రవితేజతో మెగాస్టార్ మాస్ స్టెప్పులు!
on Oct 28, 2022
మెగాస్టార్ చిరంజీవి 'వాల్తేరు వీరయ్య' చిత్రంతో సంక్రాంతికి అలరించడానికి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. కె.ఎస్.రవీంద్ర(బాబీ) దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో మాస్ మహారాజ రవితేజ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమాలో చిరంజీవి, రవితేజ మధ్య వచ్చే సన్నివేశాలు బాగా ఆకట్టుకుంటాయని అంటున్నారు. అంతేకాదు ఈ మూవీలో ఓ పక్కా మాస్ సాంగ్ లో ఇద్దరూ కలిసి అదిరిపోయే స్టెప్పులతో అలరించనున్నారట.
చిరంజీవి గత చిత్రం 'గాడ్ ఫాదర్'లో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ప్రత్యేక పాత్రలో నటించాడు. ఆ సినిమాలో ఓ సాంగ్ లో ఇద్దరూ కలిసి చిందేశారు. ఇప్పుడు 'వాల్తేరు వీరయ్య'కి కూడా అదే రిపీట్ అవుతుందని అంటున్నారు. దేవిశ్రీప్రసాద్ స్వరపరిచిన ఓ మాస్ సాంగ్ లో చిరంజీవి, రవితేజ కలిసి అలరించనున్నారట. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో ఇప్పటికే ఈ సాంగ్ చిత్రీకరణ కూడా పూర్తయిందని సమాచారం. మెగాస్టార్ గ్రేస్, రవితేజ మాస్ కలిస్తే ఆ సాంగ్ ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మూవీలో శృతి హాసన్, కేథరిన్ థ్రెసా, బాబీ సింహా తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.