English | Telugu
టీవీ తార రాగిణి ఎవరో మీకు తెలుసా?
Updated : Aug 26, 2021
'అమృతం' సీరియల్‌లో అంజి (గుండు హనుమంతరావు) భార్య శాంత పాత్రలో ఆడియెన్స్‌ను అమితంగా అలరించిన రాగిణి ఎవరో నేటి తరంలోని చాలామందికి తెలీదు. ఆమె మొదట 'వేమన' టీవీ సీరియల్ ద్వారా దూరదర్శన్ ప్రేక్షకులకు పరిచయమయ్యారు. అప్పట్నుంచి ఇప్పటిదాకా లేడీ డిటెక్టివ్, అమృతం, నాన్న, రాధ మధు, ఇద్దరు అమ్మాయిలు, అగ్నిసాక్షి, రెండు రెళ్లు ఆరు లాంటి సీరియల్స్ ద్వారా వీక్షకులకు బాగా సన్నిహితమయ్యారు. ఆమె కామెడీ టైమింగ్, ఆమె హావభావాలు అందరినీ అలరిస్తుంటాయి.
రాగిణి స్వతహాగా తెలుగు వనిత అయినా బాల్యమంతా కర్ణాటకలోని రాయచూర్‌లో గడిచింది. ప్రముఖ సీనియర్ నటి కృష్ణవేణికి రాగిణి స్వయానా చెల్లెలు. నటిగా సినీ రంగంలో ప్రవేశించాలనే ఉద్దేశంతో, అక్క కృష్ణవేణి ప్రోత్సాహంతో, మద్రాసులో వెంపటి చినసత్యం మాస్టర్ దగ్గర మూడేళ్లపాటు ఆమె డాన్స్ అభ్యసించారు. ఆ తర్వాత మద్రాస్ నుంచి హైదరాబాద్ వచ్చి స్థిరపడిన తర్వాత మొట్టమొదటగా 'వేమన' టీవీ సీరియల్‌లో తన అక్క కృష్ణవేణికి కూతురి పాత్రలో నటించారు రాగిణి. ఆ తర్వాత ఆమె వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా ఒక దాని తర్వాత ఒకటిగా పలు దూరదర్శన్ సీరియల్స్‌లో నటించే అవకాశం లభించింది. ముఖ్యంగా 'ఎండమావులు' సీరియల్‌లో భర్తపట్టే బాధలు భరించలేక ఎదురుతిరిగి పోరాడిన యువతిగా ఆమె పోషించిన సీత పాత్ర విశేషమైన పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టాయి. ఇప్పటి ఆమె ఇమేజ్‌కు ఆ సీత క్యారెక్టర్ పూర్తి భిన్నమైనది కావడం గమనార్హం.
టీవీ సీరియల్స్ ద్వారా వచ్చిన పాపులారిటీ వల్ల రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో 'గాయం' సినిమాలో గుమ్మడి కూతురిగా నటించే అవకాశం వచ్చింది రాగిణికి. అప్పట్నుంచీ కేవలం టీవీకే పరిమితం కాకుండా అవకాశం లభించినప్పుడల్లా సినిమాల్లోనూ నటిస్తూ వస్తున్నారు. అలా ఆమె నటించిన సినిమాల్లో అన్న, అందరూ అందరే, కిష్కింధకాండ, సూపర్ మొగుడు, పవిత్ర బంధం, పెళ్లి చేసుకుందాం, గణేష్, అష్టా చమ్మా, బాణం, ఈ రోజుల్లో, జులాయి, భలే భలే మగాడివోయ్, మహానుభావుడు లాంటి సినిమాలు ప్రముఖమైనవి. మొదట్లో సాత్విక పాత్రలతో ఆకట్టుకున్న రాగిణి ఇప్పుడు కామెడీ టచ్ ఉన్న క్యారెక్టర్లు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం ఆమె 'అమృతం ద్వితీయం', 'చెల్లెలి కాపురం' సీరియల్స్‌లో నటిస్తున్నారు.