ఏపీలో రేమాండ్స్ ఇన్వెస్ట్ మెంట్
posted on Nov 15, 2025 3:49PM

ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక ప్రగతి మరో లెవెల్ కు చేరింది. రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా జరుగుతున్న సీఐఐ భాగస్వామ్య సదస్సు వేదికగా రాష్ట్రంలో ప్రముఖ పారిశ్రామిక టౌన్‌షిప్‌గా ఉన్న శ్రీసిటీకి అదనంగా 6 వేల ఎకరాల భూమిని కేటాయించనున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. శ్రీసిటీని రాష్ట్ర అభివృద్ధికి ఒక రోల్ మోడల్‌గా తీర్చిదిద్దుతామన్న ఆయన సదస్సు వేదికపై నుంచే రేమాండ్స్ గ్రూప్‌కు చెందిన 3 ప్రాజెక్టులకు వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారు. అలాగే శ్రీసిటీలో ఇప్పటికే కార్యకలాపాలు ప్రారంభించిన 5 కంపెనీలను లాంఛనంగా ప్రారంభించారు. శ్రీసిటీలో కొత్తగా పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చిన పలు సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం తరఫున అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నారు.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు దేశంలోనే అత్యుత్తమ పారిశ్రామిక టౌన్‌షిప్ అయిన శ్రీసిటీ నుంచే డైకెన్, ఇసుజు, క్యాడ్బరీ వంటి ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు తమ ఉత్పత్తులను ప్రపంచానికి అందిస్తున్నాయని చెప్పారు. మరిన్ని అంతర్జాతీయ కంపెనీలు శ్రీసిటీకి రావాలన్నారు. ఇప్పటికే బెల్జియం, జపాన్, యూకే, జర్మనీ, ఆస్ట్రేలియా వంటి దేశాలకు చెందిన హెల్త్‌కేర్, ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, మెడికల్ పరికరాల కంపెనీల నుంచి రూ.8.87 లక్షల కోట్ల పెట్టుబడులకు అనుమతులు ఇచ్చినట్లు చెప్పారు. గత రెండు రోజులుగా జరిగిన సదస్సులో రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని, మొత్తంగా తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల్లో 22 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను సాధించామని చంద్రబాబు వివరించారు.
త్వరలోనే శ్రీసిటీకి మరో 6 వేల ఎకరాల భూమిని అందుబాటులోకి తెస్తామని చెప్పారు. రాబోయే రోజుల్లో 50కి పైగా దేశాలకు చెందిన కంపెనీలు శ్రీసిటీ నుంచి పనిచేస్తాయనీ, తద్వారా లక్షన్నర మందికి ఉద్యోగాలు లభిస్తాయని చెప్పారు. రాయలసీమ అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్న చంద్రబాబు 2014-19 మధ్య కాలంలోనే కియా కార్ల ఫ్యాక్టరీని సీమకు తెచ్చామని గుర్తు చేశారు. ఇప్పుడు అదే ప్రాంతంలో డ్రోన్ సిటీ, స్పేస్ సిటీ వంటివి ఏర్పాటు చేస్తున్నామనీ, ఏరోస్పేస్, డిఫెన్స్ కారిడార్లు కూడా రాబోతున్నాయి తెలిపారు. అనంతపురం జిల్లాకు రేమాండ్స్ సంస్థ రావడం శుభపరిణామమన్న ఆయన, కియా సమీపంలోనే రేమాండ్స్ ఆటో కాంపోనెంట్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తోందన్నారు.