‘హనుమాన్’ ఎవరి సొత్తు కాదు.. సీక్వెల్ వివాదంపై చైతన్య రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్.!
Nov 29, 2026 5:31PM

‘హనుమాన్’ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. తేజ సజ్జా నటన, ప్రశాంత్ వర్మ దర్శకత్వం ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చాయి. అయితే సినిమా సక్సెస్ తర్వాత దర్శకుడు ప్రశాంత్ వర్మ, నిర్మాత నిరంజన్ రెడ్డి మధ్య విభేదాలు వచ్చినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆ వివాదం సీక్వెల్ హక్కుల దగ్గరకు చేరింది.
ఇటీవల ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ సంస్థ ‘హనుమాన్ 2’ను ప్రకటించింది. ఇందులో పంజా వైష్ణవ్ తేజ్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా, వీఐ ఆనంద్ దర్శకత్వం వహించనున్నారు. మరోవైపు ప్రశాంత్ వర్మ ఇప్పటికే రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో ‘జై హనుమాన్’ను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కిస్తున్నారు. దీంతో ఒకే కథా ప్రపంచానికి సంబంధించి రెండు ప్రాజెక్టులు తెరపైకి రావడం చర్చకు దారితీసింది.
ఈ నేపథ్యంలో ‘శ్రీమతి’ సిరీస్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్న నిర్మాత చైతన్య రెడ్డిని మీడియా ప్రతినిధులు ఈ వివాదంపై ప్రశ్నించారు. ‘హనుమాన్’ ఐపీ రైట్స్ ప్రశాంత్ వర్మకు ఉన్నాయని, మైత్రీ మూవీ మేకర్స్‌తో రూ.23 కోట్ల సెటిల్మెంట్ జరిగిందని వస్తున్న ప్రచారంపై ఆమెను అడిగారు.
దీనికి చైతన్య రెడ్డి స్పందిస్తూ.. “హనుమాన్ ఎవరి సొంతం కాదు.. మా దగ్గర కూడా అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి” అని స్పష్టం చేశారు. తమ దగ్గర కూడా హక్కులకు సంబంధించిన పత్రాలు ఉన్నాయని చెప్పడం ద్వారా ఈ వివాదంలో తమ వాదనను బలంగా వినిపించారు.
అంతేకాదు, మైత్రీ మూవీ మేకర్స్‌తో రూ.23 కోట్ల సెటిల్మెంట్ జరిగిన మాట వాస్తవమేనని ఆమె అంగీకరించారు. అయితే ఆ డబ్బు వేరే విషయాలకు సంబంధించినదని, దానికి ‘హనుమాన్ 2’ హక్కులను అప్పగించడానికి సంబంధం లేదని వివరించారు. రూ.23 కోట్ల వ్యవహారాన్ని సీక్వెల్ రైట్స్‌తో ముడిపెట్టడం సరికాదన్నది ఆమె మాటల్లో స్పష్టమైంది.
ఇప్పుడు చైతన్య రెడ్డి చేసిన వ్యాఖ్యలతో ‘హనుమాన్ 2’ హక్కుల వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ఒకవైపు తమ దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయని ప్రైమ్ షో నిర్మాత చెబుతుంటే, మరోవైపు ప్రశాంత్ వర్మకు ఐపీ హక్కులు ఉన్నాయనే ప్రచారం కొనసాగుతోంది. ఈ రెండు ప్రాజెక్టుల విషయంలో అసలు హక్కులు ఎవరికి ఉన్నాయి? ఈ వివాదం చర్చలతో పరిష్కారమవుతుందా లేక న్యాయపరమైన మలుపు తిరుగుతుందా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఇది కూడా చదవండి: అనిల్ రావిపూడి డ్రీమ్ ప్రాజెక్ట్.. రామాయణం అనౌన్స్మెంట్!
[HanuMan 2, Chaitanya Reddy, Niranjan Reddy, Prasanth Varma, Jai Hanuman]



