Home

»

Latest News

మహేంద్రగిరి వారాహి: మహేష్ బాబు ‘మురారి’ ఛాయలు.. ఆ సీన్ సినిమాకే హైలైట్.!

Sep 8, 2026 6:48PM

సుమంత్, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రల్లో నటించిన డివోషనల్ యాక్షన్ థ్రిల్లర్ ‘మహేంద్రగిరి వారాహి’. స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ ప్రత్యేక పాత్రలో నటించారు. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహించారు. రాజశ్యామల ఎంటర్‌టైన్‌మెంట్స్, బ్రిడ్జ్ ఫిలిమ్స్ బ్యానర్లపై కలిపు మధు, లక్ష్మణ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై అంచనాలు పెంచాయి. ఈ చిత్రం సెప్టెంబర్ 11న ఈ చిత్రం ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ సందర్భంగా హీరో సుమంత్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. 

మహేంద్రగిరి వారాహి ప్రమోషన్స్ చాలా జోరుగా చేస్తున్నారు కదా?
-అవునండి. ఈ మధ్యకాలంలో నా నుంచి వస్తున్న చాలా బిగ్ బడ్జెట్ సినిమా ఇది. నిర్మాతలు చాలా పెద్ద స్కేల్ లో తీశారు. అలాగే ప్రమోషన్స్ కూడా చాలా అగ్రెసివ్‌గా చేస్తున్నారు. హిందీ, తమిళ్‌లో కూడా రిలీజ్ అవుతుంది. నార్త్ నుంచి కూడా ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ సినిమా టీజర్, ట్రైలర్‌కి ఆడియన్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ చాలా సంతోషంగా ఉంది. సినిమా మీద చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం.

ఈ కథ చెప్తున్నప్పుడు మీకు ఎక్కడ బాగా కనెక్ట్ అయింది?
-కథ మొత్తం నాకు నచ్చింది. ఇంటర్వెల్ లో, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఎపిసోడ్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. ఆడియన్స్‌కి మంచి హై ఇస్తాయి. సంతోష్ ఈ కథని సింగిల్ సిట్టింగ్‌లో చెప్పారు. నాకు చాలా నచ్చింది. డైరెక్టర్ సంతోష్‌కి వేదాలు, పురాణాల పట్ల చాలా మంచి అవగాహన ఉంది. తనకి ఇది చాలా రైట్ సబ్జెక్టు. తను అనుకున్న కథని అంతే అద్భుతంగా తీశాడు. మేము అనుకున్నప్పుడు ఇంత బిగ్ స్కేల్‌లో తీస్తారని అనుకోలేదు. కాకపోతే VFX పరంగా, థియేటర్ ఎక్స్‌పీరియన్స్ పరంగా, నటీనటుల పరంగా అన్నీ కలిసి వచ్చాయి.

ఇందులో మీ పాత్ర ఎలా ఉంటుంది?
- నేను యూట్యూబ్ లో మూఢ నమ్మకాలను ఎక్స్‌పోజ్ చేసే క్యారెక్టర్‌లో కనిపిస్తాను. ఆ క్యారెక్టర్ గురించి ఇప్పుడే అంతకంటే ఎక్కువ చెప్పకూడదు. ఇది డివోషనల్ యాక్షన్ థ్రిల్లర్. అలాగే మంచి ఫ్యామిలీ డ్రామా కూడా ఉంది. కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. 

సిద్దు క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది?
-సిద్దు ఒక సీరియస్ క్యారెక్టర్ చేశాడు. మా ఇద్దరి మధ్య ఒక సీన్ ఉంటుంది. అది సినిమాకే హైలెట్‌గా ఉంటుంది. చూసిన వాళ్లందరూ కూడా అది చాలా అద్భుతంగా వచ్చింది అని చెప్పారు. అది సినిమాకి చాలా పెద్ద హెల్ప్ అవుతుంది. ఈ పాత్ర ఒప్పుకున్నందుకు సిద్దుకి థాంక్స్.

మైథాలజీ ట్రెండ్ నడుస్తుంది కదా? ఆ ట్రెండ్‌లో ఈ సినిమా చేశారా?
లేదండి. ‘కార్తికేయ’, ‘కాంతార’ నుంచి ఆ మైథాలజీ ట్రెండ్ మొదలైంది. అంతకు ముందు కూడా ఉంది. కాకపోతే ఈ చిత్రాలతో మళ్లీ వరుసగా అలాంటి సినిమాలు రావడం ప్రారంభమైంది. కానీ మేము ఈ కథని మూడేళ్ల క్రితమే ఫిక్స్ చేశాము. అప్పటికి సరైన నిర్మాతలు రాలేదు. ఒక సంవత్సరం తర్వాత మధు గారు, ఆ తర్వాత లక్ష్మణ్ గారు వచ్చారు. లక్ష్మణ్ గారు మా సినిమా ఫుటేజ్ చూసి ఆయనకు నచ్చి వచ్చారు. లక్ష్మణ్ గారు దిల్ రాజు గారితో చాలా సినిమాలు చేశారు. ఇప్పుడు ఆయన మా సినిమాలో భాగం కావడం చాలా ఆనందాన్ని ఇచ్చింది.

ట్రైలర్ చూస్తే ‘మురారి’ సినిమా ఛాయలు కనిపించాయి?
-ట్రైలర్‌లో చూపించినట్టుగా 33 ఏళ్లు దాటితే ఆ వంశంలో వ్యక్తులు చనిపోతున్నారు అనేది ‘మురారి’ సినిమా పాయింట్‌ని గుర్తు చేసినప్పటికీ, ఇందులో కథ, స్క్రీన్‌ప్లే చాలా భిన్నంగా ఉంటాయి. ఇది కంప్లీట్ గా డిఫరెంట్ సబ్జెక్ట్. 

అనూప్ రూబెన్స్ మ్యూజిక్ గురించి? 
-అనుప్ రూబెన్స్ గారి రీ-రికార్డింగ్ హైలెట్ అవుతుంది. మ్యూజిక్ గూస్‌బంప్స్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. సినిమాలో మ్యూజిక్ ఒక హైలెట్‌గా ఉంటుంది.

వారాహి అమ్మవారు పవర్‌ఫుల్. పవన్ కళ్యాణ్ గారు వారాహి మాల వేసుకోవడం, ఆ యాత్ర చేయడంతో అది ఇంకా ప్రచారంలోకి వచ్చింది. అది మీకు ఈ టైటిల్ విషయంలో ఎలా హెల్ప్ అయింది?
-కథ అనుకున్నప్పుడే మేము ఈ టైటిల్‌ని రిజిస్టర్ చేశాం. పవన్ కళ్యాణ్ గారికి వారాహి పాజిటివ్‌గా హెల్ప్ అయింది. కాబట్టి మా సినిమాకి కూడా అది కంటిన్యూ అవుతుందని ఆశిస్తున్నాం.
 
ఇందులో యాక్షన్ ఎలా వుంటుంది? 
-ఇందులో ఒక మూడు యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయి. అలాగే యాక్షన్ బ్లాక్స్ చాలా ఉంటాయి. యాక్షన్ చేయడం నాకు ఇష్టం. గతంలో కూడా చాలా యాక్షన్ సినిమాలు చేశాను. మంచి యాక్షన్ కథ వస్తే కచ్చితంగా చేస్తాను.

విలన్ పాత్రలు కూడా చేస్తారని చెప్పారు? 
-నేను ఎప్పటినుంచో విలన్ పాత్రలకు సిద్ధంగా ఉన్నాను. హీరో పాత్రలు చేయడంతో పాటు మంచి విలన్ క్యారెక్టర్లు, అలాగే బలమైన సపోర్టింగ్ క్యారెక్టర్ చేయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను.

 

 

 

 

[Sumanth Interview, Mahendragiri Varahi Movie, Mahesh Babu, Murari Movie, Pawan Kalyan, Siddhu Jonnalagadda, Telugu Film News, Telugu News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com