TeluguOne App Promotion
● # Tweets

Home

»

తాజా

నానికి గొడుగు పట్టిన నితిన్‌.. 20 ఏళ్ల క్రితం మొదలైన స్నేహం వెనుక అసలు కథ ఇదే.!

Nov 29, 2026 3:31PM

సినిమా ఇండస్ట్రీలో స్నేహాలు ఉంటాయి.. కానీ కొందరి మధ్య ఉండే అనుబంధం మాత్రం ప్రత్యేకంగా నిలిచిపోతుంది. నాని, నితిన్‌ మధ్య ఉన్న స్నేహం కూడా అలాంటిదే. ఒకప్పుడు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేసిన నానికి అప్పట్లో హీరోగా ఉన్న నితిన్‌ గొడుగు పట్టారు. ఇప్పుడు దాదాపు 20 ఏళ్ల తర్వాత అదే సన్నివేశాన్ని ఇద్దరూ మరోసారి రీక్రియేట్‌ చేశారు. ‘అలియాస్‌ రుక్మిణి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో జరిగిన ఈ సంఘటన అందరినీ ఆకట్టుకుంది.

ఈ కథ 2005లో విడుదలైన ‘అల్లరి బుల్లోడు’ సినిమా షూటింగ్‌ సమయంలో మొదలైంది. ఆ సినిమాలో నితిన్‌ హీరోగా నటించగా.. నాని క్లాప్‌ అసిస్టెంట్‌గా పనిచేశారు. అప్పటికి నాని సినిమాల్లో తన ప్రయాణాన్ని మొదలుపెడుతున్న సమయం. ఇద్దరూ దాదాపు ఒకే వయసు కావడంతో నాని, నితిన్‌ను నేరుగా పేరుతోనే పిలిచేవారట.

అయితే సినిమా సెట్స్‌లో హీరోలను ‘బాబు’ అని పిలవాలంటూ ఓ ప్రొడక్షన్‌ మేనేజర్‌ నానికి సూచించారట. దీంతో తర్వాత నితిన్‌ను పిలిచినప్పుడు ‘బాబు.. షాట్‌ రెడీ’ అని అన్నారు. ఒక్కసారిగా నాని పిలుపు మారడంతో నితిన్‌ ఆశ్చర్యపోయారు. ఎందుకు తనను అలా పిలుస్తున్నావని అడిగినా నాని మొదట చెప్పలేదట.

చివరకు అసలు విషయం తెలుసుకున్న నితిన్‌.. ఆ మేనేజర్‌కు మరింత ఆశ్చర్యం కలిగించేలా ఓ సరదా ప్లాన్‌ వేశారట. నాని క్లాప్‌ బోర్డ్‌ పట్టుకుని వస్తుంటే తాను గొడుగు పట్టుకుని రావాలని నిర్ణయించుకున్నారు. అలా ఒక హీరో తనకు గొడుగు పట్టుకుని రావడం చూసి అప్పట్లో సినిమా యూనిట్‌ కూడా ఆశ్చర్యపోయిందని నాని గుర్తుచేసుకున్నారు.

ఇటీవల ‘అలియాస్‌ రుక్మిణి’ గ్లింప్స్‌ షూటింగ్‌ సమయంలోనూ వర్షం పడుతుండగా నితిన్‌ నానికి గొడుగు పట్టారట. దీంతో అప్పటి జ్ఞాపకం మరోసారి గుర్తుకొచ్చింది. ఇప్పుడు ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో పాత ఫొటోలను ప్రదర్శించడంతో పాటు, ఇద్దరూ అదే సన్నివేశాన్ని స్టేజ్‌పై రీక్రియేట్‌ చేశారు. నాని క్లాప్‌ బోర్డ్‌ పట్టుకోగా.. నితిన్‌ గొడుగు పట్టుకుని ఆయనతో కలిసి వేదికపైకి వచ్చారు.

ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఒకప్పుడు నితిన్‌ సినిమా సెట్స్‌లో అసిస్టెంట్‌గా పనిచేసిన నాని, ఇప్పుడు అదే నితిన్‌ నటిస్తున్న ‘అలియాస్‌ రుక్మిణి’ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మురళీకాంత్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను నాని తన యూనానిమస్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. డిసెంబర్‌ 4న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

మొత్తానికి 20 ఏళ్ల క్రితం మొదలైన చిన్న సరదా సంఘటన.. ఇప్పుడు ఇద్దరి మధ్య ఉన్న స్నేహానికి గుర్తుగా మారింది. ఇండస్ట్రీలో ఎవరు ఎంత ఎదిగినా పాత అనుబంధాలను మర్చిపోకూడదనే విషయాన్ని నాని, నితిన్‌ మరోసారి గుర్తుచేశారు.

ఇది కూడా చదవండి: ఆటో జానీ గుర్తున్నాడా?.. కాకాలో చిరంజీవి వింటేజ్ అవతార్‌ అదిరింది.!

 

 

 

[Nani, Nithiin, Friendship, Umbrella, Alias Rukmini]

 

google-ad-img