'అవతార్-2'తో మరో సంచలనం.. టాప్-5 లో మూడు జేమ్స్ కామెరాన్ వే!
on Jan 27, 2023
హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరాన్ అద్భుత సృష్టి 'అవతార్: ది వే ఆఫ్ వాటర్'. 'అవతార్'కి సీక్వెల్ గా రూపొందిన ఈ చిత్రం డిసెంబర్ 16న విడుదలై ప్రపంచవ్యాప్తంగా వసూళ్ల వర్షం కురిపిస్తోంది. తాజాగా ఈ చిత్రం ప్రపంచ సినీ చరిత్రలో అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాల లిస్టులో ఐదో స్థానంలో నిలిచింది. త్వరలోనే మూడో స్థానం దక్కించుకునే అవకాశం కనిపిస్తోంది.
ఇప్పటిదాకా 2018లో విడుదలైన 'అవెంజర్స్: ఇన్ఫినిటీ వార్' కలెక్షన్ల పరంగా 2.04 బిలియన్ డాలర్లతో ఐదో స్థానంలో ఉండగా.. ఇప్పుడు 2.05 బిలియన్ డాలర్లతో ఆ చిత్రాన్ని వెనక్కి నెట్టి 'అవతార్-2' ఐదో స్థానంలోకి వచ్చింది. 2.06 బిలియన్ డాలర్లతో నాలుగో స్థానంలో 'స్టార్ వార్స్: ది ఫోర్స్ అవేకెన్స్', 2.18 బిలియన్ డాలర్లతో మూడో స్థానంలో 'టైటానిక్' ఉన్నాయి. త్వరలో 'అవతార్-2' నాలుగో స్థానానికి వెళ్తుంది అనడం ఎలాంటి సందేహం లేదు. ఇదే జోరు కొనసాగిస్తే టైటానిక్ ని కూడా వెనక్కి నెట్టి మూడో స్థానంలో నిలిచే ఛాన్స్ ఉంది.
ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు రాబట్టిన టాప్-5 సినిమాలలో మూడు జేమ్స్ కామెరాన్ వే ఉండటం విశేషం. 2.9 బిలియన్ డాలర్లతో టాప్ లో 'అవతార్' ఉండగా.. మూడో స్థానంలో టైటానిక్, ఐదో స్థానంలో అవతార్-2 ఉన్నాయి.
Also Read