హాలీవుడ్ నటుడు టోబీ మాగైర్ తన మాజీ భార్య జెన్నిఫర్ మేయర్ పెళ్లిలో కీలక పాత్ర పోషించడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ‘స్పైడర్మ్యాన్’ సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న టోబీ.. తన మాజీ భార్య మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంటున్న వేడుకలో స్వయంగా వివాహ వేడుకను నిర్వహించడం అందరి దృష్టిని ఆకర్షించింది. విడాకుల తర్వాత కూడా ఇద్దరూ స్నేహపూర్వక సంబంధాన్ని కొనసాగిస్తున్నారనే విషయానికి ఈ ఘటన నిదర్శనంగా నిలిచింది.
జెన్నిఫర్ 2020లో విడాకుల కోసం దరఖాస్తు చేసుకోగా.. ఈ ఏడాది సెప్టెంబర్లో వారి విడాకుల ప్రక్రియ పూర్తయింది. తాజాగా జెన్నిఫర్ మ్యూజిక్ ఎగ్జిక్యూటివ్ జెఫ్రీ ఒగున్లేసిని వివాహం చేసుకున్నారు. అక్టోబర్ 10న హవాయిలోని ఫోర్ సీజన్స్ రిసార్ట్ లనాయ్లో ఈ వేడుక జరిగింది. ఈ పెళ్లిలో టోబీ స్వయంగా వివాహ వేడుకను నిర్వహించడంతో ఈ వార్తకు మరింత ప్రాధాన్యత ఏర్పడింది.
ఈ వేడుకకు హాలీవుడ్కు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. టోబీ స్నేహితుడు, ఆస్కార్ విజేత లియోనార్డో డికాప్రియో తన ప్రేయసి విట్టోరియా సెరెట్టితో కలిసి పాల్గొన్నారు. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్, ఆయన భార్య లారెన్ శాంచెజ్, నటి కోర్టెనీ కాక్స్, కేట్ హడ్సన్ తదితరులు కూడా వేడుకలో సందడి చేశారు. విడిపోయిన తర్వాత కూడా తమ పిల్లల బాధ్యతలను కలిసి నిర్వర్తిస్తూ స్నేహపూర్వకంగా ఉంటున్న టోబీ, జెన్నిఫర్.. ఇప్పుడు ఆమె కొత్త జీవితంలోకి అడుగుపెట్టే వేడుకలోనూ కలిసి కనిపించడం అభిమానులను ఆకట్టుకుంటోంది.
[Tobey Maguire, Jennifer Meyer Wedding, Tobey Maguire Ex Wife, Geoffrey Ogunlesi, Spider-Man Actor, Hollywood Celebrity Wedding, Leonardo DiCaprio, Jennifer Meyer Divorce, Tobey Maguire Latest News]






