English | Telugu
'ఇంట్లో నాది కుక్క బతుకు' అంటున్న ప్రకాష్‌రాజ్!
Updated : Oct 6, 2021
"ఇంట్లో కుక్క బతుకు. అమ్మకు 82 ఏళ్లు. ఆవిడను చూసుకునే నర్సు, పనిమనిషి, నా కూతుళ్లు. ఆడాళ్ల మధ్యలో ఉంటున్నాను. వాళ్లదే రాజ్యం" అని ప్రకాష్ రాజ్ అన్నారు. ఢిల్లీకి రాజైనా ఓ తల్లి కుమారుడే అని సామెత ఉంది. అలాగే, ఎంత పెద్దవారైనా ఇంట్లో మహిళలు చెబితే వినాల్సిందేనని 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో ఆయన మాటలను బట్టి అర్థమవుతోంది.
భార్య పోనీ వర్మ, కుమార్తెలు ఇద్దర్నీ చూపిస్తూ... "వీళ్లంతా రిక్వెస్ట్ చేయరు. ఆర్డర్ వేస్తారు. బయట నేను విలన్. నన్ను జోకర్‌లా చూస్తారు వీళ్ళందరూ" అని ప్రకాష్ రాజ్ చెప్పారు. తన విడాకులపైనా ఆయన స్పందించారు. "ప్రపంచానికి అబద్ధం చెబుతూ బతకడం కన్నా... పిల్లలకు అబద్ధం చెబుతూ చంపుకోవడం కన్నా... విడిగా బతుకుతూ హ్యాపీగా ఉందామని అనుకున్నాం" అని తొలి భార్య లలితకుమారితో ఎందుకు విడిపోయిందీ ప్రకాష్ రాజ్ తెలిపారు.
ప్రకాష్ రాయ్ నుండి తన పేరును ప్రకాష్ రాజ్‌గా మార్చింది కె. బాలచందర్ అని చెప్పారు. కృష్ణవంశీ స్వార్థపరుడు అయినప్పటికీ... పూరి జగన్నాథ్ కంటే ఎక్కువ ప్రేమిస్తానని ప్రకాష్ రాజ్ తెలిపారు.
'ఏ అసోసియేషన్ అయితే నన్ను బ్యాన్ చేసిందో... దానికి నేను ప్రెసిడెంట్ అవ్వాలని పోటీ చేస్తున్నారా? అది అచీవ్ మెంటా? రివెంజా?' అని అలీ అడిగితే... "ఛీఛీ... అలా లేదు. అది మర్చిపోయా. మీరు గుర్తు చేశారంతే. ఇది అమెరికన్ ప్రెసిడెంట్ ఎలక్షనా?" అని ప్రకాష్ రాజ్ ఆన్సర్ ఇచ్చారు.