‘ఇరుముడి’ 100 డేస్ గిఫ్ట్: రవితేజ ఫ్యాన్స్‌కు మర్చిపోలేని ట్రీట్.!
Nov 28, 2026 1:42PM

మాస్ మహారాజా రవితేజ నటించిన ‘ఇరుముడి’ సినిమా 100 రోజుల మైలురాయిని చేరుకుంది. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా విజయవంతంగా 100 రోజులు పూర్తి చేసుకోవడంతో చిత్రబృందం సెలబ్రేషన్స్ నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని మైత్రి థియేటర్లలో ప్రత్యేక షోలు ఏర్పాటు చేశారు.
ఆగస్టు 21, 2026న విడుదలైన ‘ఇరుముడి’ బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లతో దూసుకెళ్లింది. ఒక మధ్యతరగతి తండ్రి తన కూతురి కోసం చేసే ప్రయాణం, ఆ క్రమంలో అతడి జీవితంలో చోటుచేసుకునే మార్పులను దర్శకుడు శివ నిర్వాణ ఎమోషనల్‌గా చూపించారు.
ఈ కథ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ కావడంతో సినిమా సుదీర్ఘమైన థియేట్రికల్ రన్‌ను కొనసాగించింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.250 కోట్ల గ్రాస్ వసూలు చేసిందని ట్రేడ్ లెక్కలు చెబుతున్నాయి.

సినిమాలో రవితేజ నటనతో పాటు జీవీ ప్రకాశ్ కుమార్ అందించిన సంగీతం కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు మంచి బలంగా నిలిచాయి. తండ్రి–కూతురు ఎమోషన్‌తో కూడిన కథకు సంగీతం మరింత బలాన్ని ఇచ్చిందనే ప్రశంసలు వచ్చాయి.
ఇది కూడా చదవండి: స్విట్జర్లాండ్‌లో మార్మోగిన అన్నమయ్య కీర్తన.!
100 రోజుల వేడుక సందర్భంగా ఈ రోజు రాత్రి 10:23 గంటలకు బాలానగర్‌లోని మైత్రి విమల్ 70 MM, దిల్‌సుఖ్‌నగర్‌లోని మైత్రి గంగ థియేటర్లలో ప్రత్యేక షోలు నిర్వహిస్తున్నారు. ఈ షోలలో సినిమాలోని హిట్ పాటలను రెండుసార్లు ప్లే చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. టికెట్లు District యాప్ ద్వారా బుక్ చేసుకునే అవకాశం ఉంది.

ఒకవైపు 100 రోజుల మైలురాయి, మరోవైపు ప్రత్యేక షోలతో ‘ఇరుముడి’ టీమ్ ఈ విజయాన్ని అభిమానులతో కలిసి జరుపుకుంటోంది. రవితేజకు మరో విజయవంతమైన సినిమాగా నిలిచిన ‘ఇరుముడి’ 100 రోజుల వేడుక ఇప్పుడు అభిమానుల్లో సందడి తీసుకొస్తోంది.
మీకు నచ్చవచ్చు:
తెలుగు సినిమాకు మంచి రోజులు వస్తాయా.?
బాలకృష్ణకు సుమలత క్షమాపణలు!
[Ravi Teja, Irumudi, 100 Days Celebration, Special Shows, Hyderabad]



