తొడగొడితే ట్రైన్ వెళ్లిపోవడమేంటి?
on Jan 23, 2016
పల్నాటి బ్రహ్మనాయుడు సినిమాని తెలుగు ప్రేక్షకులు అంత తేలిగ్గా మర్చిపోరు. అదేం సూపర్ హిట్ మూవీ కాదు..కానీ.. బాలయ్య ఫ్యాన్స్‌కి మాత్రం స్పెషల్. ఎందుకంటే అప్పటి వరకూ ఏ తెలుగు సినిమాల్లోనూ కనిపించని విన్యాసం ఒకటి.. అందులో బాలయ్య చేశాడు. అదే.. తొడ గొడితే ట్రైన్ వెనక్కి వెళ్లిపోవడం. ఆ సీన్ పై రకరకాల స్నూఫ్‌లు వచ్చాయి.. ఆ సీన్ కి సంబంధించిన విజువల్స్ ఫేస్బుక్ లో ఇప్పటికీ రన్ అవుతూనే ఉంటాయి. తెలుగు చిత్రసీమలో కనీవినీ ఎరుగని అద్భుతంగా ఆ సీన్‌పై జోకులు వేసుకొంటారు సినీ ప్రియులు.
ఈ సన్నివేశం గురించి బాలయ్య తొలిసారి స్పందించాడు. ``తొడగొడితే ట్రైన్ వెనక్కి వెళ్లిపోవడం ఏమిటి? అది చాలా టూమచ్‌గా అనిపించింది. ఆరోజు ఏదో వేడిలో చేసేసిన సీన్ అది. ఆ తరవాత తలచుకొంటే నవ్వొస్తుంది.. ఎందుకు చేశానా అనిపిస్తోంది`` అంటూ చెప్పుకొచ్చాడు. నిజంగా... బాలయ్య ఈ విషయాన్ని నిర్మొహమాటంగా ఒప్పుకోవడం, తాను చేసిన సీన్‌కి టూమచ్ అంటూ సర్టిఫికెట్ ఇవ్వడం.. ఆయన సింప్లిసిటీకి నిదర్శనంగా కనిపిస్తాయి. బాలయ్యే స్వయంగా ఇది టూమచ్ సీన్ అని చెప్పేశాడు కాబట్టి.. ఇకమీదట ఆ జోకులన్నీ ఆగిపోయినట్టే.