English | Telugu
రవితేజను ‘మీ పేరేంటి?’ అని అడిగాడు!
Updated : Sep 1, 2021
మాస్ మహారాజ్ రవితేజ అంటే తెలియనివాళ్లు ఉండరు. ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో టెక్నిషియన్స్ నుండి యాక్టర్స్ వరకూ అందరికీ రవితేజ తెలుసు. అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి హీరోగా టర్న్ అయ్యాడు కదా! ఇండస్ట్రీ కష్టాలు తెలిసినోడు. అందుకని, ఎవరైనా కొత్త హీరోలు బాగా చేస్తే అప్రిషియేట్ చెయ్యడం రవితేజ అలవాటు. అలాగే, ఓ హీరోకి ఫోన్ చేసి అప్రిషియేట్ చేస్తే... ఫోన్ పెట్టేసే ముందు ఆ కొత్త హీరో ‘సార్... మీ పేరేంటి?’ అని అడిగాడు. ‘నన్ను రవితేజ అంటారండీ’ అని సవినయంగా మాస్ మహారాజ్ సమాధానం ఇచ్చాడు. అప్పటి ఆ కొత్త హీరో, ఇప్పటి దర్శక–రచయిత, హీరో, నటుడు అవసరాల శ్రీనివాస్.
‘అష్టా చమ్మా’ విడుదలైన తర్వాత ఈ సంఘటన జరిగింది. ‘అష్టా చమ్మా’ విడుదలైన తర్వాత అవసరాలకు రవితేజ ఫోన్ చేశారు, ప్రశంసించారు. అప్పటికి ఆయన స్టార్ హీరో అయితే... రవితేజ వాయిస్ గుర్తుపట్టని అవసరాల అమాయకంగా మాస్ మహారాజ్ పేరు అడిగారు. ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమంలో ఆలీ అడిగితే... అవసరాల శ్రీనివాస్ ఈ విషయం చెప్పారు.
‘అష్టా చమ్మా’ సినిమా ట్రయిలర్ విడుదలయ్యేవరకూ ఇంట్లో సినిమా చేస్తున్న సంగతి చెప్పలేదని అవసరాల శ్రీనివాస్ తెలిపారు. ట్రయిలర్ చూసి ‘చేస్తే చేశావ్ కానీ ఇంకెప్పుడు చెయ్యకు’ అని అవసరాల తండ్రి చెప్పారట. ‘ఊహలు గుసగుసలాడే’ చూసిన తర్వాత ప్రశంసించారట. అవసరాల శ్రీనివాస్ చెప్పిన మరిన్ని సరదా సంగతులు చూడాలంటే సెప్టెంబర్ 6న ప్రసారం అయ్యే ఫుల్ ఎపిసోడ్ చూడాలి.