TeluguOne App Promotion
● # Tweets

Home

»

తాజా

ఎన్టీఆర్‌తో వీడియో కాల్‌ మాట్లాడిన అభిమాని కౌశిక్‌ కన్నుమూత!

Mar 8, 2025 1:18PM

ఏ హీరో అయినా టాప్‌ పొజిషన్‌కి వెళ్లారంటే.. దానికి ప్రేక్షకుల ఆదరణ, అభిమానుల ప్రేమ కారణమవుతాయి. కొందరు అభిమానులు తమ హీరోని దైవంగా భావిస్తారు. తమ కుటుంబ సభ్యుల కంటే ఎక్కువగా ప్రేమిస్తారు. కొన్నిసార్లు అభిమానుల ప్రేమను హీరోలు తట్టుకోలేరు. వారి ప్రేమ ఆ స్థాయిలో ఉంటుంది. అలాంటి వారికి ఏదైనా సమస్య వస్తే ఎంత దూరమైనా వెళ్లి వారిని కలుసుకుంటారు హీరోలు. దేశవ్యాప్తంగా ఎన్టీఆర్‌కి ఉన్న ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ గురించి అందరికీ తెలుసు. ఎన్టీఆర్‌ కూడా అభిమానులను దేవుళ్లుగా భావిస్తారు. అతని సినిమాకి సంబంధించి ఎలాంటి ఈవెంట్‌ జరిగినా.. మీ కోసం మీ కుటుంబ సభ్యులు ఎదురు చూస్తుంటారని, ఇంటికి క్షేమంగా చేరుకోవాలని ప్రత్యేకంగా కోరుతుంటారు. ఎందుకంటే ఎన్టీఆర్‌ తండ్రి హరికృష్ణ, అన్నయ్య జానకిరామ్‌ రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఇద్దరు కుటుంబ సభ్యుల్ని కోల్పోయిన ఎన్టీఆర్‌.. తన కుటుంబ సభ్యుల్లాంటి అభిమానుల క్షేమాన్ని ఎప్పుడూ కోరతారు. 

కొందరు అభిమానులు తమ హీరోని చూడాలని, కలిసి మాట్లాడాలని అనుకుంటారు. కానీ, కుదరదు. అలాగే ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న అభిమానులు తమ హీరోని కలుసుకోవాలని చివరి కోరికగా చెబుతారు. వారు కోరినట్టుగానే టాలీవుడ్‌ హీరోలు కొందరు తమ అభిమానుల చివరి కోరిక తీర్చారు. కొంతకాలం క్రితం తిరుపతికి చెందిన కౌశిక్‌ అనే అభిమాని క్యాన్సర్‌ బారినపడి మృత్యువుతో పోరాడుతున్నాడన్న విషయం తెలుసుకొని ఎన్టీఆర్‌ తల్లడిల్లిపోయారు. తన అభిమాన హీరో ఎన్టీఆర్‌తో మాట్లాడడం తన చివరి కోరిక అని ఆ అభిమాని చెప్పడంతో అతని కోరిక మన్నించి వీడియో కాల్‌ ద్వారా కౌశిక్‌తో మాట్లాడి అతనికి ధైర్యం చెప్పారు ఎన్టీఆర్‌. ‘నువ్వు ఎప్పుడూ ఇలాగే నవ్వుతూ ఉండాలి. నీ ఆరోగ్యం కోసం నేను కూడా ఆ దేవుడ్ని ప్రార్థిస్తూ ఉంటాను. నువ్వు పూర్తి ఆరోగ్యవంతుడివి కావాలని మేమంతా కోరుకుంటున్నాం. వీలు చూసుకొని తప్పకుండా నేను నిన్ను కలుస్తాను. నువ్వు పూర్తిగా కోలుకో.. ఇద్దరం కలిసి ‘దేవర’ సినిమా చూద్దాం’ అంటూ కౌశిక్‌తో మాట్లాడారు ఎన్టీఆర్‌. ఆ తర్వాత కౌశిక్‌ తల్లితో కూడా మాట్లాడి ఆమెకు ధైర్యం చెప్పారు. అయితే కౌశిక్‌ క్యాన్సర్‌తో పోరాటం చెయ్యలేకపోయాడు. శుక్రవారం రాత్రి 11 గంటలకు కౌశిక్‌ తుది శ్వాస విడిచాడని సమాచారం అందుతోంది. ఈ విషయం తెలుసుకున్న ఎన్టీఆర్‌ అభిమానులు కౌశిక్‌ కుటుంబ సభ్యులకు తమ సానుభూతిని తెలియజేస్తూ అతని ఆత్మకు శాంతి చేకూరాలని సోషల్‌ మీడియాలో పోస్టులు పెడతున్నారు. 

google-ad-img