Home

»

Latest News

Dharmasthala Niyojakavargam Review: 'ధర్మస్థల నియోజకవర్గం' మూవీ రివ్యూ

Sep 4, 2026 11:52AM

నటీనటులు: సుమన్, సాయికుమార్, రాజీవ్ కనకాల, కస్తూరి, నటరాజ్, రాయంచ కొక్కుర, వరుణ్ సందేశ్, వితికా షేరు, రాజా రవీంద్ర, షఫీ, శివకుమార్ తదితరులు 
లిరిక్స్: చంద్రబోస్
సంగీతం: మహావీర్ ఏలేందర్
డీఓపీ: వెంకట హనుమ
ఎడిటింగ్: సాయిబాబు తలారి
ఆర్ట్: భార్గవాచారి నౌండ్ల 
నిర్మాత: మేరుం భాస్కర్
స్టోరీ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: జై జ్ఞాన ప్రభ తోట
విడుదల తేదీ: సెప్టెంబర్ 4, 2026

మూవింగ్ డ్రీమ్స్ ఇండియా బ్యానర్ పై సీనియర్ యాక్టర్స్ సుమన్, సాయికుమార్, రాజీవ్ కనకాల, కస్తూరి, యువ హీరో నటరాజ్, హీరోయిన్ రాయంచ కొక్కుర, హీరో వరుణ్ సందేశ్, వితికా షేరు ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం ‘ధర్మస్థల నియోజకవర్గం’. జై జ్ఞాన ప్రభ తోట దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి మేరుం భాస్కర్ నిర్మాత. పొలిటికల్ యాక్షన్ డ్రామా గా తెరకెక్కిన ఈ సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.

కథ: 
ధర్మస్థల నియోజకవర్గంలో వరుసగా ఏడు సార్లు గెలిచి, తిరుగులేని నాయకుడిగా చెలామణి అవుతుంటాడు ఎమ్మెల్యే బైర్రాజు(సాయికుమార్). అదే ప్రాంతంలో కాలేజీని నడుపుతూ డ్రగ్స్ దందా చేస్తుంటారు వాసుదేవ్(రాజీవ్ కనకాల), అతని భార్య కస్తూరి. తమ కాలేజీలోని విద్యార్థులకు విశ్వ(శివకుమార్) ద్వారా డ్రగ్స్ ను సప్లై చేస్తూ.. విద్యార్థులను డ్రగ్స్ కు బానిసలుగా చేసి సొమ్ము చేసుకుంటూ ఉంటారు. ఇది తెలిసిన అదే కాలేజీలో లెక్చరర్ గా పని చేసే అరుంధతి( వితిక షేరు), ఆమె స్టూడెంట్స్ బద్రి(నటరాజ్), ఈషా (రాయంచ కొక్కుర) తదితరులు విశ్వను ఎదిరిస్తారు. ఈ క్రమంలో బద్రి దారుణ హత్యకు గురవుతాడు. నియోజకవర్గం ఎమ్మెల్యే అండదండలతోనే తన కుమారుడు హత్యకు గురయ్యాడని తెలిసి టీ కొట్టు నడుపుకునే బద్రి తండ్రి ఈశ్వరయ్య(సుమన్) రాజకీయ రంగ ప్రవేశం చేసి ఎమ్మెల్యే ఎన్నికల్లో బైర్రాజు మీద స్టూడెంట్స్ మద్దతుతో పోటీకి దిగుతాడు. ధన బలం, మందిబలం ఉన్న బైర్రాజును ఒక సామాన్య టీ అమ్ముకునే ఈశ్వరయ్య ఎలా ఓడించాడు అనేదే మిగతా కథ.

విశ్లేషణ: 
పొలిటికల్ యాక్షన్ డ్రామాలను ఇష్టపడే ప్రేక్షకులు ఎక్కువగానే ఉంటారు. సరైన కథను ఎంచుకుని దానికి తగ్గట్టుగా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేను నడిపితే ప్రేక్షకులను ఆకట్టుకోవచ్చు. దర్శకుడు జై ఙ్ఞాన ప్రభ తోట కూడా నేటి సమాజంలో యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న ఓ కాంటెంపరరీ ఇష్యూను బేస్ చేసుకుని కథను రాసి.. దానికి తగ్గట్టుగా పొలిటికల్ టచ్ తో స్క్రీన్ ప్లేను నడిపించాడు. 

ఫస్ట్ హాఫ్ అంతా కాలేజీ వాతావరణం, డ్రగ్స్ కు బానిసలుగా మారిన విద్యార్థుల జీవితాలు, డ్రగ్స్ కు బానిసైన విద్యార్థిని మరణం, అది చూసిన ఓ మహిళా లెక్చరర్, కొంత మంది విద్యార్థుల తిరుగుబాటు, ఆ వెంటనే హీరో దారుణ హత్యకు గురికావడం వంటి అంశాలతో నడుస్తుంది. ఇంటర్వెల్ ట్విస్ట్.. సెకండ్ హాఫ్ పై ఆసక్తిని పెంచుతుంది. 

సెకండ్ హాఫ్ లో ఈశ్వరయ్య రాజకీయ రంగ ప్రవేశం చేయడంతో ధర్మస్థల నియోజకవర్గం రాజకీయం వేడెక్కుతుంది. అప్పటి దాకా తనకు తిరుగే లేదని విర్రవీగిన బైర్రాజుకు ఈశ్వరయ్య సవాల్ గా మారతాడు. ఈశ్వరయ్య చేసే పొలిటికల్ క్యాంపెయిన్, తన కుమారుణ్ణి దారుణంగా చంపిన వాళ్లను మట్టుబెట్టడం, లెక్చరర్ అరుంధతి ఉగ్రరూపం అన్నీ ప్రేక్షకులకు ఆకట్టుకుంటాయి. చివర్లో వరుణ్ సందేశ్ తో ఒక్క ఓటు విలువ ప్రాధాన్యం గురించి చెప్పిన తీరు.. ప్రజాస్వామ్యంలో  ఓటు ఎంత విలువైనదో తెలియజేస్తుంది. సినిమాలో ఉచిత పథకాల వల్ల కలిగే నష్టం గురించి కూడా ప్రస్తావించారు. అలాగే దుష్టుల స్నేహం ఎంత ప్రమాదకరమో వాసుదేవ్, కస్తూరిల పాత్రలతో చూపించారు. ఇలా పొలిటికల్ యాక్షన్ డ్రామాగా ప్రేక్షకులను బాగానే ఎంగేజ్ చేస్తుంది ధర్మస్థల నియోజకవర్గం. అయితే ఈ తరహా కథలు ఇప్పటికే చూసి ఉండటం కాస్త మైనస్.

నటీనటుల పనితీరు:
ఈశ్వరయ్య పాత్రలో సుమన్ ఒదిగిపోయారు. టీ అమ్ముకునే సామాన్యుడు నుంచి రాజకీయ రంగ ప్రవేశం చేసి బడా నాయకుడిని ఢీ కొట్టే వ్యక్తిగా ఆయన నటన ఆకట్టుకుంది. ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి తిరుగులేని నాయకుడిగా చెలామణి అయ్యే బైర్రాజు పాత్రలో సాయికుమార్ ఆకట్టుకున్నారు. విలన్ పాత్రల్లో రాజీవ్ కనకాల, సీనియర్ నటి కస్తూరి మెప్పించారు. విలన్ పాత్రలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన సత్య ప్రకాష్ కుమారుడు నటరాజ్ ఇందులో స్టూడెంట్ గా నటించి మెప్పించాడు. అతనికి జోడిగా నటించిన రాయంచ కొక్కుర కూడా తన నటనతో ఆకట్టుకుంది. నటుడు శివకుమార్ కూడా తనకు బాగా సూట్ అయ్యే యంగ్ విలన్ పాత్రలో ఒదిగిపోయి నటించాడు. సత్య ప్రకాష్, రాజా రవీంద్ర, షఫీ, కాలకేయ ప్రభాకర్, చివర్లో వరుణ్ సందేశ్ తమ తమ పాత్రలకు తగ్గట్టుగా నటించారు.

సాంకేతిక నిపుణుల పనితీరు:
దర్శకుడు జై ఙ్ఞాన ప్రభ తోట ఎక్కడా డివియేట్ కాకుండా తను చెప్పాలనుకున్న కథను మెసేజ్ రూపంలో తెరకెక్కించి సక్సెస్ అయ్యాడు. డెబ్యూ దర్శకుడే అయినా.. ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామాను బాగానే మలిచారు. మహావీర్ ఏలేందర్ అందించిన సంగీతం బాగుంది. ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్ రాసిన పాటలు బాగున్నాయి. వెంకట హనుమ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ ఇంకాస్త గ్రిప్పింగ్ గా ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. 

ఫైనల్ గా..
మంచి మెసేజ్ తో తెరకెక్కిన పొలిటికల్ యాక్షన్ డ్రామాను పెద్దగా అంచనాలు పెట్టుకోకుండా ఒకసారి హ్యాపీగా చూసేయొచ్చు.

 

రేటింగ్: 2.5/5

 

Disclaimer: Views expressed in this review are personal opinions of the reviewer and organisation doesn't take any liability. Viewers discretion is advised before commenting or reacting to this review.

 

 

 

[Dharmasthala Niyojakavargam, Telugu Movie Review, Suman, Sai Kumar, Vithika Sheru, Varun Sandesh, Rajeev Kanakala, Kasthuri Shankar, Nataraj, Rayancha Kokkura]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com