ఇద్దరు హీరోయిన్లు.. ఒక ప్రేమికుడు.. ‘హైకూ’ కథ ఎలా ఉందంటే?
Nov 27, 2026 2:33PM
ప్రేమకథలకు యూత్‌లో ఎప్పుడూ మంచి ఆదరణ ఉంటుంది. కథలో భావోద్వేగాలు, రొమాన్స్ ప్రేక్షకులకు కనెక్ట్ అయితే భాషతో సంబంధం లేకుండా సినిమాలు విజయాలు అందుకుంటాయి. అలాంటి ప్రేమకథగా తెరకెక్కిన చిత్రం ‘హైకూ’. ఏగన్, శ్రీదేవి అపళ్ల, ఫెమీనా జార్జ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా అక్టోబర్ 23న థియేటర్లలో విడుదలైంది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
మనోహర్ (ఏగన్) కోయంబత్తూరులో ఇంజినీరింగ్ చదువుతుంటాడు. అక్కడే కొడి (శ్రీదేవి అపళ్ల)తో ప్రేమలో పడతాడు. ఆమె ఓ సంపన్న కుటుంబానికి చెందిన అమ్మాయి కావడంతో కులం, ఆర్థిక స్థితి వంటి విషయాలు వారి ప్రేమకు అడ్డంకులుగా మారతాయి. మంచి ఉద్యోగం సంపాదించాలనే ఉద్దేశంతో మనో చెన్నైకి వెళ్తాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య దూరం పెరిగి, మనో ఒంటరిగా మిగిలిపోతాడు. ఆ సమయంలో అతని జీవితంలోకి నివేద (ఫెమీనా జార్జ్) వస్తుంది. ఆమె తన బాయ్‌ఫ్రెండ్ అరుళ్‌తో ఎదుర్కొంటున్న సమస్యల నుంచి బయటపడటానికి మనో సహాయం చేస్తాడు. ఆ తర్వాత నివేద అతనికి దగ్గరవుతుంది.
అయితే మనో మనసులో కొడి ఇంకా ఉందని నివేద గుర్తిస్తుంది. తాను ఎంతగా ప్రేమిస్తున్నా అతను గతాన్ని ఎందుకు మర్చిపోలేకపోతున్నాడో తెలుసుకోవాలని ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో కొడి, మనో మధ్య ఏం జరిగింది? వారిద్దరూ ఎందుకు విడిపోయారు? అనే విషయాలు బయటపడతాయి. ఇద్దరు అమ్మాయిలు హీరో జీవితాన్ని ఎలా ప్రభావితం చేశారు అనే అంశాన్ని దర్శకుడు యువరాజ్ చినసామి చూపించే ప్రయత్నం చేశారు. ప్రేమలో డబ్బు, కులం, చదువు వంటి అంతరాలను ప్రస్తావిస్తూ కొన్ని చోట్ల రొటీన్‌కు భిన్నంగా కథను నడిపించారు.
కథలో కొంత కొత్తదనం ఉన్నా, నెమ్మదిగా సాగే కథనం నిరాశపరుస్తుంది. కాలేజీ నేపథ్యంలో వినోదానికి అవకాశం ఉన్నప్పటికీ కామెడీ పెద్దగా వర్కౌట్ కాలేదు. భావోద్వేగాలను పండించడానికి చేసిన ప్రయత్నాలు కూడా పూర్తిస్థాయిలో ఆకట్టుకోవు. కొన్ని ప్రేమ సన్నివేశాలు ఇప్పటికే చూసిన సినిమాలను గుర్తు చేస్తాయి. ప్రధాన పాత్రల్లో నటించిన ఏగన్, శ్రీదేవి అపళ్ల, ఫెమీనా జార్జ్ తమ పాత్రలకు న్యాయం చేశారు. ప్రీయుశ్ గురుస్వామి కెమెరా పనితనం, సిద్ధూ కుమార్ సంగీతం, శక్తి ప్రణీష్ ఎడిటింగ్ ఫర్వాలేదనిపిస్తాయి. మొత్తంగా ‘హైకూ’లో కొత్త ఆలోచన ఉన్నప్పటికీ, రొటీన్ సన్నివేశాలు, నెమ్మదైన కథనం కారణంగా ఓ మోస్తరు ప్రేమకథగా మిగిలిపోయింది.
[Haiku Movie Review, Haiku Telugu Review, Haiku Netflix Review, Aegan Haiku Movie, Sridevi Apalla Haiku, Femina George Haiku, Haiku Movie Rating, Yuvaraj Chinnasamy, Haiku Movie Story]



