English | Telugu
పంచ్ డైలాగ్స్‌తో అన్నపూర్ణ అదరగొట్టేశారంతే!!
Updated : Sep 9, 2021
సీనియర్ నటి అన్నపూర్ణ కామెడీ టైమింగ్ సూపరంతే! ఆమె వేసిన పంచ్ డైలాగ్స్ ముందు కంటెస్టెంట్స్ చేసిన కామెడీ చిన్నబోయేలా ఉందంటే అతిశయోక్తి కాదు. రెగ్యులర్‌గా షోలో కామెడీ చేసే టీమ్ లీడర్లు, శేఖర్ మాస్టర్ మధ్య మధ్యలో వేసే సెటైర్స్ కంటే అన్నపూర్ణ చమక్కులు 'కామెడీ స్టార్స్'లో బాగా పేలాయి. ప్రోమోలో ఇంత సందడి చేశారంటే... షోలో ఇంకెంత చేసి ఉంటారో? అప్‌కమింగ్ సండే 'కామెడీ స్టార్స్' చూడాల్సిందే అన్నట్టు చేశారు.
'స్టార్ మా'లో ప్రతి ఆదివారం ప్రసారమయ్యే 'కామెడీ స్టార్స్' షో కోసం గిరిబాబు, హాస్యనటి శ్రీలక్ష్మితో పాటు అన్నపూర్ణ అతిథులుగా వచ్చారు. స్టేజి మీదకు వచ్చీ రావడంతో 'ఈ పిల్లకు పెళ్లి అవ్వదా?' అని శ్రీముఖి మీద పంచ్ వేశారు. 'మాకూ అదే డౌట్' అని శేఖర్ అంటే... 'నేను తప్పటడుగులు వేస్తున్నప్పటి నుండి చూస్తున్నా. నీకు పెళ్లి అవ్వదా?' అని మళ్ళీ శ్రీముఖిని అడిగింది. అందరికీ అవినాష్ నమస్కారాలు పెడుతుంటే... 'దీంతోనే సరిపెడతావా? ప్రోగ్రామ్ ఏమైనా చేస్తావా?' అని మరో పంచ్ వేశారు.
మినీ స్కర్ట్ వేసుకున్న అషురెడ్డి నా డ్రస్ చూడండి. ఎంత బాగుందో అని తెగ ఇదైపోతుంటే, డ్రస్ వేసుకున్నానని ఫీలీంగా నీకు? అని చమత్కరించారు అన్నపూర్ణ. శేఖర్ మాస్టర్ డాన్స్ చేశాక తన సీట్లో కూర్చొని ఆయాసం వస్తోందని అంటే 'ఇద్దమ్మాయిల మధ్యలో మాస్టర్ ను ఆడమన్నారు. ఆయాసం రాదూ?' అని సైలెంట్ గా ఓ చమక్కు విసిరారు. అన్నపూర్ణను తీసుకొచ్చి 'కామెడీ స్టార్స్' టీమ్ మంచి పని చేసినట్టు ఉంది.