‘నాన్న కుట్టి’ ట్రైలర్: కూతురి కోసం ప్రాణాలైనా ఇచ్చే తండ్రి.. కథలో అసలు ట్విస్ట్ ఇదే.!
Nov 25, 2026 11:29AM

కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోని మరోసారి ఎమోషనల్ కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘నాన్న కుట్టి’. మారన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నవంబర్ 27న థియేటర్లలోకి రానుంది. తాజాగా విడుదలైన ట్రైలర్ చూస్తుంటే.. ఈసారి విజయ్ ఆంటోని తండ్రీకూతుళ్ల అనుబంధంతో ప్రేక్షకుల మనసులు గెలుచుకోవాలని చూస్తున్నట్లు అనిపిస్తోంది. ముఖ్యంగా ఈ సినిమా ఒక యదార్థ సంఘటన ఆధారంగా రూపొందిందని మూవీ టీం చెప్పడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
ట్రైలర్ ప్రారంభమే చాలా ఆసక్తికరంగా ఉంది. తన కూతురు దియా (బేబీ లితన్య)తో విజయ్ ఆంటోని మాట్లాడే సన్నివేశంతో కథలోకి తీసుకెళ్లారు. ‘దియా.. నీకు అమ్మ అంటే చాలా ఇష్టమా?’ అని తండ్రి అడిగితే.. ‘ఇష్టమే’ అని కూతురు సమాధానం చెబుతుంది. చిన్నప్పటి నుంచి అమ్మను చూడలేదు కదా? అయినా ఎందుకంత ఇష్టం అని తండ్రి అడుగుతాడు. దానికి ఆ చిన్నారి ఇచ్చే సమాధానం చాలా బాగుంది. ‘నీకు దేవుడంటే ఇష్టం కదా నాన్న కుట్టి.. నువ్వు దేవుడిని చూశావా?’ అని తిరిగి ప్రశ్నిస్తుంది. ఈ ఒక్క డైలాగ్‌తోనే తండ్రీకూతుళ్ల మధ్య ఉన్న అనుబంధాన్ని దర్శకుడు ఎంత అందంగా చూపించబోతున్నారో అర్థమవుతోంది.
అయితే ‘నాన్న కుట్టి’ కేవలం తండ్రీకూతుళ్ల సెంటిమెంట్‌తోనే సాగిపోయే సినిమా కాదని ట్రైలర్ స్పష్టం చేస్తోంది. విజయ్ ఆంటోని పాత్రలో మరో కోణాన్ని కూడా చూపించారు. కూతురి కోసం ఎంత దూరమైనా వెళ్లే తండ్రిగా ఒకవైపు ఎమోషనల్‌గా కనిపిస్తూనే, మరోవైపు యాక్షన్ సన్నివేశాల్లోనూ ఆకట్టుకుంటున్నారు.

ఇక ట్రైలర్లో అసలు ఆసక్తికరమైన అంశం కూతురికి ఎదురయ్యే సమస్య. కూతురి ఆరోగ్య పరిస్థితి, స్కూల్ టీచర్‌తో వచ్చే సన్నివేశాలు, భార్యకు సంబంధించిన మిస్టరీ.. ఇలా కథలో చాలా విషయాలను చూపించారు.
ఇది కూడా చదవండి: అమీర్‌పేట వీధుల్లో ‘బిచ్చగాడు’ సందడి.. మిర్చి బజ్జీలు వేసిన హీరో.!
మరోవైపు అనుమానిత వ్యక్తులను విజయ్ ఆంటోని ఫాలో అవడం, పోలీస్ స్టేషన్, కోర్టు సన్నివేశాలు చూస్తుంటే కథలో ఏదో బలమైన థ్రిల్లర్ పాయింట్ ఉన్నట్లు అనిపిస్తోంది. తన కూతురికి ఏదో ప్రమాదం ఎదురైందని తెలుసుకున్న తండ్రి, ఆమెను కాపాడేందుకు చేసే పోరాటమే కథలో ప్రధాన అంశంగా కనిపిస్తోంది.
ట్రైలర్ చివర్లో వచ్చే ఓ సన్నివేశం ప్రత్యేకంగా ఆకట్టుకుంటోంది. కూతురి ముందు ఏడవలేని ఓ తండ్రి.. సముద్రపు అలల మధ్య పడుకుని తన కన్నీళ్లను దాచుకుంటాడు. ఆ సన్నివేశం సినిమాలో ఎలాంటి భావోద్వేగాలు ఉండబోతున్నాయో చెప్పకనే చెబుతోంది.
ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో విజయ్ ఆంటోని చెప్పిన మాటలు కూడా ఆసక్తికరంగా ఉన్నాయి. సినిమా ఫస్ట్ హాఫ్ సరదాగా, హ్యూమర్‌తో సాగుతుందని.. సెకండాఫ్ మాత్రం పూర్తిగా ఎమోషనల్‌గా ఉంటుందని ఆయన తెలిపారు.
మొత్తానికి ట్రైలర్ చూస్తుంటే తండ్రీకూతుళ్ల అనుబంధాన్ని ప్రధానంగా తీసుకుని దానికి థ్రిల్లర్, యాక్షన్ అంశాలను జోడించినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా విజయ్ ఆంటోని చెప్పినట్లుగా ఫస్ట్ హాఫ్‌లో వినోదం, సెకండాఫ్‌లో ఎమోషన్స్ ఏ స్థాయిలో ఉంటాయన్నది ఆసక్తికరం.
‘బిచ్చగాడు’తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన విజయ్ ఆంటోని, ఈసారి తండ్రి పాత్రతో మరోసారి మనసులు గెలుచుకుంటారా? అనేది చూడాలి.
మీకు నచ్చవచ్చు:
శ్రీవిష్ణుపై నాని ఫ్యాన్స్ ఫైర్.. మెగా ఫ్యాన్స్ కూడా హర్ట్ అయ్యారు.!
15 ఏళ్ల సోలో.. నారా రోహిత్ కెరీర్లో స్పెషల్ మూవీ.!
[Nanna Kutty Trailer, Appa Kutty Telugu, Vijay Antony, Preethi Asrani, Mu Maran]



