బిగ్ బ్రేకింగ్.. ఆస్కార్ నామినేషన్స్ లో 'నాటు నాటు' సాంగ్
on Jan 24, 2023
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రధారులుగా దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన 'ఆర్ఆర్ఆర్' మూవీ సంచలనం సృష్టించింది. ఆ చిత్రంలోని 'నాటు నాటు' సాంగ్ అత్యంత ప్రతిష్టాత్మక ఆస్కార్ నామినేషన్స్ లో చోటు దక్కించుకుంది. తాజాగా ఆస్కార్ నామినేషన్స్ అధికారికంగా విడుదల కాగా.. ఒరిజినల్ సాంగ్ విభాగంలో 'నాటు నాటు' సాంగ్ కి చోటు దక్కింది. దీంతో తెలుగుతో పాటు ఇండియన్ సినీ ప్రియులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
భాష, ప్రాంతంతో సంబంధం లేకుండా ప్రపంచవ్యాప్తంగా 'నాటు నాటు' పాటు ఒక ఊపు ఊపింది. ఇప్పటికే బెస్ట్ ఒరిజినల్ సాంగ్ గా గోల్డెన్ గ్లోబ్స్ అవార్డును సొంతం చేసుకున్న 'నాటు నాటు'.. ఆస్కార్ బరిలో ఖచ్చితంగా నిలుస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఆ అంచనాలను నిజం చేస్తూ 'నాటు నాటు' సాంగ్ నిజంగానే ఆస్కార్ నామినేషన్ దక్కించుకుంది. ఇదే జోష్ లో ఆస్కార్ ని సైతం గెలుచుకొని తెలుగు ప్రేక్షకులు అసలుసిసలు సెలబ్రేషన్ చేసుకునేలా చేస్తుందేమో చూడాలి.
ఎంఎం కీరవాణి స్వరపరిచిన 'నాటు నాటు' పాటకు చంద్రబోస్ సాహిత్యం అందించగా.. రాహుల్ సిప్లిగుంజ్, కాల భైరవ ఆలపించారు.