Home

»

Latest News

వెండితెరపై మెరిసి వ్యక్తిగత జీవితంలో ఓడిపోయిన చ‌ర్మిల విషాద గాథ‌.!

Sep 3, 2026 6:50PM

వెండితెరపై వెలిగిపోయిన ఎంతోమంది తారల నిజ జీవితాలు బయటకు కనిపించేంత గ్లామరస్‌గా ఉండవు. 90ల కాలంలో సౌత్ ఇండియాలో హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటి చ‌ర్మిల మ‌నోహ‌ర‌న్ జీవితం కూడా అలాంటిదే. ఒకప్పుడు వరుస విజయాలతో కథానాయకిగా అలరించిన ఆమె, వ్యక్తిగత జీవితంలో ఎదురైన చేదు అనుభవాల వల్ల తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టివేయబడింది.

చ‌ర్మిల తమిళం, మలయాళం, కన్నడతో పాటు తెలుగులోనూ పలు సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది. ముఖ్యంగా మలయాళ సినీ రంగంలో ఆమె నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద విజయం సాధించి, ఆమెకు స్టార్ డమ్ అందించాయి. అయితే కెరీర్ ఊపందుకుంటున్న సమయంలోనే ఆమె తీసుకున్న కొన్ని తొందరపాటు నిర్ణయాలు ఆమె వ్యక్తిగత జీవితాన్ని దెబ్బతీశాయి.

ప్రేమ, పెళ్లి విషయంలో చ‌ర్మిలకు వరుసగా ఎదురుదెబ్బలు తగిలాయి. నటుడు కిషోర్ సత్యతో జరిగిన మొదటి వివాహం కొద్ది కాలానికే విడాకులకు దారితీసింది. ఆ తర్వాత వ్యాపారవేత్త రాజేష్‌ను రెండవ వివాహం చేసుకున్నప్పటికీ, మనస్పర్థల కారణంగా ఆ బంధం కూడా ఎక్కువ కాలం నిలవలేదు. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. అంతకుముందు ఒక ప్రముఖ నటుడితో నడిచిన ప్రేమాయణం కూడా బ్రేకప్‌తో ముగిసింది.

వ్యక్తిగత జీవితంలో వరుస వైఫల్యాలు ఎదురవ్వడంతో చ‌ర్మిల మానసికంగా తీవ్ర ఒత్తిడికి లోనయ్యారు. అదే సమయంలో సినిమాల్లో అవకాశాలు క్రమంగా తగ్గిపోవడం, సరైన ఆదాయ మార్గాలు లేకపోవడంతో ఆమె తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయారు. కొడుకు బాధ్యతలు, అనారోగ్య సమస్యలు, ఇంటి అద్దెలు చెల్లించలేని పరిస్థితులను కూడా ఆమె ఎదుర్కోవాల్సి వచ్చింది.

గతంలో ఇచ్చిన కొన్ని ఇంటర్వ్యూలలో చ‌ర్మిల తన కష్టాలను పంచుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఎంతోమంది ఆప్యాయంగా పలకరించారని, కానీ కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరూ సహాయం చేయడానికి ముందుకు రాలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు తోటి నటులు మాత్రమే తనకు అంతోఇంతో సహాయం అందించారని గుర్తుచేసుకున్నారు.

చ‌ర్మిల విషాదకర పరిస్థితిని తెలుసుకున్న సినీ అభిమానులు, నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. రీల్ లైఫ్‌లో ఎంతో సంతోషంగా కనిపించే నటీనటులు రియల్ లైఫ్‌లో ఇలాంటి కష్టాలు పడటం విచారకరమని కామెంట్లు పెడుతున్నారు.

ప్రస్తుతం షర్మిల చిన్న చిన్న పాత్రలు, బుల్లితెర షోల ద్వారా మళ్లీ కంబ్యాక్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇండస్ట్రీ వర్గాలు ఆమెకు తగిన అవకాశాలు ఇచ్చి ఆదుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com