
అక్కినేని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా 'లెనిన్' (Lenin). మే 1న విడుదల కావాల్సిన ఈ మూవీ, జూన్ 26కి వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే జూన్ 25న 'పెద్ది' విడుదలవుతుండటంతో.. 'లెనిన్' మళ్ళీ వాయిదా పడటం ఖాయమని ప్రచారం మొదలైంది. ఈ నేపథ్యంలో నాగార్జున (Nagarjuna) కీలక ప్రకటన చేశారు.
అఖిల్ అక్కినేని (Akhil Akkineni) హీరోగా నటిస్తున్న 'లెనిన్' సినిమాపై తాజా అప్‌డేట్‌తో కింగ్ నాగార్జున సోషల్ మీడియాలో సందడి చేశారు. ఈ సినిమా ఫస్ట్ కట్ చూసిన నాగ్.. తన ఆనందాన్ని, నమ్మకాన్ని అభిమానులతో పంచుకున్నారు. అలాగే పోస్ట్ పోన్ రూమర్స్ కి చెక్ పెట్టారు.
నాగార్జున ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ.. "నిన్న రాత్రి మా సినిమా 'లెనిన్' ఫస్ట్ కట్ చూశాను. పూర్తి ఆత్మవిశ్వాసంతో, గర్వంతో చెబుతున్నాను.. జూన్ 26, 2026న మీరు ఒక సరికొత్త అఖిల్‌ను వెండితెరపై చూడబోతున్నారు. ఈ తేదీని గుర్తుపెట్టుకోండి. థియేటర్లలో కలుద్దాం" అంటూ పోస్ట్ చేశారు. అఖిల్ బాడీ లాంగ్వేజ్, పర్ఫార్మెన్స్ ఈ సినిమాలో విభిన్నంగా ఉండబోతున్నాయని నాగ్ మాటలను బట్టి అర్థమవుతోంది.

'వినరో భాగ్యము విష్ణుకథ' ఫేమ్ మురళీ కిషోర్ అబ్బూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా రాయలసీమ నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామా అని తెలుస్తోంది. ఇందులో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, థమన్ అందించిన పాటలు ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేశాయి. అఖిల్ తన గత చిత్రం 'ఏజెంట్' తర్వాత చాలా గ్యాప్ తీసుకుని ఈ సినిమా కోసం కష్టపడుతున్నాడు. అందుకే అక్కినేని ఫ్యాన్స్ ఈ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నారు.
అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ జూన్ 26న విడుదల కానుందని క్లారిటీ వచ్చేసింది. రామ్ చరణ్ 'పెద్ది' వంటి భారీ మూవీ పోటీలో ఉన్నప్పటికీ, అవుట్‌పుట్‌పై ఉన్న నమ్మకంతో 'లెనిన్' టీమ్ బాక్సాఫీస్ వార్ కి సై అంటుంది. మరి ఈ 'లెనిన్' మూవీ అఖిల్ కి మంచి విజయాన్ని అందిస్తుందేమో చూడాలి.






