Home

»

Featured News

దాసరిపై కోపంతో సెట్ నుంచి వెళ్లిపోయిన ఎస్.వి.రంగారావు.. అసలేం జరిగింది?

Mar 31, 2026

1973లో విడుదలైన ‘తాత మనవడు’ చిత్రంతో దర్శకుడుగా పరిచయమైన దాసరి నారాయణరావు తొలి సినిమాతోనే ఇండస్ట్రీలోని ప్రముఖుల దష్టిని ఆకర్షించారు. అందరి ప్రశంసలు అందుకున్నారు. ఆత్రేయ వంటి గొప్ప రచయిత దాసరి భుజం తట్టి ప్రశంసించారంటే దాసరి ప్రతిభ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. అలాంటి గొప్ప డైరెక్టర్‌ని పరిచయం చేసిన ఘనత నిర్మాత కె.రాఘవకు దక్కుతుంది. దాసరిని డైరెక్టర్‌గా పరిచయం చేయడానికి ఎన్ని అవరోధాలు ఎదురైనా వాటిని అధిగమించి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ‘తాత మనవడు’ ఘనవిజయం సాధించడంతో దాసరితోనే రెండో సినిమా ప్రారంభించారు రాఘవ. ఆ సినిమా పేరు ‘సంసారం సాగరం’.

ఈ చిత్రంలో కూడా ఎస్.వి.రంగారావు ముఖ్యపాత్ర పోషించారు. తాత మనవడు చిత్రంలో దాసరి రాసిన డైలాగులు తన గాత్రంలో ఎంతో అద్భుతంగా పలికించిన ఎస్వీఆర్.. ఈ సినిమాకి వచ్చే సరికి అలాంటి డైలాగులే చెప్పేందుకు అభ్యంతరం చెప్పారు. సినిమాలో ప్రధాన పాత్ర పోషించిన జయంతి గురించి, ఆమె గొప్ప తనం గురించి ప్రస్తావిస్తూ చెప్పే డైలాగుల పేపర్‌ను ఎస్వీఆర్‌కి ఇచ్చారు దాసరి. ఆ డైలాగులు చదువుకున్న ఎస్వీఆర్.. అంత పెద్ద డైలాగు అవసరం లేదని, తగ్గించి చెప్పినా ఏమీ తేడా ఉండదని, అందులో నుంచి రెండు లైన్లు కట్ చేసి చెబుతానన్నారు. కానీ, దాసరి దానికి ఒప్ప్పుకోలేదు. 

తనలాంటి సీనియర్ నటుడు చెప్పిన మాట ఒక కొత్త దర్శకుడు వినకపోవడం ఎస్వీఆర్‌కి బాగా కోపం తెప్పించింది. ఆ సీన్ చెయ్యను అంటూ పేపర్లు విసిరి కొట్టి, కాస్ట్యూమ్ కూడా తీసేసి సెట్ నుంచి వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న నిర్మాత రాఘవ.. కారులో వెళుతున్న ఎస్వీఆర్‌ను మరో కారులో ఫాలో అయ్యారు. అలా కొంత దూరం వెళ్లిన తర్వాత మనసు మార్చుకొని తిరిగి సెట్‌కి వచ్చారు ఎస్వీఆర్. మారు మాట్లాడకుండా దాసరి ఇచ్చిన డైలాగును యధాతథంగా చెప్పి సింగిల్ షాట్‌లో సీన్ ఓకే చేశారు. 

ఒక మంచి దర్శకుడ్ని, రచయితను అవమానించినందుకు ఎస్వీఆర్ ఎంతో బాధపడ్డారు. ‘డైరెక్టర్ అంటే నీలా ఉండాలి. నేను చెప్పాను కదా అని డైలాగు మార్చలేదు. నువ్వు తప్పకుండా గొప్ప దర్శకుడివి అవుతావు’ అంటూ దాసరిని ఆశీర్వదించారు ఎస్వీఆర్. ఆరోజు సెట్‌లో దాసరి, ఎస్వీఆర్ మధ్య జరిగిన వాగ్వాదం యూనిట్ మెంబర్స్ అందర్నీ కలవరపరిచింది. ఇకపై షూటింగ్ జరుగుతుందా లేదా అనే అనుమానం కూడా వారికి కలిగింది. అయితే ఎస్వీఆర్ అంత గొప్ప నటుడైనా ఎలాంటి ఈగోలకు వెళ్లకుండా తిరిగి సెట్‌కి వచ్చి తను ఇచ్చిన డైలాగ్‌ను ఏమాత్రం మార్చకుండా చెప్పి, ఆ తర్వాత అభినందించడం నిజంగా త‌న జీవితంలో మర్చిపోలేని సంఘటన అని ప‌లు సంద‌ర్భాల్లో చెప్పారు దాస‌రి.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com