ఈ ఏడాది దీపావళి సందర్భంగా టాలీవుడ్లో అనువాద చిత్రాల సందడి కనిపించనుంది. నవంబర్ 5న ‘రామాయణ’ విడుదల కానుండగా.. నవంబర్ 6న ‘మహాశక్తి’, ‘సీన్’, ‘నాన్న కుట్టి’ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. వీటితో పాటు కిరణ్ అబ్బవరం నిర్మించిన ‘హతః’ స్ట్రెయిట్ తెలుగు సినిమాగా బాక్సాఫీస్ బరిలో నిలవనుంది. దీంతో ఈ పండగ సీజన్లో తెలుగు ప్రేక్షకులను పలకరించబోయే సినిమాలపై ఆసక్తి నెలకొంది.
రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, యశ్ రావణుడిగా నటించిన ప్రతిష్ఠాత్మక చిత్రం ‘రామాయణ’ నవంబర్ 5న పలు భారతీయ భాషల్లో విడుదల కానుంది. ఈ సినిమాకు యశ్ నిర్మాణ భాగస్వామిగా కూడా వ్యవహరిస్తున్నారు. మరోవైపు, యశ్‌కు సోదరిగా ‘టాక్సిక్’ చిత్రంలో నటించిన నయనతార ప్రధాన పాత్రలో నటించిన తమిళ అనువాద చిత్రం ‘మహాశక్తి’ నవంబర్ 6న విడుదల కానుంది. సుందర్ సి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రెజీనా కసాండ్రా, దునియా విజయ్, యోగిబాబు, అజయ్ ఘోష్ కీలక పాత్రలు పోషించారు. ‘రామాయణ’ చిత్రాన్ని దిల్ రాజు విడుదల చేస్తుండగా, ‘మహాశక్తి’ని మైత్రీ మూవీ మేకర్స్ ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది.
ఇక సూర్య నటించిన తమిళ చిత్రం ‘సీన్’ కూడా నవంబర్ 6న థియేటర్లలోకి రానుంది. మలయాళ దర్శకుడు జీతూ మాధవన్ తెరకెక్కించిన ఈ యాక్షన్ కామెడీ సినిమాలో నజ్రియా నజీమ్ హీరోయిన్గా నటించారు. సూర్యకు చెందిన 2డీ ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. అదే రోజున విజయ్ ఆంటోని నటించిన తమిళ చిత్రం ‘నాన్న కుట్టి’ కూడా తెలుగులో విడుదల కానుంది. ఇలా ఒక హిందీ అనువాద చిత్రంతో పాటు మూడు తమిళ డబ్బింగ్ సినిమాలు దీపావళి సందర్భంగా తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి.
ఇన్ని అనువాద చిత్రాలు పోటీలో ఉన్నప్పటికీ, ప్రస్తుతం దీపావళి బరిలో ఉన్న స్ట్రెయిట్ తెలుగు సినిమా మాత్రం ‘హతః’ ఒక్కటే. కిరణ్ అబ్బవరం నిర్మిస్తున్న ఈ చిత్రంలో రెహమాన్, కుష్లు, తనూజ పుట్టుస్వామి, నమ్రిత ఎంవీ ప్రధాన పాత్రలు పోషించారు. అనుష్ గోరక్ దర్శకత్వం వహించారు. రాబోయే రోజుల్లో మరిన్ని తెలుగు సినిమాలు ఈ పండగ రేసులో చేరతాయా? లేక డబ్బింగ్ సినిమాలే బాక్సాఫీస్ వద్ద ఆధిపత్యం ప్రదర్శిస్తాయా? అన్నది ఆసక్తికరంగా మారింది.
[Telugu Diwali Movie Releases 2026, Ramayana Movie, Mahashakti Movie, Suriya Scene Movie, Nanna Kutti Telugu Release, Hatha Movie, Diwali Box Office Clash]





