English | Telugu

'ఉప్పెన'లో సేతుపతి... బుల్లితెరలో నిరుపతి!

సూపర్ డూపర్ హిట్ సీరియల్ 'కార్తీకదీపం', 'హిట్లర్ గారి పెళ్ళాం'తో బుల్లితెరలో నిరుపమ్ పరిటాలకు స్టార్ ఇమేజ్ వచ్చింది. అతడిని అభిమానించే జనాలు చాలా మంది ఉన్నారు. అదే సమయంలో అతడిపై సరదాగా సెటైర్లు వేసే సెలబ్రిటీలు ఉన్నారు. జీ తెలుగు ఛానల్ వాళ్లు పండగలకు ప్రత్యేకంగా ఈవెంట్లు చేసిన ప్రతిసారి నిరుపమ్ మీద శ్రీముఖి సెటైర్లు కంపల్సరీగా ఉంటాయి.

విజయదశమి పండక్కి 'దసరా దోస్తీ' పేరుతో జీ తెలుగు ఛానల్ ఒక ఈవెంట్ చేసింది. దానికి మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ అతిథిగా వచ్చాడు. తొలి సినిమా 'ఉప్పెన'తో అతడు బ్లాక్ బస్టర్ కొట్టిన సంగతి తెలిసిందే. అతడితో కలిసి స్టేజ్ మీద శ్రీముఖి సరదాగా కాసేపు వినోదం పండించింది.

వైష్ణవ్ తేజ్ ఏదో అడగ్గా... 'భయమేస్తుంది' అన్నీ శ్రీముఖి సమాధానమిచ్చింది. 'నీళ్లు అంటే భయమా? నాన్న అంటే భయమా?' అని వైష్ణవ్ అడిగాడు. 'నిరుపమ్ అంటే భయం' అని శ్రీముఖి అనడంతో నిరుపమ్ పరిటాల షాక్ అయ్యాడు. అంతటితో అయిపోలేదు. 'మీ సినిమాలో సేతుపతి కదా ఇక్కడ నిరుపతి' అని శ్రీముఖి చెప్పబోగా... 'ఇప్పుడు క్లైమాక్స్ వరకు ఎందుకు లెండి' అని వైష్ణవ్ అనడంతో అందరూ నవ్వేశారు. ఈ కార్యక్రమం అక్టోబర్ 10న ప్రసారం కానుంది.