TeluguOne App Promotion
● # Tweets

Home

»

తాజా

నంది అవార్డుల జ్యూరీ ఛైర్మన్‌గా బాలకృష్ణ.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం!

Nov 27, 2026 10:32AM


 ఐదు దశాబ్దాల సినీ జీవితంతో ట్రావెల్ చేస్తున్న ధ్రువతార గాడ్ ఆఫ్ మాసెస్, హిందూపురం శాసన సభ్యులు బాలకృష్ణకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక బృహత్తరమైన బాధ్యతని అప్పగించింది. దీంతో అభిమానులు, సినీ ప్రియులు, తెలుగు ప్రజల్లో ప్రత్యేకమైన ఆసక్తి నెలకొని ఉంది.


తెలుగు సినీ పరిశ్రమలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే నంది అవార్డుల సందడి మళ్లీ మొదలుకాబోతోంది. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఈ అవార్డుల ప్రదానోత్సవానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేసింది. ఈ క్రమంలోనే నందమూరి బాలకృష్ణకు కీలక బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

జ్యూరీ ఛైర్మన్‌గా బాలయ్య.. సభ్యులుగా ఎవరంటే?

2025 సంవత్సరానికి సంబంధించిన నంది అవార్డుల ఎంపిక కోసం ఏర్పాటు చేసిన జ్యూరీ కమిటీకి నందమూరి బాలకృష్ణని ఛైర్మన్‌గా నియమించారు. ఈ కమిటీలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, సినీ ప్రముఖుడు ఎస్. గోపాల్ రెడ్డి, సీనియర్ నటి ప్రభ సభ్యులుగా ఉండనున్నారు. 

ఇది కూడా చదవండి:ఇంటర్వెల్ వరకు సూపర్: సెకండాఫ్‌ వచ్చేసరికి చేతులెత్తేస్తున్నారు..శాపమా? స్వయంకృతాపరాధమా?

ప్రభుత్వం జారీ చేసిన తాజా ఉత్తర్వులతో ఈ నియామకాలు ఖరారయ్యాయి. బాలకృష్ణ లాంటి సీనియర్ హీరోకు ఈ బాధ్యతలు అప్పగించడం ఇప్పుడు టాలీవుడ్‌లో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది.

2017 నుంచి పెండింగ్‌లో ఉన్న అవార్డులు!

నంది అవార్డుల ప్రదానం గత కొన్నేళ్లుగా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. 2017 నుంచి 2025 వరకు పెండింగ్‌లో ఉన్న అవార్డుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం ప్రత్యేక జ్యూరీ కమిటీలను ఏర్పాటు చేస్తోంది.

సినిమాలతో పాటు టెలివిజన్, నాటక రంగాలకు సంబంధించిన అవార్డులని కూడా అందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. డిసెంబర్‌లోనే అవార్డుల వేడుక నిర్వహించాలని ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

విజయవాడ లేదా అమరావతిలో వేడుక?

నంది అవార్డుల ప్రదానోత్సవాన్ని విజయవాడ లేదా అమరావతిలో ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. చాలా కాలం తర్వాత తెలుగు కళాకారులు, సాంకేతిక నిపుణులకు వారి ప్రతిభకు తగిన గుర్తింపు లభించే అవకాశం రావడంతో సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

మొత్తానికి బాలకృష్ణకు జ్యూరీ ఛైర్మన్ బాధ్యతలు అప్పగించడం, నంది అవార్డుల ప్రక్రియ మళ్లీ మొదలుకావడం టాలీవుడ్‌కు మంచి పరిణామమనే చెప్పాలి. మరి ఈసారి నంది అవార్డుల ఎంపికలో ఎలాంటి సినిమాలు, కళాకారులు విజేతలుగా నిలుస్తారో చూడాలి.

 

మీకు నచ్చవచ్చు

భోగి ట్విట్టర్ రివ్యూ ఇదే!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నయా సంచలనానికి సిద్దమవుతున్నాడా!

 

[Balakrishna, Nandi Awards, Ap Gov, Tollywood]

 

google-ad-img