
సోషల్ మీడియా వలనో లేక కొత్తగా పుట్టుకొచ్చిన తెలివో, నాకు కూడా అన్ని తెలిసిపోయాయి కదా అని మాట్లాడటమో తెలియదు గాని ఈ మధ్య పాన్ ఇండియా అనే వర్డ్ విపరీతంగా తన హవాని చాటుతూ ఉంది. అదేనండి మా సినిమా పాన్ ఇండియా అని చెప్పే ప్రకటనల ద్వారా.. కానీ నిజంగానే ‘పాన్ ఇండియా’ అనేది ఈ మధ్యే కొత్తగా పుట్టుకొచ్చిన పదమా? లేక దీని వెనుక దశాబ్దాల సుదీర్ఘ చరిత్ర ఉందా?
ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మన భారతీ సినిమా పరిశ్రమలో ఈ పాన్ ఇండియా సంస్కృతి ఇప్పటిది కాదు. దశాబ్దాల క్రితమే ప్రాంతీయ సరిహద్దులని చెరిపేస్తూ దేశమంతటినీ ఏకం చేసిన గొప్ప ప్రయత్నాలు ఎన్నో జరిగాయి. 1940ల కాలంలోనే ఎస్.ఎస్. వాసన్ నిర్మించిన ‘చంద్రలేఖ’ (1948) చిత్రం భారతదేశమంతటా సంచలనం సృష్టించింది. తమిళంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని హిందీతో సహా పలు భాషల్లోకి డబ్ చేసి విడుదల చేశారు. ఆ రోజుల్లోనే దేశవ్యాప్తంగా 1 కోటి పైగా వసూళ్లను రాబట్టి మొదటి ఆల్ ఇండియా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఆ తర్వాత 1957లో వచ్చిన మన తెలుగు క్లాసిక్ ‘మాయాబజార్’ తమిళంలోనూ విడుదలై దేశవ్యాప్తంగా ప్రేక్షకుల మనసు దోచుకుంది. అలాగే ఎన్టీఆర్ నటించిన ‘పాతాళభైరవి’ (1951) హిందీలోకి డబ్ అయి ఉత్తరాదిలో 100 రోజులకు పైగా ఆడి సరికొత్త రికార్డులను నమోదు చేసింది.
కాలక్రమంలో 1980లు, 1990లలో కమల్ హాసన్ నటించిన ‘నాయకన్’, ‘అపూర్వ సహోదరర్లు’, ‘భారతీయుడు’ మరియు మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘రోజా’ (1992), ‘బొంబాయి’ (1995) చిత్రాలు భాషా సరిహద్దులను బద్దలు కొట్టాయి. కేవలం ఏఆర్ రెహమాన్ సంగీతం, బలమైన కథనంతో ‘రోజా’ చిత్రం ఆ రోజుల్లోనే ఉత్తరాది వ్యాప్తంగా ప్రభంజనం సృష్టించి 25 కోట్లకు పైగా కలెక్షన్లను సాధించింది. అలాగే శంకర్ దర్శకత్వంలో వచ్చిన జెంటిల్ మెన్, ‘జీన్స్’, ‘రోబో’ సినిమాలు టెక్నికల్ వాల్యూస్‌తో దేశవ్యాప్తంగా ప్రేక్షకాదరణ పొందాయి. కింగ్ నాగార్జున అయితే తన కెరీర్ స్టార్టింగ్ లోనే అంటే మూడు దశాబ్దాలకి క్రితమే చాలా సినిమాల్లో ఇతర బాషా దర్శకులు, హీరోయిన్స్, నటులతో పని చేసి పాన్ ఇండియా సువాసనాలని అద్దాడు.
ఇది కూడా చదవండి: స్టార్ హీరో అంటే అర్ధం ఏంటి? ప్లాప్ అయినా కలెక్షన్స్ రావాలి కదా.. మరి ఎందుకు రావు!
అయితే, ఈ ‘పాన్ ఇండియా’ అనే పదానికి పూర్తిస్థాయి నిర్వచనం ఇస్తూ గ్లోబల్ బ్రాండ్‌గా మార్చింది మాత్రం దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ సిరీస్. 2015లో వచ్చిన ‘బాహుబలి: ది బిగినింగ్’ 650 కోట్లు సాధిస్తే, 2017లో వచ్చిన ‘బాహుబలి 2: ది కన్‌క్లూజన్’ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1,810 కోట్ల మైండ్ బ్లోయింగ్ కలెక్షన్లను రాబట్టింది. హిందీ బెల్ట్‌లోనే దాదాపు రూ. 511 కోట్లు నెట్ కలెక్ట్ చేసి సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. ఈ సినిమా విజయంతోనే భారతీయ చిత్రసీమలో 1000 కోట్ల క్లబ్ ఆలోచన మొదలైంది. ఆ తర్వాత కన్నడ పరిశ్రమ నుంచి వచ్చిన ‘కేజీఎఫ్ 2’ ( 1,250 కోట్లు), తెలుగు నుంచి వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ (రూ. 1,300 కోట్లు) చిత్రాలు పాన్ ఇండియా మార్కెట్‌ను ఆకాశమే హద్దుగా విస్తరించాయి.

గతంలో ప్రాంతీయ సినిమాలు కేవలం డబ్బింగ్ సినిమాల్లా వచ్చి వెళ్లేవి. కానీ నేడు ఒకే సమయంలో అన్ని భాషల్లో ప్రమోషన్లు చేస్తూ, బహుభాషా నటులను తీసుకుంటూ, నాణ్యమైన విజువల్ ఎఫెక్ట్స్ మరియు universal emotional content తో నిర్మించడమే అసలైన పాన్ ఇండియా సినిమాగా మారింది. నేడు భారతీయ సినిమా మార్కెట్ విలువ 20,000 కోట్లకు పైగా ఉంటే, అందులో పాన్ ఇండియా సినిమాల వాటా దాదాపు 35% నుంచి 40% వరకు ఉంది. అంటే నిన్నటి తరం చేసిన చిన్న ప్రయోగాలు, నేడు ఒక అతిపెద్ద బిజినెస్ మోడల్‌గా మరియు గ్లోబల్ ట్రెండ్‌గా రూపాంతరం చెందాయి.
[Pan India Movies History And Origin, pan india movies history, south indian cinema trend, baahubali box office collection, Telugunews, TeluguCinema, Tollywood, Tollywood News]






