Home

»

Featured News

రజినీకాంత్ అలా దూసుకెళ్లారు.. చిరంజీవి మాత్రం మధ్యలోనే ఆగిపోయారు!

Mar 30, 2026

తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో 1970వ దశకంలో హీరోలుగా ఎంట్రీ ఇచ్చిన వారిలో మెగాస్టార్ చిరంజీవి, సూపర్‌స్టార్ రజినీకాంత్‌ల గురించి ప్రత్యేకంగా చెప్ప్పుకోవాలి. ఎందుకంటే ఎలాంటి సినిమా బ్యాక్‌గ్రౌండ్ లేకుండా కేవలం తమ టాలెంట్‌తో నటులుగా పరిచయమై స్టార్స్‌గా ఎదిగారు చిరంజీవి, రజినీకాంత్. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో సినిమాలు చేసి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఒక దశలో తెలుగులో చిరంజీవి టాప్ హీరో అయితే, తమిళ్‌లో రజినీకాంత్ టాప్ హీరోగా చక్రం తిప్పారు. 

ఈ ఇద్దరు స్టార్స్‌కి హాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ వచ్చింది. అయితే మొదట రజినీకాంత్‌ని ఆ ఛాన్స్ వరించింది. ఇండియన్ టెన్నిస్ ప్లేయర్ అశోక్ అమత్‌రాజ్ హాలీవుడ్‌లో సినిమాలు చేస్తూ నిర్మాతగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఆయన సోదరుడు విజయ్ అమత్‌రాజ్ జేమ్స్‌బాండ్ సిరీస్‌లో వచ్చిన ‘ఆక్టోపస్సీ’ చిత్రంలో రోజర్ మూర్‌తో కలిసి నటించారు. ఆ సమయంలోనే ఇండియన్ బ్యాక్‌డ్రాప్‌లో ఒక హాలీవుడ్ మూవీ తియ్యాలనుకున్నారు అశోక్. అప్పటికే సూపర్‌స్టార్‌గా వెలిగిపోతూ జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న రజినీకాంత్ హీరోగా ఆ సినిమా చేసేందుకు ప్లాన్ చేశారు. రజినీ కూడా సినిమా చెయ్యడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 

హాలీవుడ్ నుంచి దాదాపు 25 మంది టెక్నీషియన్స్‌ని ఇండియా తీసుకొచ్చి 1987లో ‘బ్లడ్ స్టోన్‌’ పేరుతో చిత్ర నిర్మాణాన్ని ప్రారంభించారు విజయ్ అమత్‌రాజ్. ఈ సినిమాలో రజినీకాంత్ టాక్సీ డ్రైవర్‌గా నటించారు. 1 మిలియన్ అమెరికన్ డాలర్లతో నిర్మించిన ఈ సినిమా మంచి విజయం సాధించి 5 మిలియన్ డాలర్లు కలెక్ట్ చేసింది. హాలీవుడ్ సినిమాలో హీరోగా నటించిన ఇండియన్ హీరోగా రజినీకాంత్‌కి మంచి పేరు తెచ్చింది ‘బ్లడ్ స్టోన’. 

దాదాపు 10 సంవత్సరాల తర్వాత మెగాస్టార్ చిరంజీవికి హాలీవుడ్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. అమెరికాలో స్థిరపడిన ముగ్గురు భారతీయులు ఈ సినిమా చేసేందుకు ముందుకు వచ్చారు. 1940లో విడుదలైన ది థీఫ్ ఆఫ్ బాగ్దాద్ చిత్రం చాలా పెద్ద విజయం సాధించింది. దానికి కొనసాగింపుగా ది రిటర్న్ ఆఫ్ ది థీఫ్ ఆఫ్ బాగ్దాద్ పేరుతో ఇంగ్లీష్‌లో, తెలుగులో అబూ బాగ్దాద్ గజదొంగ పేరుతో సినిమాను నిర్మించాలని ప్లాన్ చేశారు. ఆరోజుల్లోనే ఈ సినిమాకి 50 కోట్ల బడ్జెట్ నిర్ణయించారు. ఇప్పటి లెక్కల ప్రకారం చూస్తే దాదాపు 500 కోట్లు అని చెప్పాలి.

హాలీవుడ్ నుంచి టెక్నీషియన్స్‌ని రప్పించారు. సెకండ్ యూనిట్ డైరెక్టర్‌గా సురేష్ కష్ణను ఎంపిక చేశారు. 1998 సెప్టెంబర్‌లో రామోజీ ఫిలిం సిటీలో ఈ చిత్రం ప్రారంభోత్సవం ఎంతో ఘనంగా జరిగింది. అక్టోబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించారు. ఇంగ్లీష్ వెర్షన్ గంటన్నరగా, తెలుగు వెర్షన్ రెండున్నర గంటలుగా నిర్ణయించారు. తెలుగు వెర్షన్‌లో 5 పాటలు, కొన్ని కామెడీ సీన్స్‌ని కూడా జోడించారు. ఎ.ఆర్.రెహమాన్‌కి సంగీతాన్ని చేసే బాధ్యత అప్పగించారు. 

కొంత షూటింగ్ జరిగిన తర్వాత మూడు నిమిషాల నిడివి వుండే ఒక ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. అది చూసిన తెలుగు బయ్యర్లు పోటీ పడ్డారు. ఆరోజుల్లో చిరంజీవి సినిమాకి 8 కోట్లు బిజినెస్ జరిగేది. ఈ సినిమాకి 12 కోట్ల వరకు బిజినెస్ ఆఫర్స్ వచ్చాయి. అంతా బాగానే ఉంది అనుకుంటున్న తరుణంలో పెద్ద సమస్య వచ్చి పడింది. ఇది ఇస్లామిక్ మతానికి సంబంధించిన కథ. ఖురాన్ అనేది వారికి ఎంతో పవిత్రమైంది. కథ ప్రకారం ఖురాన్ పాతగా కనిపించడం కోసం దానిపై కాఫీని ఒలికించారు. ఇది ఆ మతస్థులకు ఆగ్రహాన్ని తెప్పించింది. 

ఈ సినిమా షూటింగ్ ఆపెయ్యాలంటూ ఆందోళన చేపట్టారు. చిత్ర నిర్మాతలు ముగ్గురి మీదా కేసులు పెట్టారు. దీంతో షూటింగ్ అర్థాంతరంగా ఆగిపోయింది. ఈ కేసుల వల్ల నిర్మాతలు చాలా ఇబ్బందులు పడ్డారు. ఈ గొడవలతో సినిమాను పక్కన పెట్టేశారు. అలా చిరంజీవికి వచ్చిన హాలీవుడ్ సినిమా అవకాశం చేజారిపోయింది. ఆ అనుభవంతో కొత్త నిర్మాతలతో సినిమా చెయ్యకూడదని చిరంజీవి నిర్ణయించుకున్నారు. అన్నీ సక్రమంగా జరిగి ఉంటే హాలీవుడ్ సినిమాలో హీరోగా నటించిన తొలి తెలుగు నటుడు అనే ఘనత చిరంజీవికి దక్కి ఉండేది.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com