ఇరాన్ గాయని, ఆమె బృందానికి 74 కొరడా దెబ్బల శిక్ష.. అసలేం జరిగింది.!
Nov 24, 2026 12:58PM
ఇరాన్‌లో హిజాబ్ నిబంధనలను ఉల్లంఘిస్తూ పాట పాడిన గాయనికి, ఆమె బృందానికి కోర్టు విధించిన శిక్షను అమలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇరాన్‌కు చెందిన గాయని పరస్తూ అహ్మదీ, ఆమెతో పాటు పనిచేసిన నలుగురు బృంద సభ్యులకు ఒక్కొక్కరికి 74 కొరడా దెబ్బలు వేసినట్లు వారి న్యాయవాది వెల్లడించిన సమాచారాన్ని స్థానిక మీడియా ప్రచురించింది. అంతేకాదు.. రెండేళ్ల పాటు సంగీత, కళా కార్యక్రమాల్లో పాల్గొనకూడదని, దేశం విడిచి వెళ్లకూడదని కూడా నిషేధం విధించినట్లు తెలుస్తోంది. ఈ ఘటన ప్రస్తుతం అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. హిజాబ్ అంటే తల, జట్టు, భుజాలు కవర్ చేస్తూ వేసుకునే ఒక వస్త్రం. దీని ద్వారా ముఖం మాత్రమే కనిపిస్తుంది.
ఈ వివాదానికి కారణం 2024 డిసెంబర్‌లో పరస్తూ అహ్మదీ చేసిన ఒక ఆన్‌లైన్ సంగీత ప్రదర్శన. ఆ వీడియోలో ఆమె హిజాబ్ ధరించకుండా, భుజాలు కనిపించే నల్లటి దుస్తుల్లో పాటలు పాడారు. ఆమెతో పాటు పురుష సంగీతకారులు కూడా ప్రదర్శనలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్‌లో విడుదల చేయడంతో పెద్ద ఎత్తున ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఇరాన్‌లో మహిళలు తప్పనిసరిగా హిజాబ్ ధరించాలనే నిబంధనలు ఉండటంతో.. ఈ ప్రదర్శనపై అక్కడి న్యాయవ్యవస్థ చర్యలు తీసుకుంది. గాయని, ఆమె బృందంపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది.
ఇది కూడా చదవండి: శ్రీవిష్ణుపై నాని ఫ్యాన్స్ ఫైర్.. మెగా ఫ్యాన్స్ కూడా హర్ట్ అయ్యారు.!
ఈ కేసులో పరస్తూ అహ్మదీతో పాటు ఆమె బృందంలోని నలుగురిపై ‘అనైతిక, అసభ్యకరమైన కంటెంట్‌ను ఆన్‌లైన్‌లో రూపొందించి ప్రచురించడం’ అనే ఆరోపణలు చేసినట్లు సమాచారం. కోర్టు వారికి 74 కొరడా దెబ్బల శిక్షతో పాటు రెండేళ్ల పాటు కళా, సంగీత కార్యకలాపాలపై నిషేధం, ప్రయాణ నిషేధం విధించినట్లు న్యాయవాది తెలిపిన వివరాలను ఇరాన్ మీడియా వెల్లడించింది. అయితే ఈ శిక్ష అమలుపై ఇరాన్ అధికారుల నుంచి వెంటనే అధికారిక స్పందన రాలేదని అంతర్జాతీయ వార్తా సంస్థలు పేర్కొన్నాయి.
ఇరాన్‌లో మహిళల హిజాబ్ నిబంధనలు గత కొన్నేళ్లుగా తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. 2022లో మహ్సా అమీనీ అనే యువతి పోలీసుల అదుపులో ఉన్న సమయంలో మరణించడంతో దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. అప్పటి నుంచి మహిళల వస్త్రధారణ, స్వేచ్ఛకు సంబంధించిన అంశాలు అంతర్జాతీయంగా కూడా చర్చకు వస్తున్నాయి. ఇప్పుడు పరస్తూ అహ్మదీకి, ఆమె బృందానికి విధించిన శిక్షపై పలువురు మానవ హక్కుల సంఘాలు, పాశ్చాత్య దేశాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. కొరడా దెబ్బల శిక్షను హింసగా, అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమైన చర్యగా అభివర్ణిస్తున్నాయి.
మీకు నచ్చవచ్చు:
అడివి శేష్ కొత్త మూవీ: ఆ లక్కీ హీరోయిన్ ఎవరంటే? డైరెక్టర్ ఎవరంటే?
విజయ్ సేతుపతికి అరుదైన గౌరవం: ఆనందంతో పొంగిపోతున్న తెలుగు ఫ్యాన్స్.!
[ParastooAhmadi, ParastooAhmadiNews, IranianSinger, ParastooAhmadi74Lashes]



