English | Telugu

'బిగ్ బాస్' గురించి 'క్యాష్'లో మాట్లాడితే ఎడిటింగే!

ఎంటర్టైన్మెంట్ ఛానళ్ల మధ్య పోటీ ఎంతలా ఉందనేది చెప్పడానికి ఇదొక ఉదాహరణ. తమకు పోటీ ఛానల్‌లో ఒక షో పేరు మరొక ఛానల్‌లోని షోలో చెప్పడానికి వీల్లేని పరిస్థితి. అవునా? నిజమా? అని ఆశ్చర్యం వ్యక్తం చేయాల్సిన అవసరం లేదు. నిజమే! 'క్యాష్' కొత్త ప్రోమో చూస్తే... ఆ సంగతి తెలుస్తుంది. అసలు వివరాల్లోకి వెళితే...దేత్తడి హారిక, మెహబూబ్‌, జోర్దార్ సుజాత, దర్శకుడు సూర్య కిరణ్... న‌లుగురూ గతంలో 'బిగ్ బాస్' హౌస్‌కు వెళ్లి వచ్చినవారే.

"హౌస్‌లో ఆడి ఆడి గేమ్స్ అనగానే అలర్ట్ ఇంక" అని దేత్తడి హారిక అన్నది. సుమ వెంటనే అలర్ట్ అయ్యింది. "మీకు తెలుసుగా! అది వేరే హౌస్‌. ఇది వేరే హౌస్‌. వీలైనంతవరకూ అది చెప్పకుండా ఉంటేనే బెటర్. లేకపోతే అయ్యో.. అంతా ఎడిటింగ్ లో వెళ్ళిపోయింది. నేను ఇంత మాట్లాడానే? ఏం లేదే? అనుకోవాలి" అని సుమ చెప్పారు. అదీ సంగతి!

పక్క ఛానల్ లో షో పేరు తీయకూడదు కానీ... అక్కడి షోలను పేరడీ చేయొచ్చనుకుంట. 'ఇక నుండి ప్రశ్నలు మావి. సమాధానాలు మీవి. మా డబ్బులు మా దగ్గరే ఉంటాయి. మీ డబ్బులు మీ దగ్గరే ఉంటాయి. మీలో ఎవరు క్యాషాధికారి' అంటూ 'ఎవరు మీలో కోటీశ్వరులు'ను స్పూఫ్ చేశారు సుమ. అన్నట్టు... స్టార్‌మా ఛాన‌ల్‌లో 'బిగ్ బాస్' రియాలిటీ షో, ఈటీవీలో 'క్యాష్' ప్రసారం అవుతాయి.