Home

»

Bollywood News

బాలీవుడ్‌లో హాట్ టాపిక్.. రణ్‌వీర్ సింగ్ రూ. 45 కోట్ల వివాదం ఎటు దారితీస్తోంది?

May 26, 2026 11:59AM

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ కెరీర్‌లో ఇప్పుడు ఊహించని కుదుపు వచ్చింది. టాలెంటెడ్ డైరెక్టర్ ఫర్హాన్ అక్తర్ ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేసిన ‘డాన్ 3’ చిత్రం చుట్టూ ముసురుకున్న వివాదం తీవ్ర రూపాన్ని దాల్చింది. స్క్రిప్ట్ పరంగా తలెత్తిన విభేదాల కారణంగా రణ్‌వీర్ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకోగా, అది కాస్తా బాలీవుడ్ కార్మిక సంఘం అయిన ‘ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయిస్’ (FWICE) ద్వారా ఆయనపై నిషేధానికి దారితీయడం చిత్ర పరిశ్రమలో తీవ్ర సంచలనంగా మారింది.

అసలు విషయానికొస్తే, ఈ ప్రతిష్టాత్మక చిత్రం కోసం రణ్‌వీర్ సింగ్ మొదట రూ. 10 కోట్ల అడ్వాన్స్ తీసుకున్నారు. దాదాపు రెండు మూడేళ్ల పాటు ఈ ప్రాజెక్ట్‌పై చర్చలు జరిగాయి. అయితే ఫర్హాన్ అక్తర్ చేసిన మార్పులు నచ్చకపోవడం, సినిమా ఆలస్యం కావడం వంటి కారణాలతో రణ్‌వీర్ ప్రాజెక్ట్ వదిలేశారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన దర్శకుడు ఫర్హాన్ వర్గం.. అడ్వాన్స్ మొత్తంతో పాటు ప్రీ-ప్రొడక్షన్ ఖర్చుల పేరిట ఏకంగా రూ. 45 కోట్ల భారీ నష్టపరిహారాన్ని డిమాండ్ చేస్తోంది.

రణ్‌వీర్ సింగ్ ఇప్పటికే తాను తీసుకున్న రూ. 10 కోట్ల అడ్వాన్స్‌ను తిరిగి ఇచ్చేసినప్పటికీ, ఫర్హాన్ టీమ్ మాత్రం రూ. 45 కోట్లు ఇస్తేనే వివాదం సర్దుమణుగుతుందని పట్టుబడుతోంది. స్క్రిప్ట్ పనులే పూర్తిగా పూర్తికానప్పుడు అంత భారీ మొత్తం ఖర్చయిందని చెప్పడం సరికాదని రణ్‌వీర్ వాదిస్తున్నారు. ఈ గోడవల వల్ల బాలీవుడ్ నుండి ఎలాంటి సహకారం అందకుండా రణ్‌వీర్‌పై బ్యాన్ విధించడంతో, ఈ సంక్షోభం నుండి ఆయన ఎలా బయటపడతారనేది ఆసక్తికరంగా మారింది.

గతంలో రణ్‌వీర్ సింగ్ ఇలాంటి వివాదాల్లో చిక్కుకున్న దాఖలాలు లేవు. ‘బాజీరావ్ మస్తానీ’, ‘పద్మావత్’ వంటి భారీ బ్లాక్‌బస్టర్ చిత్రాలతో బాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించుకున్న ఈ వెర్సటైల్ నటుడికి ప్రస్తుత పరిస్థితి ఒక పెద్ద సవాల్‌గా మారింది. మరోవైపు ఫర్హాన్ అక్తర్ కూడా పట్టుదలకు పోవడంతో ఈ వివాదం ఇండస్ట్రీలో ఒక పెద్ద గుణపాఠంగా మారేలా కనిపిస్తోంది.

ఈ పరిణామాలపై సోషల్ మీడియాలో నెటిజన్లు, అభిమానులు భిన్నంగా స్పందిస్తున్నారు. అడ్వాన్స్ వెనక్కి ఇచ్చేసినా ఇంత పెద్ద మొత్తం డిమాండ్ చేయడం అన్యాయమని కొందరు రణ్‌వీర్‌కు మద్దతు తెలుపుతుంటే, సినిమాను నమ్ముకుని సమయం వృధా చేసినందుకు నిర్మాతలకు న్యాయం జరగాలని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. హీరోలు ప్రాజెక్ట్‌లు ఓకే చేసే ముందు మరింత జాగ్రత్తగా ఉండాలని పరిశ్రమ వర్గాల వారు చర్చించుకుంటున్నారు.

ప్రస్తుతానికి ఈ నిషేధం తొలగిపోవాలంటే రణ్‌వీర్ సింగ్ సదరు చిత్రబృందంతో కూర్చుని సామరస్యం గా మాట్లాడుకోవడమో లేదా అడిగిన నష్టపరిహారం చెల్లించడమో ఏకైక మార్గంగా కనిపిస్తోంది. మరి బాలీవుడ్‌లో సంచలనం సృష్టిస్తున్న ఈ రచ్చకు రణ్‌వీర్ ఎలాంటి ముగింపు పలుకుతారో, ఆయన రాబోయే కొత్త ప్రాజెక్ట్‌లపై దీని ప్రభావం ఎంతవరకు ఉంటుందో వేచి చూడాలి.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com