న సినిమాలు ఇప్పటికే చాలా ఉన్నాయి. అయితే ఈ సినిమాలో ప్రత్యేకత ఏంటంటే.. ఒక సముద్రం లాంటి అమ్మాయి, తన జీవితంలో ఉన్న సమస్యను డీల్ చేస్తూ.. తన జీవితాన్ని ఎలా ముందుకు నడిపించింది అనేది ఉంటుంది. ఈ పాత్ర ద్వారా మంచి సందేశం కూడా ఉంటుంది.
ఎపిక్ సినిమాకి ఫ్యామిలీ ఆడియన్స్ రావొచ్చా?
- ఖచ్చితంగా రావొచ్చు. ఈ సినిమాలో లివ్ ఇన్ రిలేషన్ షిప్ గురించి మాట్లాడతాం కాబట్టి, 90s వెబ్ సిరీస్ అంత క్లీన్ ఎంటర్టైనర్ లా ఉండకపోవచ్చు. కానీ, దర్శకుడు ఆదిత్య ఈ సినిమాకి ఏది అవసరమో అది చూపిస్తూనే, ఫ్యామిలీ ఆడియన్స్ ని కూడా దృష్టిలో ఉంచుకొని ఎంతవరకు చూపించాలో అంతవరకు చూపించారు. ఇబ్బందికర సన్నివేశాలు ఉండవు. ఫ్యామిలీ ఆడియన్స్ సినిమా చూడొచ్చు.
తదుపరి చిత్రాలు?
- సితార బ్యానర్ లో నితిన్ గారితో ఒక సినిమా చేస్తున్నాను. అలాగే, తమిళ్ లో రెండు సినిమాలు, హిందీలో ఒక సినిమా చేస్తున్నాను.
[EPIC First Semester, Epic Movie, Vaishnavi Chaitanya, Anand Deverakonda, Aditya Hasan, Telugu Film News, Telugu News]





