English | Telugu
దీపను చంపడానికి గన్ తీసిన మోనిత!
Updated : Sep 9, 2021
దీపను మోనిత ఏమైనా చేస్తుందేమో అని కంగారులో కార్తీక్ ఉంటే... అతడిని కోర్టుకు హాజరు పరచడమే తన ప్రథమ కర్తవ్యంగా ఏసీపీ రోషిణి విధి నిర్వహణలో ఉంటుంది. మరోవైపు మోనిత వెనుక కారులో దీప బయలుదేరినా... పట్టుకోలేకపోతుంది. మొత్తం మీద ఈ రోజు (సెప్టెంబర్ 9) 'కార్తీక దీపం' సీరియల్‌లో కథ పెద్దగా ముందుకు కదల్లేదు. కానీ, కథనం ఆకట్టుకునేలా ఉంది. ఉత్కంఠను కొనసాగించిందని చెప్పాలి. అసలు, ఏమైందనే వివరాల్లోకి వెళితే...
రీనా వేషంలో ఆస్పత్రికి వచ్చిన మోనిత తన దగ్గరకు రాకపోవడం... దీప కనిపించకపోవడంతో కార్తీక్ కంగారు పడతాడు, మోనితను పట్టుకోవడానికి దీప వెళ్లిందా? అని. దీపను వెదకడానికి వెళతా అంటే పోలీసులు ఒప్పుకోరు. దాంతో మోనితకు రత్నసీత ఫోన్ చేస్తుంది. దీప కోసం కార్తీక్ కంగారు పడుతున్నట్టు చెబితే... 'కాసేపటిలో నా చేతిలో దీప చావబోతుంది' అని మోనిత ఫోన్ పెట్టేస్తుంది.
కట్ చేస్తే... కోర్టులో కార్తీక్ ను హాజరు పరచాలని ఏసీపీ రోషిణి వస్తుంది. దీప కనిపించడం లేదని, తన భార్యను మోనిత ఏమైనా చేసి ఉంటుందని కార్తీక్ చెబుతాడు. మోనితను మీరే చంపేశారని రోషిణి అంటుంది. అప్పుడు ఆమెకు కార్తీక్ నిజం చెబుతాడు. బసవయ్య కూతురు మూగమ్మాయిగా టీ తెచ్చినదీ, రీనా వేషంలో వచ్చినదీ మోనిత అనీ... పెళ్లి చేసుకోకపోతే తన కుటుంబాన్ని చంపేస్తానని బెదిరించిందనీ కార్తీక్ వివరిస్తాడు. అయితే, రోషిణి వినదు. 'స్టాపిట్... మీ దగ్గర ఒక్క సాక్ష్యమైనా ఉందా?' అని ఎదురు ప్రశ్నిస్తుంది. 'నేనే సాక్ష్యం. నా భార్య ప్రత్యక్ష సాక్షి' అని కార్తీక్ చెబుతాడు. రోషిణి పట్టించుకోకపోవడంతో దీపను వెతికించమని ప్రాధేయపడతాడు. కోర్టుకు వెళ్లొచ్చిన తర్వాత వెతికిస్తానని రోషిణి చెబుతుంది. కార్తీక్ రిక్వెస్ట్ చేస్తుంటే... 'అతడు మనకు డాక్టర్ కాదు... ఖైదీ. పట్టుకొచ్చేయండి' అని పోలీసులను ఏసీపీ ఆదేశిస్తుంది. దాంతో అతడిని కోర్టుకు తీసుకువెళతారు.
మరోవైపు... మోనిత వెనుక బయలుదేరిన దీప కారులో పెట్రోల్ అయిపోవడానికి దగ్గరగా ఉండటంతో ఓ బంక్ దగ్గర ఆగుతారు. మోనిత కూడా క్యాబ్ దిగుతుంది. అదే రూటులో కార్తీక్ ను పోలీసులు కోర్టుకు తీసుకువెళుతుంటే దొంగచాటుగా మోనిత చూస్తుంది. 'కార్తీక్... జైలుపాలు అవుతున్నావా?' అంటూ ఫీల్ అవుతుంది. అక్కడ నుండి కొంచెం కదిలేసరికి దీప కనిపించడంతో చెట్టు చాటు నుండి చంపాలని గన్ తీస్తుంది. కోర్టుకు కార్తీక్ వెళ్లేసరికి తల్లితండ్రులు, కుటుంబ సభ్యులు ఉంటారు. తల్లి సౌందర్యతో మోనితను పట్టుకోవడానికి దీప వెళ్లిందని కార్తీక్ చెబుతాడు. సౌందర్య భయపడుతుంది. అక్కడితో ఎపిసోడ్ కి ఎండింగ్ కార్డు పడింది. తర్వాత ఏం జరుగుతుందో చూడాలి.