Home

»

Latest News

Jailer2 Movie Review: 'జైల‌ర్2' మూవీ రివ్యూ

Oct 15, 2026 12:30PM

న‌టీన‌టులు: ర‌జినీకాంత్‌, మిథున్ చ‌క్ర‌వ‌ర్తి, విద్యాబాల‌న్‌, ఎస్‌.జె.సూర్య‌, ర‌మ్య‌కృష్ణ‌, సూర‌జ్ వెంజ‌ర‌మూడు, యోగిబాబు, న‌మో నారాయ‌ణ త‌దిత‌రులు
స్పెష‌ల్ కేమియోస్ :  మోహ‌న్‌లాల్‌, శివ‌రాజ్‌కుమార్‌, జాకీ ష్రాఫ్‌, హృతిక్ రోష‌న్‌, విజ‌య్ సేతుప‌తి
సంగీతం : అనిరుధ్ ర‌విచంద‌ర్‌
సినిమాటోగ్ర‌ఫీ :  విజ‌య్ కార్తీక్ క‌న్న‌న్‌
ఎడిటింగ్ : ఆర్‌.నిర్మ‌ల్‌
నిర్మాత : క‌ళానిధి మార‌న్‌
బ్యాన‌ర్ : స‌న్ పిక్చ‌ర్స్‌
ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం :  నెల్స‌న్ దిలీప్‌కుమార్‌
విడుద‌ల తేదీ:  15.10.26
సినిమా నిడివి: 165.18 నిమిషాలు

సూపర్‌స్టార్ రజినీకాంత్ స్క్రీన్ మీద కనిపిస్తే చాలు.. థియేటర్లో విజిల్స్ మోత మోగాల్సిందే! ఆయన నడకలో స్టైల్ ఉంటుంది.. చూపులో పవర్ ఉంటుంది.. డైలాగ్‌లో ఒక మ్యాజిక్ ఉంటుంది. ఇక ‘జైలర్’లో టైగర్ ముత్తువేల్ పాండియన్‌గా రజినీ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఇప్పుడు అదే పాత్రను మరింత భారీగా, మరింత పవర్‌ఫుల్‌గా చూపించేందుకు ‘జైలర్ 2’తో ప్రేక్షకుల ముందుకు వచ్చేశారు. మరి మొదటి భాగంతో బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేసిన రజనీ–నెల్సన్ కాంబినేషన్.. ఈ సీక్వెల్‌తో మరోసారి అదే మ్యాజిక్‌ను రిపీట్ చేసిందా? టైగర్ ఈసారి వేసిన వేట ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని ఇచ్చింది? అనే విష‌యాలు ఈ స‌మీక్ష‌లో తెలుసుకుందాం.

క‌థ:

‘జైలర్’ చిత్రానికి ఇది కొన‌సాగింపు అనే విష‌యం అంద‌రికీ తెలిసిందే. విగ్ర‌హాలను అక్ర‌మంగా త‌ర‌లిస్తున్న వ‌ర్మ ముఠాను అంత‌మొందించ‌డంతో మొద‌టి భాగం ముగ‌స్తుంది. ఈ విగ్ర‌హాల స్మ‌గ్లింగ్ వెనుక పెద్ద త‌లకాయ‌లు ఉన్నాయ‌నే విష‌యాన్ని విల‌న్ వ‌ర్మ ద్వారా చెప్పించాడు డైరెక్ట‌ర్‌. రెండో భాగం కోసం కొన్ని హుక్ పాయింట్స్‌ను మొద‌టి పార్ట్‌లో వ‌దిలాడు. ఇక జైల‌ర్‌2 విష‌యానికి వ‌స్తే.. వ‌ర్మ‌లాంటి క్రూర‌మైన విల‌న్‌ని చంపిన త‌ర్వాత త‌న కుటుంబానికి సేఫ్టీ అవ‌స‌రం అని భావించిన ముత్తు(ర‌జినీకాంత్‌) త‌మిళ‌నాడుకి మ‌కాం మారుస్తాడు. అక్క‌డ ఓ సూప‌ర్ మార్కెట్‌లో సూప‌ర్‌వైజ‌ర్‌గా ప‌నిచేస్తుంటాడు. వ‌ర్మ స్థానంలోకి వ‌చ్చిన దిలీప్‌(సూర‌జ్ వెంజ‌ర‌మూడు).. వ‌ర్మ‌ను చంపింది ఎవ‌రు అని క‌నిపెట్టే ప‌నిలో ఉంటాడు. అలాగే పెద్ద త‌ల‌కాయ‌ల నుంచి ఈ విష‌యంలో దిలీప్‌కి ప్రెజ‌ర్ ఎక్కువ‌వుతుంది. మ‌రి ముత్తును క‌నిపెట్ట‌డంలో దిలీప్ స‌క్సెస్ అయ్యాడా?  విగ్ర‌హాల‌ను స్మ‌గ్లింగ్ చేస్తున్న పెద్ద త‌ల‌కాయ‌ల్ని ముత్తు నిర్మూలించ‌గ‌లిగాడా? ఆ క్ర‌మంలో ముత్తు ఎలాంటి స‌మ‌స్య‌ల్ని ఎదుర్కొన్నాడు?  మొద‌టి భాగంలో ముత్తుకి హెల్ప్ చేసిన పాత ఫ్రెండ్స్ సెకండ్ పార్ట్‌లో ఎంత వ‌ర‌కు ప్ల‌స్ అయ్యారు?  అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. 

విశ్లేష‌ణ :

జైల‌ర్ సినిమాకి సంబంధించిన రెండు పార్టుల‌కు ప్ర‌ధాన బ‌లం డైరెక్ట‌ర్ నెల్స‌న్ దిలీప్‌కుమార్ అని చెప్పాలి. స్క్రిప్ట్‌ని ఎంతో ప‌క‌డ్బందీగా రెడీ చేసుకున్న చిన్న పాయింట్‌ని కూడా మిస్ చేయ‌కుండా 2 గంట‌ల 45 నిమిషాలు ప్రేక్ష‌కుల్ని సీట్ల‌లో కూర్చోబెట్ట‌డం అంటే సామాన్య విష‌యం కాదు. పేరుకి ఇది సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్ సినిమా అయిన‌ప్ప‌టికీ క్రెడిట్ మాత్రం ర‌జినీతోపాటు నెల్స‌న్‌కి కూడా ద‌క్కుతుంది. సినిమాకి మ‌రో పెద్ద ప్ల‌స్‌గా నిలిచిన‌వాడు మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనిరుధ్ ర‌విచంద‌ర్‌. సూప‌ర్‌స్టార్ ఇమేజ్‌, క్రేజ్‌కి త‌గ్గ‌ట్టు నెల్స‌న్ రాసిన ఎలివేష‌న్ షాట్స్‌కి అనిరుధ్ చేసిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అద్భుత‌మ‌ని చెప్పాలి. ఇది ఒక సాధార‌ణ‌మైన క‌థ‌. దానికి ఎన్నో హంగులు చేర్చ‌డం వ‌ల్ల ఒక బిగ్‌స్కేల్ మూవీగా నిలిచింది. హీరో ఎంట్రీ ఎంతో సాధార‌ణంగా చూపించ‌డంలోనే డైరెక్ట‌ర్ టాలెంట్ ఏమిటి అనేది తెలుస్తుంది. ఫ‌స్ట్ హాఫ్‌లో ముత్తు ఆప‌రేష‌న్ కొన‌సాగుతూనే ఉంటుంది. మ‌రో ప‌క్క కామెడీ కూడా బాగానే జ‌న‌రేట్ అయింది. యోగిబాబు, న‌మో నారాయ‌ణ వంటి ఆర్టిస్టులు న‌వ్వులు పూయించారు. ఇక ఈ సినిమాలో కేమియోల గురించి ప్ర‌త్యేకంగా చెప్పుకోవాలి. ఫ‌స్ట్ పార్ట్‌లో ఉన్న మోహ‌న్‌లాల్‌, శివ‌రాజ్‌కుమార్‌, జాకీ ష్రాఫ్ సెకండ్ పార్ట్‌లోనూ ఉన్నారు. కొత్త‌గా మిథున్ చ‌క్ర‌వ‌ర్తి, హృతిక్ రోష‌న్‌, విజ‌య్ సేతుప‌తి, విద్యాబాల‌న్ యాడ్ అయ్యారు. ఈ సినిమాలో కేమియోలు ఎక్కువై పోయాయి అనే కామెంట్స్ కూడా రిలీజ్‌కి ముందు వినిపించాయి. అయితే వారంతా క‌థ‌తోపాటే క‌నిపిస్తారు త‌ప్ప ఎక్క‌డా కావాల‌ని ఇరికించిన‌ట్టు అనిపించ‌దు. ఫ‌స్ట్ పార్ట్ చూసిన‌పుడు ఆడియ‌న్స్ ఎలా ఫీల్ అయ్యారో సెకండ్ పార్ట్ కూడా అదే రేంజ్ ఉంద‌ని చెప్పొచ్చు. ఇక ఈ సినిమాలో రెండు స్పెష‌ల్ సాంగ్స్ ఉన్నాయి. ఫ‌స్ట్ హాఫ్‌లో పూర్ణ స్పెష‌ల్ సాంగ్‌.. నిజంగానే స్పెష‌ల్‌గా ఉంద‌నే చెప్పాలి. సెకండ్ హాఫ్‌లో వ‌చ్చే నోరా ఫ‌తేహి సాంగ్ ఎంతో గ్రాండియ‌ర్‌గా ఉన్న‌ప్ప‌టికీ పూర్ణ సాంగ్ ముందు ఇది నిల‌వ‌లేక‌పోయింది. 

న‌టీన‌టులు:

సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్ సినిమా అన‌గానే ఒన్ మ్యాన్ షోలాగా ర‌జినీ ఒక్క‌రే క‌నిపిస్తారు. ఆయ‌న పెర్‌ఫార్మెన్స్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. భారీ ఫైట్స్ ఏమీ లేక‌పోయినా త‌న లుక్స్‌తో, స్టైల్‌తో ఆడియ‌న్స్‌ని మెస్మ‌రైజ్ చేశారు ర‌జినీ. వ‌ర్మ స్థానంలో దిలీప్ పాత్ర‌లో క‌నిపించిన సూర‌జ్ వెంజ‌ర‌మూడు పెర్‌ఫార్మెన్స్ కూడా బాగుంది. అయితే వినాయ‌క‌న్ రేంజ్ ఇత‌ను మెప్పించ‌లేక‌పోయాడు అనిపించింది. మిగ‌తా పాత్ర‌ల్లో మూర్తిగా న‌టించిన న‌మో నారాయ‌ణ గురించి ప్ర‌త్యేకంగా చెప్పుకోవాలి. ఓ ప‌క్క సీరియ‌స్‌గా క‌థ న‌డుస్తున్న స‌మ‌యంలో త‌న పాత్ర చేసే విన్యాసాల‌తో బాగా న‌వ్వించారు. అలాగే యోగిబాబు కూడా త‌నదైన స్టైల్ కామెడీ చేశాడు. ఇక విల‌న్స్‌గా న‌టించిన మిథున్ చ‌క్ర‌వ‌ర్తి, ఎస్‌.జె.సూర్య‌, విద్యాబాల‌న్ ఎక్స్‌ట్రార్డిన‌రీగా చేశార‌ని చెప్పాలి. ముగ్గురి క్యారెక్ట‌ర్స్‌ని అద్భుతంగా డిజైన్ చేశాడు డైరెక్ట‌ర్‌. ఇక హృతిక్ రోష‌న్ ఎంట్రీ అదిరింద‌నే చెప్పాలి. అత‌ను ఎంట‌ర్ అయిన త‌ర్వాత చేసిన యాక్ష‌న్ ఎపిసోడ్ కూడా చాలా బాగుంది. ముత్తు భార్య‌గా న‌టించిన ర‌మ్య‌కృష్ణ క్యారెక్ట‌ర్ సాదా సీదాగానే సాగుతుంది. 

సాంకేతిక నిపుణులు :  

డైరెక్ట‌ర్ ఈజ్ ద కెప్టెన్ ఆఫ్ షిప్ అంటారు. ఈ సినిమా విష‌యంలో అది నిజ‌మే అనిపిస్తుంది. ఎందుకంటే క‌థ‌గానీ, స్క్రీన్‌ప్లేగానీ ఎక్క‌డా ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఆడియ‌న్స్‌కి ఎలాంటి క‌న్‌ఫ్యూజ‌న్ రాకుండా అద్భుతంగా రాసుకున్నారు. దాన్ని స్క్రీన్ మీద ప్ర‌జెంట్ చెయ్య‌డంలో మిగ‌తా టెక్నీషియ‌న్స్ టాలెంట్‌ని కూడా అద్భుతంగా వినియోగించుకున్నారు. డైరెక్ట‌ర్ త‌ర్వాత చెప్పుకోవాల్సింది మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనిరుధ్ ర‌విచంద‌ర్ గురించి. ఫ‌స్ట్ పార్ట్‌లో త‌న మ్యూజిక్‌తో ర‌జినీకాంత్‌కి ఎంత‌టి ఎలివేష‌న్ ఇచ్చాడో, సెకండ్ పార్ట్‌లో అంత‌కుమించి అనేలా త‌న మ్యూజిక్‌తో అద‌ర‌గొట్టాడు. మ‌రో ముఖ్య‌మైన టెక్నీషియ‌న్ సినిమాటోగ్రాఫ‌ర్ విజ‌య్ కార్తీక్ క‌న్న‌న్‌. అద్భుత‌మైన విజువ‌ల్స్‌తో స్క్రీన్ క‌న్నుల పండువ‌గా క‌నిపించింది. ఆర్‌.నిర్మ‌ల్ ఎడిటింగ్ కూడా బాగుంది. ఇక ప్రొడ‌క్ష‌న్ వేల్యూస్ గురించి ఎంత చెప్పినా త‌క్కువే. సినిమా ప్రారంభం నుంచి చివ‌రి వ‌ర‌కు ఎంతో రిచ్‌గా క‌నిపిస్తుంది. క‌థ‌కు, సినిమాకి ఉన్న ఎక్స్‌పెక్టేష‌న్స్‌కి త‌గ్గ‌ట్టుగా ఎక్క‌డా రాజీ ప‌డ‌కుండా స‌న్ పిక్చ‌ర్స్ సంస్థ భారీగా ఈ చిత్రాన్ని నిర్మించింది. 

ఫైన‌ల్‌గా చెప్పాలంటే.. 

‘జైల‌ర్‌’కి ఏమాత్రం త‌గ్గ‌కుండా.. ఒక్క‌మాట‌లో చెప్పాలంటే ఫ‌స్ట్ పార్ట్‌ని మించి ‘జైల‌ర్‌2’ ఉంద‌ని చెప్పొచ్చు. 

రేటింగ్ : 3/5

- జి.హ‌రా

 

 

[jailer2 movie review, rajinikanth movie jailer2 review, super star rajinikanth, nelson dilipkumar, anirudh ravichandar, mithun chakraborty, hrithik roshan, mohan lal, sivarajkumar, jakie shroff]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com