TeluguOne App Promotion
● # Tweets

Home

»

తాజా

12 ఏళ్ల తర్వాత టాలీవుడ్‌లోకి అబ్బాస్ రీఎంట్రీ.. ఆ భారీ సినిమాలో కీలక పాత్ర.!

Nov 29, 2026 5:46PM

‘ప్రేమదేశం’ సినిమా గుర్తుందా? అందులో తన స్టైలిష్ లుక్స్, లవర్ బాయ్ ఇమేజ్‌తో అప్పట్లో యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్న అబ్బాస్ గుర్తున్నారా? చాలా కాలంగా తెలుగు సినిమాలకు దూరంగా ఉన్న ఆయన ఇప్పుడు మళ్లీ టాలీవుడ్‌లోకి అడుగుపెట్టబోతున్నట్లు తెలుస్తోంది. అది కూడా సంక్రాంతి బరిలోకి వస్తున్న అనిల్ రావిపూడి సినిమాలో కావడం విశేషం.

వెంకటేశ్, నందమూరి కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రల్లో అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్ ‘జనవరి 12 విడుదల’లో అబ్బాస్ ఓ కీలక పాత్ర పోషించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో ఆయన పాత్ర ప్రత్యేకంగా ఉండబోతుందని సమాచారం.

ఒకప్పుడు అబ్బాస్‌కు తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు ఉండేది. ముఖ్యంగా ‘ప్రేమదేశం’ సినిమాతో ఆయన క్రేజ్ ఒక్కసారిగా పెరిగింది. లవర్ బాయ్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన అబ్బాస్.. అప్పట్లో వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించారు. అయితే ఆ తర్వాత సినిమాలకు దూరమై విదేశాల్లో స్థిరపడ్డారు.

సుమారు 12 ఏళ్ల విరామం తర్వాత ఇటీవల జీవీ ప్రకాశ్ కుమార్ నటించిన తమిళ సినిమా ‘హ్యాపీ రాజ్’తో మళ్లీ నటనలోకి వచ్చారు. ఇప్పుడు అదే ఉత్సాహంతో తెలుగు సినిమాల్లోనూ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. చివరిగా 2014లో వచ్చిన 'అలా జరిగింది ఒకరోజు' అనే తెలుగు సినిమాలో కనిపించిన ఆయన, ఈ ప్రాజెక్ట్‌తో మళ్లీ తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. అబ్బాస్ మరో రెండు సినిమాలకు కూడా చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంటే ఈసారి కేవలం ఒకటి రెండు సినిమాలు చేసి ఆగిపోకుండా, నటుడిగా తన సెకండ్ ఇన్నింగ్స్‌ను కొనసాగించాలనే ఆలోచనలో ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది.

మరి ఒకప్పుడు ‘ప్రేమదేశం’తో అమ్మాయిల కలల రాకుమారుడిగా గుర్తింపు తెచ్చుకున్న అబ్బాస్.. ఇప్పుడు అనిల్ రావిపూడి సినిమాలో ఎలాంటి పాత్రతో కనిపించబోతున్నారు? ఆయన సెకండ్ ఇన్నింగ్స్‌కు ఈ సినిమా ఎలాంటి గుర్తింపు తీసుకొస్తుంది? అనేది ఆసక్తికరంగా మారింది.

ఇది కూడా చదవండి: ఎన్టీఆర్-అనిల్ రావిపూడి సినిమాలో రవితేజ?

 

 

 

[Abbas Comeback, January 12 Vidudala, Anil Ravipudi, Venkatesh, Kalyan Ram]

 

google-ad-img