ENGLISH | TELUGU  

ద‌ర్శ‌కేంద్రుడు సిద్ధం చేస్తున్న యూనిక్ ప్రాజెక్ట్ ఏంటి?

on Aug 4, 2020

 

కమర్షియల్‌గా తెలుగు సినిమాని శిఖరాగ్ర స్థాయికి తీసుకెళ్లిన అగ్రగణ్య దర్శకుల్లో కె. రాఘవేంద్రరావు ముందు వరుసలో ఉంటారనే సంగతి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. కెరీర్ తొలినాళ్లలో 'జ్యోతి', 'ఆమె కథ', 'ప్రేమలేఖలు', 'కల్పన' వంటి నాయిక ప్రధాన చిత్రాలతో విజయాలు సాధించిన ఆయన అనంతర కాలంలో టాప్ కమర్షియల్ డైరెక్టర్‌గా ఎదిగారంటే నిరంతరం తనలోని ప్రతిభను మెరుగు పరచుకుంటూ రావడం వల్లే.

1977లో ఎన్టీ రామారావు హీరోగా ఆయన రూపొందించిన 'అడవిరాముడు' సాధించిన సంచలనాలతో ఆయన ఒక్కసారిగా టాప్ డైరెక్టర్ అయిపోయారు. అప్పట్లో ఆ సినిమా సాధించిన కలెక్షన్లు అందర్నీ అబ్బురపరిచాయి. మరీ ముఖ్యంగా అందులోని 'ఆరేసుకోబోయి పారేసుకున్నా' పాట అనంతర కాలంలో తెలుగు సినిమా పాట స్థితిగతుల్నే మార్చేసింది. 'పదహారేళ్ల వయసు', 'వేటగాడు', 'కొండవీటి సింహం', 'జస్టిస్ చౌదరి', 'దేవత', 'బొబ్బిలి బ్రహ్మన్న', 'అగ్నిపర్వతం', 'జగదేకవీరుడు అతిలోకసుందరి', 'మేజర్ చంద్రకాంత్', 'పెళ్లి సందడి', 'గంగోత్రి' వంటి సినిమాలు కమర్షియల్ డైరెక్టర్‌గా ఆయన ప్రతిభకు తార్కాణాలు. అటువంటి డైరెక్టర్ దృష్టి కొంతకాలం క్రితం భక్తిరసం వైపు మళ్లింది.

ఫలితంగా చారిత్రక కథలకు కమర్షియల్ హంగులద్ది ఆయన రూపొందించిన భక్తిరస చిత్రాలు 'అన్నమయ్య', 'శ్రీరామదాసు' ఆయన కీర్తిని మరింత పెంచాయి. గ‌త ఏడాది ఎన్టీఆర్ జ‌యంతి సంద‌ర్భంగా, "నా యాభై ఏళ్ళ సినీ జీవితం లో అన్నగారితో ప్రయాణం ఎన్నటికీ మరువలేనిది. గత జన్మల సుకృతంగా భావిస్తాను. ఆ మహానుభావుడి జయంతి సందర్భంగా నా తదుపరి చిత్రాన్ని ప్రకటించడం ఆనందంగా ఉంది. నా కెరీర్ లో ఈ చిత్రం ప్రత్యేకం. మరింత కొత్తగా ప్రయత్నించబోతున్నాను. పూర్తి వివరాలు త్వరలో" అని ఆయ‌న త‌న సోష‌ల్ మీడియా అకౌంట్ ద్వారా అప్పుడు తెలిపారు.

ఈ ఏడాది మేలో ఎన్టీఆర్ జ‌యంతికి మ‌రోసారి దాని విష‌యం ప్ర‌స్తావించారు. "Last year, on the same day, I had announced a project. I promise that I'll soon come back to you all with it and entertain you in a new way! Stay tuned" అని ఆయ‌న ట్వీట్ చేశారు. ఇప్పుడు దానికి సంబంధించిన వివ‌రాలు వెల్ల‌డించ‌డానికి ఆయ‌న సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు స‌న్నిహిత వ‌ర్గాలు తెలిపాయి. నిజంగానే అదొక యూనిక్ ప్రాజెక్ట్ అని వినిపిస్తోంది. తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ కొన్ని పేజీలు సొంతం చేసుకున్న రాఘవేంద్రరావు ఏం అద్భుతం చేయ‌నున్నారో.. వెయిట్ అండ్ సీ.

Latest News

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.