
‘కమిటీ కుర్రోళ్లు’ సినిమాతో నిర్మాతగా మంచి హిట్ అందుకున్న మెగా డాటర్ నిహారిక కొణిదెల(Niharika Konidela), ఇప్పుడు 'రాకాస' అనే ఫాంటసీ కామెడీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో తన అన్నయ్య వరుణ్ తేజ్ లవ్ స్టోరీ గురించి, తన వ్యక్తిగత జీవితం గురించి కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకుంది.
ముఖ్యంగా వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠిల ప్రేమ వ్యవహారంపై అడిగిన ప్రశ్నకు నిహారిక స్పందిస్తూ.. అందరూ అనుకుంటున్నట్లు వారి ప్రేమ విషయం తనకు ముందే తెలియదని చెప్పింది. దాదాపు నాలుగేళ్ల తర్వాతే వారిద్దరూ ప్రేమించుకుంటున్నారనే విషయం తనకు తెలిసిందని తెలిపింది.
అన్నయ్య వరుణ్ తేజ్ ను అందరూ ఇంట్రావర్ట్ అనుకుంటారు. తనకు ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ కూడా చాలా తక్కువమంది ఉంటారు. అందుకే లవ్ మేటర్ చాలా కాలం సీక్రెట్‌గా ఉంది. అయితే, ఒకసారి అన్నయ్య బర్త్‌డే పార్టీకి లావణ్య త్రిపాఠి హాజరుకావడంతో అసలు విషయం అర్థమైందని చెప్పింది. సాధారణంగా అన్నయ్య పార్టీలకు ఎవరినీ పిలవరని, కానీ లావణ్య రావడంతో వారి మధ్య ఏదో నడుస్తోందని అప్పుడే కన్ఫర్మ్ చేసుకున్నట్లు నిహారిక వివరించింది.

ఇక ఇదే ఇంటర్వ్యూలో నిహారిక తన రెండో పెళ్లి గురించి కూడా స్పందించింది. భవిష్యత్తులో తప్పకుండా పెళ్లి చేసుకుంటానని, కానీ ప్రస్తుతం తన దృష్టంతా కేవలం సినిమాలపైనే ఉందని క్లారిటీ ఇచ్చింది. సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్ గురించి మాట్లాడుతూ.. అసభ్యంగా ప్రవర్తించే వారికి కఠిన శిక్ష పడితేనే మార్పు వస్తుందని ఆమె అభిప్రాయపడింది.
సంగీత్ శోభన్ హీరోగా మానస శర్మ దర్శకత్వంలో రూపొందుతోన్న 'రాకాస' సినిమా ఏప్రిల్ 3న విడుదల కానుంది. ఫాంటసీ, కామెడీ మిళితమైన ఈ సినిమా కచ్చితంగా ప్రేక్షకులను అలరిస్తుందని నిహారిక నమ్మకం వ్యక్తం చేసింది.






