TeluguOne App Promotion
● # Tweets

Home

»

తాజా

మాస్ ఇమేజ్ వెంట పరుగులు వద్దు.. మన హీరోలకి ధనుష్, దుల్కర్ చూపిస్తున్న నిఖార్సయిన దారి!

Nov 28, 2026 2:42PM

మ..మ..మాస్.. అన్న నడిచొస్తే మాస్.. అన్న ప్యాంటు ఏస్తే మాస్. అన్న షర్ట్ వేస్తే మాస్.. అది లెక్క..  కింగ్ నాగార్జున మేనరిజమ్స్ పై ఆ పదాలన్నింటిని  రచయితలు రాసినా ఇతర హీరోల అభిమానులు కూడా తమ అభిమాన హీరోకి అన్యయించుకుంటూ ఉంటారు. మాస్ అనే పదానికి అంతటి శక్తీ ఉంది. హీరోలు కూడా మాస్ ఇమేజ్ ని    సంపాదించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుటారు.

 

కానీ ఇప్పుడు కారున్న మైనర్ కాలం మారింది మైనరు. ఇక తగ్గాలి మీ జోరు అనేలా మాస్ అనే వర్డ్ కొంత మంది హీరోలకి సూటవ్వదని సోషల్ మీడియా వేదికగా చెప్పుకొస్తున్నారు. పనిలో పనిగా పై పిక్ లో ఉన్న ధనుష్, దుల్కర్ సల్మాన్ ని ఉదాహరణగా చూపిస్తున్నారు. ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం.

తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోల ఇమేజ్ విషయంలో ఒక ఆసక్తికరమైన ట్రెండ్ కనిపిస్తోంది. ఒకప్పుడు మంచి కథలు, సహజమైన నటనతో మీడియం రేంజ్ హీరోలుగా గుర్తింపు తెచ్చుకున్న చాలామంది.. ఇప్పుడు మాస్ హీరోలుగా మారాలని ప్రయత్నిస్తున్నారు. కత్తి పట్టుకోవడం, భారీ ఫైట్లు చేయడం, పవర్‌ఫుల్ డైలాగులు చెప్పడం.. ఇవే స్టార్‌డమ్‌కు మార్గాలన్నట్టుగా సినిమాలు చేస్తున్నారు. కానీ ఈ ప్రయత్నంలో అసలు కథను, ప్రేక్షకుడికి నచ్చే కంటెంట్‌ను ఎక్కడో మర్చిపోతున్నారా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

ఇదే సమయంలో తమిళంలో ధనుష్, మలయాళంలో దుల్కర్ సల్మాన్ తమకంటూ ప్రత్యేకమైన బాటలో ప్రయాణిస్తున్నారు. ప్రతి సినిమాకీ ఒకే ఇమేజ్‌ను నమ్ముకోకుండా కొత్త క్యారెక్టర్స్, కొత్త కథలతో అభిమానులు, ప్రేక్షకులని  ఆకట్టుకుంటున్నారు. మరి మన తెలుగు హీరోలు కూడా వీళ్లను చూసి కొన్ని విషయాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉందా?మాస్ ఇమేజ్ ఉంటేనే స్టార్‌డమ్ వస్తుందా?

ఇది కూడా చదవండి: మోక్షజ్ఞ మూవీలో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్: ఫ్యాన్స్ సంబరాలు! 

టాలీవుడ్‌లో స్టార్ హీరో అంటే భారీ ఇంట్రడక్షన్, ఎలివేషన్ సీన్లు, ఫైట్లు ఉండాల్సిందేననే అభిప్రాయం బలంగా ఉంది. అయితే ప్రతి హీరోకీ ఇదే ఫార్ములా పనిచేయదు. ఒక హీరోకు సహజమైన నటనతో అభిమానులు ఏర్పడవచ్చు. మరొకరికి కామెడీ, ఇంకొకరికి ప్రేమకథలు, మరొకరికి ప్రయోగాత్మక సినిమాలు గుర్తింపును తీసుకురావచ్చు.

అలాంటప్పుడు తమకున్న ప్రత్యేకతను వదిలేసి, ఇతర హీరోల ఇమేజ్‌ను అనుకరించడం ఎంతవరకు సరైన నిర్ణయం? ప్రేక్షకులు కోరుకునేది భారీ ఫైట్లు మాత్రమే కాదు. మంచి కథ, గుర్తుండిపోయే పాత్ర, భావోద్వేగాలు కూడా కావాలి.


 ధనుష్ కెరీర్‌ పరిశీలిస్తే ఆయన ఎప్పుడూ ఒకే తరహా క్యారెక్టర్ లకి పరిమితం కాలేదు. ప్రేమకథలు, ఫ్యామిలీ డ్రామాలు, యాక్షన్ సినిమాలు, ప్రయోగాత్మక పాత్రలు.. ఇలా విభిన్నమైన కథల్లో నటించారు.ముఖ్యంగా 'అసురన్' సినిమాలో సుమారు 50 ఏళ్ల వ్యక్తిగా కనిపించి తన నటనతో మెప్పించారు. హీరోగా కనిపించడానికి గ్లామర్, యంగ్ లుక్ మాత్రమే అవసరం లేదని నిరూపించారు. తెలుగులో 'సార్' సినిమాతోనూ మంచి విజయాన్ని అందుకున్నారు. కథ నచ్చితే తన ఇమేజ్‌ను పక్కనపెట్టి పాత్రకు ప్రాధాన్యత ఇవ్వడం ధనుష్ నుంచి నేర్చుకోవాల్సిన విషయం.

మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ ప్రయాణం కూడా ఆసక్తికరంగా ఉంటుంది. తెలుగులో ఆయన చేసిన సినిమాలను గమనిస్తే ప్రతి సినిమాలోనూ ఒక కొత్త కోణం కనిపిస్తుంది. 'మహానటి'లో జెమినీ గణేశన్‌గా, 'సీతారామం'లో లెఫ్టినెంట్ రామ్‌గా, 'లక్కీ భాస్కర్'లో మధ్యతరగతి బ్యాంకు ఉద్యోగిగా విభిన్నమైన పాత్రల్లో కనిపించారు.

ఒక సినిమాలో రొమాంటిక్ హీరోగా కనిపిస్తే.. మరో సినిమాలో సాధారణ మధ్యతరగతి వ్యక్తిగా ప్రేక్షకులను మెప్పించారు. ఇప్పుడు 'ఆకాశంలో ఒక తార'తో మరో విభిన్నమైన కథను ఎంచుకున్నారు. ఒక నిర్దిష్టమైన మాస్ ఇమేజ్‌లో ఇరుక్కుపోకుండా కథకు తగ్గట్టుగా మారడం ఆయన ప్రత్యేకత.

మన మీడియం రేంజ్ హీరోలు ఏం చేస్తున్నారు?
తెలుగులో నాని, శర్వానంద్, విజయ్ దేవరకొండ, రవితేజ, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ వంటి హీరోలకు మంచి గుర్తింపు ఉంది. వీళ్లంతా కెరీర్ ప్రారంభంలో విభిన్నమైన కథలతోనే ప్రేక్షకులకు దగ్గరయ్యారు. కానీ కొన్నిసార్లు మార్కెట్ పెంచుకోవాలనే ప్రయత్నంలో భారీ మాస్ కథల వైపు అడుగులు వేస్తున్నారు.

మాస్ సినిమాలు చేయడంలో తప్పులేదు. కానీ ప్రతి సినిమా మాస్ యాక్షన్‌తోనే ఉండాలనే నియమం ఏమీ లేదు. హీరో మార్కెట్ పెరగాలంటే మంచి కథలను ఎంచుకోవడం, కొత్త దర్శకులను ప్రోత్సహించడం, ప్రయోగాలకు సిద్ధపడటం కూడా అంతే ముఖ్యం.

స్టార్‌డమ్ కోసం ఇమేజ్ మార్చుకోవాలా.. కథ మార్చుకోవాలా?
ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ధనుష్, దుల్కర్ సల్మాన్ విజయాలకు కారణం కేవలం డిఫరెంట్ గెటప్స్ కాదు. వాళ్లు ఎంచుకున్న కథలు, పాత్రలకు ఇచ్చిన ప్రాధాన్యత, నటన కూడా కీలకమే. వాళ్లు చేసిన ప్రతి సినిమా హిట్ కాలేదు. అయినప్పటికీ ప్రయోగాలు చేయడానికి వెనుకాడలేదు.

 

మన హీరోలు కూడా ఇదే ఆలోచనతో ముందుకెళ్తే కొత్త మార్కెట్‌ను సృష్టించుకునే అవకాశం ఉంటుంది. ఒక సినిమా ఫ్లాప్ అయితే మరో సినిమా కోసం కొత్త కథను వెతుక్కోవాలి కానీ, వెంటనే మాస్ ఇమేజ్ కోసం పరుగులు తీయకూడదు.

మొత్తానికి హీరోగా ఎదగడానికి మాస్ ఇమేజ్ ఒక్కటే మార్గం కాదు. మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకుంటే స్టార్‌డమ్ దానంతట అదే వస్తుంది. ధనుష్, దుల్కర్ సల్మాన్‌లను చూసి మన మీడియం రేంజ్ హీరోలు నేర్చుకోవాల్సిన అసలైన పాఠం ఇదే!  ప్రస్తుతం ఈ ఇద్దరు తమ కెరీర్ లో మరి వైవిధ్యభరితమైన చిత్రాలైన ఓం, ఆకాశంలో ఒక తార తో సందడి చేస్తున్న విషయం తెలిసిందే.

 

మీకు నచ్చవచ్చు 

మీరు చేస్తే డాన్స్: మమ్ముట్టి చేస్తే ఏఐ: ఏం మాట్లాడుతున్నారయ్యా! 

బయటపడిన రామాయణ ఒరిజినల్ కలెక్షన్స్:మరి బాహుబలి 2 ని దాటిందంటున్నారు!

 

[Tollywood Medium Range Heroes, Dhanush, Dulqer Salmaan, Tollywood]
 

google-ad-img