తారక్, బన్నీలా సుధీర్ కష్టపడ్డాడు.. అందుకే 'గాలోడు' సక్సెస్!
on Nov 23, 2022
సుడిగాలి సుధీర్ హీరోగా నటించగా రీసెంట్గా రీలీజ్ ఐన 'గాలోడు' మూవీ దుమ్మురేపుతోందనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా మంచి కలెక్షన్స్ ని రాబడుతోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మూవీ సక్సెస్ మీట్‌కి వచ్చిన తమ్మారెడ్డి భరద్వాజ్ కొన్ని ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేశారు. వేదికపై ఆయన మాట్లాడుతూ, "ఈ మూవీలో ఓ చిన్న వేషం వేయాలని ఈ మూవీ మేనేజర్ అడిగేసరికి 'మూవీ పేరు ఏమిటి?' అని అడిగా.. 'గాలోడు' అని చెప్పేసరికి 'గాలోడిలా నేను వేషం వేయడమేంటి' అన్నాను. 'వినడానికి టైటిలే బాగోలేదు.. నేను చేయను' అన్నాను. డైరెక్టర్ పట్టుబట్టేసరికి చివరికి ఒప్పుకున్నాను. నాపైన ఒక సీన్ షూట్ చేస్తున్నప్పుడే, అందులో మంచి కంటెంట్ ఉందనిపించింది. అతను చేసిన మేజిక్ వల్లనే ఈ రోజున ఈ సినిమా సక్సెస్ అయింది" అని చెప్పారు.
ఆయన ఇంకా మాట్లాడుతూ, "ఈ మూవీలో ఒక డైలాగ్ ఉంది. 'కష్టాన్ని నమ్ముకున్నవాడికే అదృష్టం వస్తుంది' అని. సుధీర్ తన కష్టాన్ని నమ్ముకున్నందువల్లనే అదృష్టం కలిసొచ్చింది. జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ లాంటి స్టార్స్‌లాగా కష్టపడే తత్వం సుధీర్‌లో నాకు కనిపించింది. నేను అతన్ని ఏమీ పొగడడం లేదు. నాకు అనిపించింది చెబుతున్నాను. ఈ మూవీ ఏమంత చించేసే కథ కాదు. కానీ ఇందులో ఏదో థ్రిల్ ఉంది." అన్నారు.
ఈ రోజు ఉన్న పరిస్థితిని బట్టి ఇలాంటి సినిమాలు ఆడడం చాలా చాలా కష్టమని చెప్పిన భరద్వాజ్, "కానీ ఆడుతోంది అంటే ఇదొక మిరకిల్. దీన్ని నిలబెట్టుకోవాలి అంటే సుధీర్ ఇంకా బాగా చేయాలి, జాగ్రత్తగా చేయాలి. నేను కొన్ని మూవీస్ లో చిన్నచిన్న బిట్స్ లో నటించాను. అవి సక్సెస్ అయ్యాయి. ఈ మూవీలో కూడా నటించాను. గాలోడిలా నా పరువు తీసేస్తారు అనుకుని భయపడ్డాను. నా అదృష్టం బాగుండి నేను నటించిన సినిమా హిట్ అయ్యింది" అని చెప్పుకొచ్చారు.