
నేచురల్ స్టార్ నాని ఊహించని షాక్ ఇచ్చారు. భారీ అంచనాలు ఉన్న ‘ది ప్యారడైజ్’ మూవీకి ట్రైలర్ విడుదల చేయడం లేదని నాని స్పష్టం చేశారు.
సాధారణంగా ఏదైనా ఒక పెద్ద సినిమా వస్తోందంటే.. రిలీజ్‌కు ముందు ట్రైలర్ కోసం ఫ్యాన్స్ కళ్లల్లో ఒత్తులేసుకుని ఎదురుచూస్తుంటారు. పైగా 'దసరా' వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత హీరో నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో 'ది ప్యారడైజ్' ట్రైలర్ ఏ రేంజ్‌లో ఉంటుందో అని అందరూ ఆశపడ్డారు. కానీ, ఈ సినిమాకు అసలు ట్రైలరే ఉండదని ప్రకటించి ఆడియన్స్‌కు పెద్ద సర్ ప్రైజ్ ఇచ్చారు నాని.
ఈ సినిమా సెప్టెంబరు 24న గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా శుక్రవారం రోజున ‘ది ప్యారడైజ్’ టీమ్ విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో హీరో నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, నిర్మాత సుధాకర్ చెరుకూరి పాల్గొని మాట్లాడారు. ఈ ప్రెస్ మీట్‌లోనే నాని ఈ సంచలన విషయాన్ని బయటపెట్టారు.
"ది ప్యారడైజ్‌కు ట్రైలర్ ఇవ్వడం లేదు" అని నాని చెప్పారు. ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణాన్ని కూడా ఆయన వివరించారు. "నాణ్యతతో కూడిన అత్యుత్తమమైన సినిమాను ప్రేక్షకులకు అందించడానికి ప్రస్తుతం చాలా టీమ్‌లు రాత్రింబవళ్లు పనిచేస్తున్నాయి. ఒకవేళ మీకు ట్రైలర్ ఇస్తే... అది అదిరిపోయే రేంజ్‌లో ఉండాలి. అలాంటి ఒక కట్ కావాలంటే దర్శకుడు శ్రీకాంత్, సంగీత దర్శకుడు అనిరుధ్ అందరూ కలిసి నాలుగైదు రోజులు కేవలం ట్రైలర్ వర్క్ పైన మాత్రమే పనిచేయాల్సి వస్తుంది. కానీ, సినిమా విడుదలకు చాలా తక్కువ సమయం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో మాకు ట్రైలర్ కంటే సినిమా అవుట్‌పుట్ క్వాలిటీగా రావడమే ముఖ్యం. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నాం" అని నాని ఓపెన్‌గా చెప్పారు.
ప్రమోషన్ల కోసం అరకొర ట్రైలర్ ఇచ్చి ప్రేక్షకులను నిరాశపరచడం కంటే... ఆ సమయాన్ని సినిమా నాణ్యత పెంచడానికే కేటాయించాలనే నాని అండ్ టీమ్ ఆలోచన నిజంగా ప్రశంసనీయం. ఒకవైపు విడుదల తేదీ దగ్గర పడుతుండటం, మరోవైపు అనిరుధ్ రీ-రికార్డింగ్, శ్రీకాంత్ ఓదెల పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉండటంతోనే ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు అర్థమవుతోంది. ట్రైలర్ లేకపోయినా నాని నమ్మకం చూస్తుంటే థియేటర్లలో బొమ్మ బ్లాక్‌బస్టర్ కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది.
[The Paradise Trailer, Natural Star Nani, Srikanth Odela, The Paradise Movie, Anirudh Ravichander, Sudhakar Cherukuri, Telugu Film News, Telugu News]





