Home

»

Latest News

హైడ్ & సిల్క్: చీరతో మొదలయ్యే ప్రేమకథ.. టైటిల్ ప్రోమోతో ఎవరైనా ప్రేమలో పడాల్సిందే.!

Oct 12, 2026 7:01PM

వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న నటుడు సుహాస్ మరో ఆసక్తికరమైన ప్రేమకథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈసారి చేనేత మగ్గం, ఓ చీర చుట్టూ సాగే అందమైన ప్రేమకథలో కనిపించనున్నారు. ఆయన నటిస్తున్న కొత్త సినిమాకు ‘హైడ్ & సిల్క్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. తాజాగా విడుదల చేసిన టైటిల్ ప్రోమో చూస్తుంటే.. ఇది రెగ్యులర్ లవ్ స్టోరీలకు భిన్నంగా ఉండబోతున్నట్లు అర్థమవుతోంది.

‘హైడ్ & సిల్క్’ టైటిల్ ప్రోమోలో సుహాస్ చేనేత కార్మికుడిగా కనిపిస్తున్నారు. చీర నేయడాన్ని కేవలం వృత్తిగా కాకుండా ఓ కళగా చూపిస్తూ వచ్చే సంభాషణలు ఆకట్టుకుంటున్నాయి. చేనేత మగ్గంపై నేసిన చీరకు ఉండే ప్రత్యేకతను తనికెళ్ల భరణి వాయిస్‌ ఓవర్‌ ద్వారా వివరించారు.

“నేత అనేది కేవలం ఒక పని మాత్రమే కాదు.. అదొక గొప్ప కళ” అనే భావనతో సాగే మాటలు ప్రోమోకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రతి చీరకూ దాన్ని కట్టుకునే ఓ మహిళ ముందే నిర్ణయించబడి ఉంటుందనే కవితాత్మకమైన ఆలోచనతో కథలోని ప్రేమకోణాన్ని పరిచయం చేశారు.

తాను మొదటిసారి నేసిన చీరను ఎవరు కట్టుకుంటారు? ఆమె ఎలా ఉంటుంది? ఎక్కడ ఉంటుంది? కనీసం ఒక్కసారైనా ఆమెను చూడగలనా? అనే ఆలోచనలతో సుహాస్ పాత్ర సాగించే ప్రయాణం ఈ ప్రేమకథకు ప్రధాన ఆకర్షణగా ఉండబోతున్నట్లు ప్రోమోతో హింట్ ఇచ్చారు. చీర ద్వారా ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమ ఎలా మొదలవుతుందనే ఆసక్తిని రేకెత్తించారు.

‘లబ్బర్ పందు’, ‘డీసీ’ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న సంజనా కృష్ణమూర్తి ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు. సుహాస్ తండ్రి పాత్రలో సీనియర్ నటుడు తనికెళ్ల భరణి కనిపించనున్నారు. రాజేంద్ర బాలా ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

స్టోన్ బెంచ్ స్టూడియోస్, మిస్రీలాల్ పిక్చర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. అమృత్ రామ్‌నాథ్ సంగీతం అందిస్తుండగా, కార్తీక్ పళని సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

ఇటీవల ‘మండాడి’ సినిమాలో విలన్ గా కనిపించిన సుహాస్.. ఇప్పుడు పూర్తిగా భిన్నమైన ప్రేమకథతో వస్తుండటం విశేషం. టైటిల్ ప్రోమోలో కనిపించిన కవితాత్మకమైన భావాలు, చేనేత నేపథ్యం సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. మరి ఈ చీర వెనుక దాగిన ప్రేమకథ ప్రేక్షకులను ఎంతలా ఆకట్టుకుంటుందో చూడాలి. 

ఇది కూడా చదవండి: పవన్ కళ్యాణ్ 30 ఏళ్ల జర్నీ.. కళ్యాణ్ బాబు నుంచి పవర్ స్టార్ వరకు.!

 

 

 

[Hide And Silk Title Promo, Hide & Silk Title Promo, Suhas Hide And Silk, Suhas Hide & Silk, Suhas New Movie, Sanjana Krishnamoorthy, Rajendra Bala, Tanikella Bharani, Telugu Film News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com