ఆహాలో 'బాలు గాని టాకీస్'.. బాలయ్య ఫ్యాన్ కోరిక నెరవేరుతుందా?
on Sep 9, 2024
ఇటీవల ఓటీటీ సినిమాలకు, సిరీస్ లకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఆహా ఒరిజినల్ గా ఇప్పుడు మరో మూవీ ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. అదే 'బాలు గాని టాకీస్'. 'ఎట్టయినా హౌస్ ఫుల్ చెయ్యాలి' అనేది ట్యాగ్ లైన్. (Balu Gani Talkies)
శివ రామచంద్రవరపు, శరణ్య శర్మ జంటగా నటించిన చిత్రం 'బాలు గాని టాకీస్'. శ్రీనిధి సాగర్ నిర్మించిన ఈ చిత్రానికి విశ్వనాథ్ ప్రతాప్ దర్శకుడు. సెప్టెంబర్ 13 నుంచి ఓటీటీ వేదిక ఆహాలో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే ప్రచార చిత్రాలతో 'బాలు గాని టాకీస్' ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా ఇటీవల విడుదలైన ట్రైలర్ కి మంచి స్పందన లభించింది.
రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో సహజత్వానికి దగ్గరగా ఉండే సన్నివేశాలు, సంభాషణలతో సింక్ సౌండ్ తో రూపొందిన 'బాలు గాని టాకీస్' సినిమాలో.. ప్రేక్షకుల ఆదరణకు నోచుకోని ఒక పాత థియేటర్ కి ఓనర్ అయిన బాలు పాత్రలో శివ రామచంద్రవరపు కనిపిస్తున్నాడు. ఆ థియేటర్ బూతు సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ కావడంతో.. బాలుని ఊరిలో అందరూ చిన్న చూపు చూస్తుంటారు. నందమూరి బాలకృష్ణకు వీరాభిమాని అయిన బాలు.. ఎలాగైనా తన థియేటర్ లో బాలయ్య సినిమా ఆడించాలని, తన థియేటర్ ను కళకళలాడించాలని కలలు కంటుంటాడు. మరి బాలు కోరిక నెరవేరిందా? థియేటర్ కారణంగా ఆర్థికంగా, కుటుంబ పరంగా ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు? థియేటర్ అమ్మేద్దామనుకునే పరిస్థితి ఎందుకు ఏర్పడింది? వంటి అంశాలతో సినిమా పట్ల ఆసక్తి నెలకొనేలా ట్రైలర్ ను రూపొందించారు. అలాగే ట్రైలర్ చివరిలో థియేటర్ కి ముడిపెడుతూ క్షుద్రపూజలు, గుప్తనిధులు వంటివి చూపించడం మరింత ఆసక్తికరంగా ఉంది.
రఘు కుంచె, సుధాకర్ రెడ్డి, వంశీ నెక్కంటి, సురేష్ పూజారి, శేఖర్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించిన 'బాలు గాని టాకీస్' చిత్రానికి స్మరణ్ సంగీత దర్శకుడు. ఆదిత్య బి.ఎన్ నేపథ్య సంగీతం అందించిన ఈ చిత్రానికి.. సినిమాటోగ్రాఫర్ గా బాలు శాండిల్యస, ఎడిటర్ గా అన్వర్ అలీ, ప్రొడక్షన్ డిజైనర్ గా రోషన్ కుమార్ వ్యవహరించారు.
Also Read