చిన్నోడితో మిస్ ఫైర్ అయింది.. మరి పెద్దోడి సంగతేంటో?
on Jun 4, 2020
‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’.. తెలుగునాట మల్టీస్టారర్ మూవీస్‌కి మళ్లీ ఊపు తీసుకువచ్చిన చిత్రం. రెండు తరాల అగ్ర కథానాయకులు విక్టరీ వెంకటేశ్, సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్లో రూపొందిన ఈ సినిమాని శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేశాడు. కథపరంగా మిశ్రమ స్పందన వచ్చినా.. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది ఈ సినిమా. 2013 సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం అటు వెంకీ, ఇటు మహేశ్ కెరీర్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ముఖ్యంగా చిన్నోడు, పెద్దోడుగా మహేశ్, వెంకీ నటన సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
ఇదిలా ఉంటే.. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ తర్వాత మహేశ్ బాబు సోలో హీరోగా ‘బ్రహ్మోత్సవం’ చిత్రాన్ని తెరకెక్కించాడు శ్రీకాంత్ అడ్డాల. భారీ తారాగణం, భారీ అంచనాలతో జనం ముందుకు వచ్చిన ఈ భారీ బడ్జెట్ మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. దీంతో శ్రీకాంత్‌కి అవకాశాలే కరువయ్యాయి. చిన్నోడు మహేశ్ కాంబినేషన్లో అనూహ్య పరాజయం అందుకున్న శ్రీకాంత్‌కి దాదాపు నాలుగేళ్ల గ్యాప్ తరువాత పెద్దోడు వెంకీ ఊహించని రీతిలో అవకాశం ఇచ్చాడు. ఆ అవకాశమే ‘నారప్ప’ చిత్రం. కోలీవుడ్ సెన్సేషనల్ మూవీ ‘అసురన్’ రీమేక్‌గా ఈ క్రేజీ ప్రాజెక్ట్ తెరకెక్కుతోంది. ఇప్పటికే 70 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమాకి కరోనా కారణంగా బ్రేక్ పడింది. త్వరలోనే చిత్రీకరణ పునఃప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. అంతేకాదు.. 2021 సంక్రాంతికి రిలీజ్ చేసే దిశగా ప్లానింగ్ జరుగుతోందని టాక్.
మరి చిన్నోడితో మిస్ ఫైర్ అయిన శ్రీకాంత్‌కి.. పెద్దోడితో బౌన్స్ బ్యాక్ రిజల్ట్ దక్కుతుందేమో చూడాలి. అలాగే.. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ తరహాలో సంక్రాంతి సీజన్లోనే ‘నారప్ప’ కూడా రిలీజ్ కానుండడం.. సెంటిమెంట్ పరంగా కలిసొచ్చి శ్రీకాంత్ అడ్డాల పూర్వ వైభవం దక్కించుకుంటాడేమో చూడాలి.