TeluguOne App Promotion
● # Tweets

Home

»

బాలీవుడ్

26/11 రోజే ముంబైలో కలకలం.. అమితాబ్ బచ్చన్ ఇంటికి బాంబు బెదిరింపులు.!

Nov 26, 2026 5:33PM

ముంబైలో మరోసారి బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. 26/11 ఉగ్రదాడులు జరిగి నేటికి 18 ఏళ్ళు. సరిగ్గా ఇదే రోజు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ నివాసం ‘జల్సా’ను లక్ష్యంగా చేసుకుని బెదిరింపు ఈమెయిల్ రావడం ఆందోళన కలిగిస్తోంది. అంతేకాదు.. ప్రముఖ పంజాబీ గాయకుడు దిల్జీత్ దోసాంజ్ మ్యూజిక్ కాన్సర్ట్‌ను కూడా టార్గెట్ చేస్తామని అందులో హెచ్చరించడం చర్చనీయాంశంగా మారింది.

ముంబై మేయర్ రితు తావ్డే, బీఎంసీ కమిషనర్ అశ్విని భిడేలకు ఈ బెదిరింపు ఈమెయిల్ అందినట్లు సమాచారం. అమితాబ్ బచ్చన్ నివాసమైన జల్సాతో పాటు మేయర్ కార్యాలయం, ముంబై మెట్రో రైల్ నెట్‌వర్క్, మరికొన్ని ప్రాంతాలపై దాడులు చేస్తామని అందులో పేర్కొన్నట్లు వార్తలు వస్తున్నాయి.

ముఖ్యంగా నవంబర్ 27న ముంబైలోని మహాలక్ష్మి రేస్‌కోర్స్‌లో దిల్జీత్ దోసాంజ్ లైవ్ షో జరగనుంది. ఈ కార్యక్రమాన్ని రద్దు చేయకపోతే నగరంలో వరుసగా దాడులు చేస్తామని బెదిరించినట్లు తెలుస్తోంది. కాన్సర్ట్‌కు వచ్చే వారిని కూడా హెచ్చరిస్తూ ఈమెయిల్ పంపినట్లు సమాచారం.

ఈ మెయిల్‌లో ఖలిస్తాన్, 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల ప్రస్తావన కూడా ఉన్నట్లు వార్తా కథనాలు వెల్లడిస్తున్నాయి. ‘ఖలిస్తాన్ నేషనల్ ఆర్మీ’, ‘బబ్బర్ ఖల్సా’ వంటి సంస్థల పేర్లను కూడా అందులో ప్రస్తావించినట్లు సమాచారం. అయితే ఈ మెయిల్‌లో చేసిన ఆరోపణలు, బెదిరింపుల విశ్వసనీయత ఇంకా నిర్ధారణ కాలేదు.

ఇది కూడా చదవండి: రామాయణ టీమ్‌తో అమిత్ షా ప్రత్యేక భేటీ.!

మరోవైపు నవంబర్ 29న బెంగళూరులో దిల్జీత్ దోసాంజ్ నిర్వహించనున్న సంగీత కార్యక్రమానికి కూడా ఐఈడీ దాడి ముప్పు ఉందంటూ రెండు రోజుల క్రితం బెదిరింపు మెయిల్ వచ్చినట్లు వార్తలు వచ్చాయి. వరుసగా ఇలాంటి హెచ్చరికలు రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

అమితాబ్ బచ్చన్ ఇంటికి బెదిరింపులు రావడం ఇదే మొదటిసారి కాదు. ఈ నెలలోనూ జల్సా, ముంబైలోని మరికొన్ని ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని బెదిరింపు మెయిల్స్ వచ్చినట్లు సమాచారం. గతంలో పోలీసులు తనిఖీలు నిర్వహించినా అనుమానాస్పద వస్తువులు లభించలేదని వార్తలు వెల్లడించాయి.

ఇప్పుడు 26/11 వార్షికోత్సవం రోజే మరోసారి ఇలాంటి బెదిరింపులు రావడంతో ముంబైలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ముఖ్యంగా దిల్జీత్ కాన్సర్ట్ నేపథ్యంలో పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. ఈ బెదిరింపు వెనుక ఎవరున్నారు? ఈ మెయిల్స్ వెనుక నిజంగా ఏదైనా కుట్ర ఉందా? అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.

మీకు నచ్చవచ్చు: 
పాకిస్థాన్ వెబ్‌సిరీస్‌ బ్యాన్.. నెట్‌ఫ్లిక్స్‌కు కేంద్రం కీలక సూచన.!
తెల్లవారుజామున భజన.. అక్షయ్ కుమార్‌ పరువు తీసేసిన ట్వింకిల్ ఖన్నా.!

 

 

 

[Amitabh Bachchan, Bomb Threat, Diljit Concert, 26/11 Attack, Mumbai]

 

google-ad-img