Home

»

Latest News

Biker Trailer: అదిరిపోయిన శర్వానంద్ 'బైకర్' ట్రైలర్.. రాజశేఖర్ కుమ్మేశాడుగా!

Mar 22, 2026

హీరో శర్వానంద్(Sharwanand) వైవిధ్యమైన కథలను ఎంచుకోవడంలో ముందుంటాడు. ఇప్పుడు మరోసారి డిఫరెంట్ అటెంప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తాజాగా విడుదలైన శర్వానంద్ 'బైకర్' మూవీ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. (Biker Trailer)

అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రం, ఇండియాలో మొట్టమొదటి మోటోక్రాస్ ఫిల్మ్ కావడం విశేషం. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా, ఏప్రిల్ 3న థియేటర్లలో అడుగుపెట్టనుంది. ఈ నేపథ్యంలో తాజాగా ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్.  

ట్రైలర్ ప్రారంభం నుండి ముగింపు వరకు అదిరిపోయే విజువల్స్ తో కట్టిపడేసింది. జిబ్రాన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదిరిపోయింది. ట్రైలర్ లో మోటోక్రాస్ రేసింగ్ సీన్లు, మట్టి ఎగురుతుంటే శర్వానంద్ బైక్‌పై చేసే విన్యాసాలు గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. శర్వానంద్ లుక్, బాడీ లాంగ్వేజ్ ఈ పాత్రకు చక్కగా సరిపోయాయి. రేసింగ్ ట్రాక్‌పై శర్వానంద్ తన బైక్‌తో చేసే సాహసాలు కన్నుల పండువగా ఉన్నాయి.

సినిమాలో కేవలం రేసింగ్ మాత్రమే కాదు, ఒక బలమైన తండ్రి-కొడుకుల సెంటిమెంట్ కూడా ఉన్నట్లు ట్రైలర్ లో చూపించారు. ఇందులో శర్వానంద్ తండ్రి పాత్రలో సీనియర్ హీరో రాజశేఖర్ నటించడం విశేషం. ఆయన పాత్ర సీరియస్ గా కనిపిస్తోంది. రాజశేఖర్ స్క్రీన్ ప్రెజెన్స్, డైలాగ్స్ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ కానున్నాయి. 

"నువ్వు అందరికంటే ముందు రాలేదు. నీకంటే అందరూ వెనకాల వచ్చారు. రెండింటికీ చాలా తేడా ఉంది" అని శర్వానంద్ తో రాజశేఖర్ చెప్పే డైలాగ్ సినిమాలోని కథా వైవిధ్యాన్ని చాటి చెబుతోంది. రేసింగ్ లో కొడుకు ఫస్ట్ వచ్చినా రాజశేఖర్ కి తృప్తి లేదు. మిగతా వాళ్ళ కంటే బెటర్ రేసర్ గా కాదు, బెస్ట్ రేసర్ గా తన కొడుకుని చూడాలనే తాపత్రయం రాజశేఖర్ పాత్రలో కనిపిస్తోంది.

తండ్రీకొడుకుల మధ్య సీన్స్ ట్రైలర్ లో హైలైట్ గా నిలిచాయి. తన డ్రీమ్ ని, తన కొడుకు ద్వారా తీర్చుకోవాలని చూస్తున్నట్టుగా రాజశేఖర్ పాత్ర కనిపిస్తోంది. అందుకే కొడుకు విషయంలో కఠినంగా ఉంటున్నాడనేలా సన్నివేశాలు ఉన్నాయి. 

మరోవైపు మాళవిక నాయర్ పాత్ర కూడా చాలా సహజంగా ఉంది. ట్రైలర్ చివరలో వచ్చే రేసింగ్ సీన్స్, ఆ ఎమోషనల్ టచ్ సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచాయి. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ ఆకట్టుకున్నాయి. ప్రతి ఫ్రేమ్ లోనూ రిచ్ నెస్ కనిపిస్తోంది.

మొత్తానికి ట్రైలర్ చూస్తుంటే.. 'బైకర్'తో శర్వానంద్ భారీ హిట్ కొట్టడానికి సిద్ధమైపోయాడని అర్థమవుతోంది. ఏప్రిల్ 3న విడుదల కానున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com