TeluguOne App Promotion
● # Tweets

Home

»

తాజా

బాలకృష్ణకు సుమలత క్షమాపణలు.. ఆ వివాదానికి ఎండ్ కార్డ్ పడినట్టేనా.?

Nov 28, 2026 10:37AM

టాలీవుడ్‌లో కొంతకాలంగా చర్చకు దారితీస్తున్న డ్యాన్సర్స్ యూనియన్ వివాదంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. జానీ మాస్టర్ భార్య, డ్యాన్సర్స్ అసోసియేషన్‌కు చెందిన సుమలత తాజాగా బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. ఫిల్మ్ ఛాంబర్‌లో జరిగిన ఘటనలతో పాటు, నందమూరి బాలకృష్ణపై గతంలో చేసిన వ్యాఖ్యల విషయంలోనూ ఆమె తన తప్పును అంగీకరించారు.

హైదరాబాద్‌లోని ఫిల్మ్ ఛాంబర్‌లో ఉన్న నిర్మాతల మండలి హాల్‌లో సుమలత ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సమావేశంలో నిర్మాతల మండలి కార్యదర్శి తుమ్మల ప్రసన్న కుమార్, దర్శక నిర్మాత వైవీఎస్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. తమ యూనియన్‌లో జరిగిన అవకతవకలతో మొదలైన వివాదం, ఆ తర్వాత ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్‌తో విభేదాలకు దారితీసిందని సుమలత వివరించారు.

ఛాంబర్ సమావేశానికి తాము నాన్ కోఆపరేషన్ గురించి మాట్లాడేందుకు వెళ్లామని, ఆ సమయంలో పల్లి కేశవరావుపై దాడి జరగడం తప్పేనని ఆమె అంగీకరించారు. ఈ ఘటనకు సంబంధించి ఫిల్మ్ ఛాంబర్ సభ్యులందరికీ, ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్‌కు క్షమాపణలు చెప్పారు. ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ హాల్‌లో జరిగిన ఘటనల విషయంలోనూ విచారం వ్యక్తం చేశారు. ఇకపై ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామని తెలిపారు.

ఇక బాలకృష్ణ విషయంలో సుమలత చేసిన వ్యాఖ్యలపై కూడా ఈ ప్రెస్‌మీట్‌లో స్పష్టత ఇచ్చారు. బాలకృష్ణ లాంటి పెద్దల వల్లే సినిమా పరిశ్రమ బాగుందని, వారి గురించి తప్పుగా మాట్లాడే అర్హత తమకు లేదని అన్నారు. గతంలో తాను మాట్లాడిన మాటలకు బాధపడుతున్నానని, వివాదాన్ని పరిష్కరించాలని సూచించిన బాలకృష్ణకు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో ఫెడరేషన్‌తో కలిసి పనిచేయాలని ఉందని చెప్పారు.

ఇది కూడా చదవండి: నంది అవార్డుల జ్యూరీ ఛైర్మన్‌గా బాలకృష్ణ.!

నిజానికి డ్యాన్సర్స్ యూనియన్ వివాదాన్ని పరిష్కరించాలని బాలకృష్ణ స్వయంగా ప్రసన్న కుమార్ వంటి వారికి సూచించారు. అదే విషయాన్ని అప్పుడు సుమలతకు ప్రసన్న కుమార్ చేరవేయగా.. ఆమె మాతో బాలకృష్ణ మాట్లాడలేదంటూ కామెంట్స్ చేశారు. దాంతో అది వివాదమైంది. ఇప్పుడు తన తప్పు తెలుసుకొని.. నేరుగా చెప్పబోయి, మరో అర్థమొచ్చేలా చెప్పానని, అందుకు క్షమించాలని సుమలత కోరారు.

మొత్తానికి సుమలత క్షమాపణలతో డ్యాన్సర్స్ యూనియన్ వివాదం సద్దుమణిగే దిశగా అడుగులు పడుతున్నట్లు కనిపిస్తోంది. అయితే యూనియన్‌లోని అంతర్గత సమస్యలు పూర్తిగా పరిష్కారం అవుతాయా? జానీ మాస్టర్‌పై ఉన్న ఆంక్షల విషయంలోనూ త్వరలో ఏదైనా నిర్ణయం వస్తుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.

మీకు నచ్చవచ్చు:
ఓటీటీలోకి ‘ఆదర్శ కుటుంబం’.. రెస్పాన్స్ ఎలా ఉందంటే.?
బ్రహ్మమొక్కటే: స్విట్జర్లాండ్‌లో మార్మోగిన అన్నమయ్య కీర్తన.!

 

 

 

[Dancers Union Controversy, Sumalatha Apology, Nandamuri Balakrishna, Jani Master]

 

google-ad-img