Home

»

Latest News

‘శంభాల’ తర్వాత ఆది సాయికుమార్ నుంచి మరో డివైన్ థ్రిల్లర్.. టైటిల్ వచ్చేసింది!

Oct 20, 2026 4:57PM

యంగ్ హీరో ఆది సాయికుమార్ మరో ఆసక్తికరమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. దసరా సందర్భంగా ఆయన నటిస్తున్న కొత్త పాన్ ఇండియా చిత్రానికి ‘ఆది రుద్ర’ (AADI RUDRRA) అనే టైటిల్‌ను మేకర్స్ ప్రకటించారు. త్రిశూల్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాను దైవిక రహస్యాలు, ఆధ్యాత్మిక అంశాలు, ఉత్కంఠభరిత పరిణామాలతో కూడిన మిస్టరీ థ్రిల్లర్‌గా రూపొందిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ ప్రకటనతో ఆది అభిమానుల్లో ఆసక్తి పెరిగింది.

ఈ చిత్రానికి నవరసన్ కథ అందించడంతో పాటు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రశాంత్ జి. రుద్రప్ప నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ‘కాంతార’, ‘విరూపాక్ష’, ‘మంగళవారం’ వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న బి. అజనీష్ లోక్‌నాథ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఏజే శెట్టి సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 1960 నుంచి 1990 మధ్య కాలాన్ని నేపథ్యంగా తీసుకుని ఈ కథను రూపొందిస్తున్నట్లు సమాచారం. ఈ కాలానికి సంబంధించిన వాతావరణం, పాత్రలు, కథన శైలి సినిమాలో కీలకంగా ఉండనున్నాయి.

ఇక ఈ సినిమా ప్రకటన సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దట్టమైన అడవి వాతావరణంలో త్రిశూలం చుట్టూ చుట్టుకున్న భారీ నాగుపాము, చుట్టూ కనిపించే పురాతన ఆయుధాలు, వేలాడుతున్న గంటలు, వెలుగుతున్న దీపాలు పోస్టర్‌కు మిస్టీరియస్ లుక్‌ను తీసుకొచ్చాయి. ఈ విజువల్స్ సినిమాలో దైవిక శక్తులు, పురాతన ఆచారాలు, అంతుచిక్కని రహస్యాలకు ప్రాధాన్యం ఉండబోతున్నాయనే ఆసక్తిని కలిగిస్తున్నాయి.

తెలుగు, కన్నడ, తమిళం, హిందీ, మలయాళ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయాలని మేకర్స్ ప్రణాళిక రూపొందించారు. ఆది సాయికుమార్‌తో పాటు ఆయన తండ్రి సాయికుమార్, బాబాయి పి. రవిశంకర్ కూడా ఈ చిత్రంలో కనిపించనున్నట్లు సమాచారం. ఈ ముగ్గురూ ఒకే సినిమాలో తెరపై కనిపించడం ప్రత్యేక ఆకర్షణ కానుంది. సినిమా షూటింగ్‌ను వచ్చే ఏడాది ప్రారంభించాలని చిత్రబృందం భావిస్తున్నట్లు తెలుస్తోంది. మిగతా నటీనటులు, కథకు సంబంధించిన మరిన్ని వివరాలను మేకర్స్ వెల్లడించాల్సి ఉంది.

 

[Aadi Saikumar, Aadi Rudrra Movie, Aadi Rudrra First Look, Aadi Saikumar Pan India Movie, Navarasan, Prashanth G Rudrappa, B Ajaneesh Loknath, Trishul Entertainments]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com