టాలీవుడ్లో అభిమానులు ఎంతో ఇష్టపడే జంటల్లో రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ జంట ఒకటి. వెండితెరపై ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ సినిమాలతో ఆకట్టుకున్న ఈ జంట.. నిజ జీవితంలోనూ ఒక్కటై అభిమానులకు సంతోషాన్ని పంచింది. ఈ ఏడాది ఫిబ్రవరి 26న వివాహ బంధంలోకి అడుగుపెట్టిన వీరిద్దరూ తాజాగా ‘కాఫీ విత్ కరణ్’ టాక్ షోలో సందడి చేయబోతున్నారు. ఈ సందర్భంగా విడుదలైన ప్రోమోలో తమ పెళ్లి గురించి ఆసక్తికర విషయాలను పంచుకోవడంతో పాటు సరదాగా మాట్లాడుకున్న తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఈ ప్రోమోలో కరణ్ జోహార్.. మీ ఇద్దరిలో ఎవరు ముందుగా పెళ్లి ప్రపోజల్ చేశారని అడిగారు. దీనికి విజయ్ స్పందిస్తూ.. రష్మికే తనను పెళ్లి చేసుకుందామని అడిగిందని, అలా ఒకటి కాదు రెండు కాదు.. దాదాపు 100 సార్లు అడిగిందని సరదాగా చెప్పాడు. దీంతో కరణ్ నిజంగానే అన్ని సార్లు అడిగావా అని రష్మికను ప్రశ్నించగా.. “ఒక ఏడాది మొత్తం అడిగాను” అంటూ ఆమె నవ్వుతూ సమాధానమిచ్చింది. వీరిద్దరి మధ్య జరిగిన ఈ సరదా సంభాషణ ప్రోమోలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఇక ఇదే షోలో మరో ఆసక్తికరమైన సందర్భం కూడా చోటుచేసుకుంది. రష్మికతో పాటు విజయ్కు తెరపై మంచి కెమిస్ట్రీ ఉన్న మరో నటుడు ఎవరని కరణ్ అడిగితే.. రష్మిక వెంటనే “ఇంకెవరూ లేరు” అన్నట్టుగా స్పందించింది. దీనికి విజయ్ నవ్వుతూ.. “వివాహంలో 101వ నియమం.. భార్యతో ఏకీభవించాలి” అని చమత్కరించాడు. అలాగే ర్యాపిడ్ ఫైర్ రౌండ్లో అల్లు అర్జున్, రణ్బీర్ కపూర్లలో ఎవరిని ఎంచుకుంటారని అడగ్గా.. రష్మిక అల్లు అర్జున్ పేరును చెప్పింది. ఈ సంభాషణలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.
ప్రస్తుతం రష్మిక, విజయ్ కలిసి నటించిన ‘రణబాలి’ సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రావడంతో ఈ జంట గురించి మరోసారి చర్చ జరుగుతోంది. తెరపై తమ కెమిస్ట్రీతో అభిమానులను ఆకట్టుకున్న ఈ ఇద్దరూ.. నిజ జీవితంలోని సరదా కబుర్లతోనూ అలరిస్తున్నారు. ‘కాఫీ విత్ కరణ్’లో వీరిద్దరూ పంచుకోనున్న మరిన్ని విషయాల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
[Rashmika Mandanna, Vijay Deverakonda, Rashmika Vijay Wedding, Koffee With Karan 9, Rashmika Marriage Proposal, Vijay Deverakonda Interview, Rashmika Vijay Viral Promo, Ranabaali Movie]




