Home

»

Bollywood News

వరుణ్ ధావన్ 'చునరి చునరి' రీమిక్స్ హంగామా.. షేక్ అవుతున్న సోషల్ మీడియా!

May 26, 2026 3:30PM

బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ మరోసారి సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. దర్శకుడు డేవిడ్ ధావన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న "హై జవానీ తో ఇష్క్ హోనా హై" సినిమా ట్రైలర్ లాంచ్ తర్వాత, ఇందులో రీక్రియేట్ చేసిన ఐకానిక్ సాంగ్ "చునరి చునరి" రీమిక్స్ నెట్టింట విపరీతంగా హల్‌చల్ చేస్తోంది. 1999 లో వచ్చిన బ్లాక్‌బస్టర్ హిట్ చిత్రం 'బీవీ నెం. 1' లో సల్మాన్ ఖాన్, సుస్మితా సేన్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ ఎనర్జిటిక్ డ్యాన్స్ నంబర్ ఇప్పటికీ ప్రతి పార్టీలోనూ మారుమోగిపోతూనే ఉంటుంది. సరిగ్గా 27 ఏళ్ల తర్వాత ఈ ఎవర్‌గ్రీన్ క్లాసిక్ సాంగ్‌ను వరుణ్ ధావన్, పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్‌లపై సరికొత్త బాణీలతో రీమిక్స్ వెర్షన్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. అను మాలిక్ స్వరపరిచిన ఒరిజినల్ ట్యూన్‌కు ఈ సరికొత్త రీమిక్స్ జోడించి, స్కాట్లాండ్‌లోని ఎడిన్‌బరో, గ్లాస్గో నగరాల్లోని అందమైన లొకేషన్లలో ఎంతో గ్రాండ్‌గా చిత్రీకరించారు. ప్రముఖ కొరియోగ్రాఫర్ రెమో డిసౌజా సారథ్యంలో ఈ ముగ్గురు స్టార్లు వేసిన హుక్ స్టెప్పులు ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ ప్లాట్‌ఫామ్‌లలో విపరీతమైన వ్యూస్‌తో దూసుకుపోతున్నాయి.

ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో వరుణ్ ధావన్ మాట్లాడుతూ, సల్మాన్ ఖాన్ లాంటి లెజెండ్ చేసిన ఐకానిక్ సాంగ్‌ను మళ్లీ రీక్రియేట్ చేయడం చాలా సవాలుతో కూడుకున్న విషయమని, ఒత్తిడిని అధిగమించి దీనిని పూర్తి చేశామని పంచుకున్నారు. ఈ సినిమాలో కథానుగుణంగా హీరో ఇద్దరు హీరోయిన్ల మధ్య ఎదుర్కొనే 'డబుల్ ట్రబుల్' కన్ఫ్యూజన్ కామెడీ సిట్యువేషన్‌లో ఈ చునరి చునరి రీమిక్స్ పాట వస్తుందని, ఇది థియేటర్లలో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుందని వరుణ్ ధావన్ ధీమా వ్యక్తం చేశారు. అంతేకాదు, సినిమా క్లైమాక్స్‌లో ఒక క్రేజీ సర్ప్రైజ్ హీరోయిన్ ఎంట్రీ కూడా ఉండబోతోందని హింట్ ఇచ్చి అభిమానుల్లో మరింత క్యూరియాసిటీని పెంచేశారు.

మరోవైపు ముంబైలో జరిగిన డేవిడ్ ధావన్ ఫిల్మ్ ఫెస్టివల్ వేడుకలో సల్మాన్ ఖాన్ స్వయంగా పాల్గొని వరుణ్ ధావన్‌పై సరదాగా కౌంటర్లు వేశారు. డేవిడ్ ధావన్, వరుణ్ ధావన్‌లతో కలిసి వేదికను పంచుకున్న సల్మాన్, వరుణ్‌ను చూపిస్తూ.. "వీడు నా ఇంకొక హిట్ పాటను ఎంచక్కా లేపేశాడు" అంటూ నవ్వుతూ వ్యాఖ్యానించారు. దీనికి వరుణ్ ధావన్ ఎంతో సిగ్గుపడుతూ "భాయ్.. ప్లీజ్ వదిలేయ్ భాయ్" అని అనడంతో అక్కడున్న వారంతా నవ్వుల్లో మునిగిపోయారు. గతంలో కూడా వరుణ్ ధావన్.. సల్మాన్ ఖాన్ నటించిన 'జుడ్వా' సినిమా రీమేక్‌లో 'చల్తీ హై క్యా 9 సే 12', 'ఊంచీ హై బిల్డింగ్' వంటి పాటలను రీక్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. టిప్స్ ఫిల్మ్స్ పతాకంపై రమేష్ తౌరానీ నిర్మించిన ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో భారీ విడుదలకు సిద్ధమవుతోంది. సల్మాన్, సుస్మితా సేన్ మ్యాజిక్‌ను ఎవరూ మ్యాచ్ చేయలేరని కొందరు నెటిజన్లు పెదవి విరుస్తున్నప్పటికీ, ఈ సరికొత్త 2.0 పార్టీ వెర్షన్ మాత్రం యువతను ఒక ఊపు ఊపేస్తూ ట్రెండింగ్‌లో నిలుస్తోంది.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com