TeluguOne App Promotion
● # Tweets

Home

»

తాజా

మళ్లీ తెరపైకి బేబీ వివాదం.. సాయి రాజేష్‌, SKNలకు హైకోర్టు నోటీసులు.!

Nov 29, 2026 3:56PM

టాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన ‘బేబీ’ సినిమా కథ చుట్టూ మరోసారి వివాదం మొదలైంది. తన ‘ప్రేమించొద్దు’ కథను అనుమతి లేకుండా ‘బేబీ’ సినిమాకు ఉపయోగించారని దర్శకుడు శిరిన్‌ శ్రీరామ్‌ చేసిన ఆరోపణలు ఇప్పుడు న్యాయస్థానం వరకు చేరాయి. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు.. ‘బేబీ’ దర్శకుడు సాయి రాజేష్‌, నిర్మాత SKNకు నోటీసులు జారీ చేసింది.

అసలు ఈ వివాదం ‘ప్రేమించొద్దు’ అనే కథతో మొదలైంది. శిరిన్‌ శ్రీరామ్‌ తన రచయితల బృందంతో కలిసి ఈ కథను అభివృద్ధి చేశారట. తొలుత ఈ సినిమాను నిర్మించాలనే ఆసక్తితో సాయి రాజేష్‌ తనను సంప్రదించారని శిరిన్‌ చెబుతున్నారు. ఈ క్రమంలో దాదాపు ఏడాది పాటు కష్టపడి కథను సిద్ధం చేశామని ఆయన పేర్కొన్నారు.

అయితే కథకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత సాయి రాజేష్‌ తమను పక్కనపెట్టి, అదే కథాంశంతో ‘బేబీ’ సినిమాను తెరకెక్కించారని శిరిన్‌ ఆరోపిస్తున్నారు. తమ అనుమతి లేకుండా కథను ఉపయోగించారని, దీనివల్ల మోసం జరగడంతో పాటు మేధో సంపత్తి హక్కులు ఉల్లంఘనకు గురయ్యాయని తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

ఈ వివాదం తొలిసారిగా 2024 ఫిబ్రవరిలో బయటకు వచ్చింది. తన కథను కాపీ చేశారంటూ శిరిన్‌ శ్రీరామ్‌ రాయదుర్గం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత ఈ వ్యవహారంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ కోర్టును ఆశ్రయించారు. తన వాదనలకు సంబంధించిన వివరాలను ‘బేబీ లీక్స్‌’ పేరుతో ఓ పుస్తకంగా కూడా విడుదల చేశారు.

తాజాగా తెలంగాణ హైకోర్టులో ఈ పిటిషన్‌పై విచారణ జరిగింది. పిటిషనర్‌ తరఫున న్యాయవాది జి. సురేందర్‌ వాదనలు వినిపించారు. వాటిని పరిశీలించిన న్యాయస్థానం సాయి రాజేష్‌, నిర్మాత SKNకు నోటీసులు జారీ చేసింది. పిటిషన్‌లో చేసిన ఆరోపణలపై తమ వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

దీంతో అప్పట్లో మొదలైన ‘బేబీ’ కథ వివాదం మరోసారి టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. అయితే హైకోర్టు నోటీసులు జారీ చేయడం మాత్రమే జరిగింది. కథను కాపీ చేశారనే ఆరోపణలు ఇంకా నిర్ధారణ కాలేదు. మరి ఈ వ్యవహారంపై సాయి రాజేష్‌, SKN ఎలాంటి వివరణ ఇస్తారు? ఈ కేసు తదుపరి విచారణలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయనేది ఆసక్తికరంగా మారింది.

ఇది కూడా చదవండి: వృషకర్మ మొదటి పది నిమిషాలు మిస్ అవొద్దు!

 

 

 

[Baby Movie, Story Controversy, Sai Rajesh, SKN, Preminchoddu]

 

google-ad-img