English | Telugu
"దేనికి భయపడుతున్నారు?".. కార్తీక్‌ను నిలదీసిన దీప!
Updated : Sep 1, 2021
తనను పెళ్లి చేసుకుంటే కుటుంబమంతా కలిసి ఉందామని... లేదంటే మీ కుటుంబంలో ఎవ్వరినీ విడిచి పెట్టనని కార్తీక్‌కి మోనిత వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ విషయం ఎవరికీ చెప్పలేక తనలో తాను కార్తీక్ బాధపడుతూ ఉండటంతో నేటి ఎపిసోడ్ ముగిసింది. దీప తన పక్కనే ఉన్నప్పటికీ ఆమెకు ఏమీ చెప్పుకోలేకపోతాడు. మరోవైపు కడుపులో బిడ్డతో 'నువ్వు బయటకు వచ్చేలోపు అన్నీ సెట్ చేసేస్తా' అంటుంది. దాని అర్థం కార్తీక్ అలియాస్ డాక్టర్ బాబును పెళ్లి చేసుకుంటాననే! అసలు, ఈరోజు (సెప్టెంబర్ 1) ఎపిసోడ్‌లో ఏం జరిగింది? అనే వివరాల్లోకి వెళితే...
మోనిత మాటలను గుర్తు చేసుకుంటూ... ఆలోచనల్లో పడతాడు కార్తీక్. ఉన్నట్టుండి ఒక్కసారిగా 'నో' అని అరుస్తాడు. ఏమైంది డాక్టర్ బాబు అని దీప దగ్గరకు వస్తుంది. కానీ, ఆమెతో ఏమీ చెప్పడు. మనసులో పాములాంటి దానితో స్నేహం చేశానని, అది నన్ను కాటేసిన పర్వాలేదు కానీ నా కుటుంబం మీద కాటు పడనివ్వనని అనుకుంటాడు. తర్వాత ఇంట్లో పిల్లల దగ్గర అందరూ ఉన్నారు కాబట్టి దీపను ఆస్పత్రిలో ఉండమని అడుగుతాడు. ఏమైందని, ఎందుకలా ఉన్నారని దీప అడిగినా సమాధానం చెప్పడు.
మరోవైపు కడుపులో బిడ్డతో 'ఏం నాన్నా! మీ అమ్మ కడుపులోంచి ఎప్పుడెప్పుడు బయటకు రావాలని ఆరాటపడుతున్నావా? కొన్ని నెలలే! మీ నాన్నను చూశావ్ కదా! అందగాడు, మంచివాడు. అందుకే, ఏరికోరి ఎంపిక చేసుకున్నా. కానీ, మనల్ని పట్టించుకోడం లేదు. దానికి మీ పెద్దమ్మ, ఆ వంటలక్క కారణం. పదేళ్లు దూరంగా ఉన్నా ఆవిడ కోసమే మీ నాన్న ఆరాటం. అయినా సరే నా పోరాటం ఆపను. నువ్వు బయటకు వచ్చేలోపు అన్నీ సెట్ చేస్తా' అంటుంది. మోనిత కాన్ఫిడెన్స్ చూస్తుంటే డాక్టర్ బాబును పెళ్లి చేసుంటుందని అనిపిస్తుంది. అంత గట్టిగా పెళ్లి చేసుకోవాలని కోరుకుంటుంది.
తెల్లవారిన తర్వాత పిల్లలు తండ్రికి ఎలా ఉందోనని కార్తీక్ గురించి ఆలోచిస్తారు. తల్లి గురించి వాళ్లకు కొంచెం కూడా బెంగ లేదని సౌందర్య కోప్పడుతుంది. ఆమె ఆలోచన అంతా కోడలు దీప గురించే. మరోవైపు ఆస్పత్రిలో కార్తీక్ బయట నేల మీద కింద కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు. అతడికి దగ్గరకు వెళ్లిన దీప 'మీరు దేనికి భయపడుతున్నారు?' అని అడుగుతుంది. 'నేను బాగానే ఉన్నాను దీప. నేను బాధపడేది నా గురించి కాదు. నా వల్ల మీరంతా ఇబ్బంది పడుతున్నారని. ఆ నమ్మకద్రోహి మోనిత ముందు నా నిజాయతీ ఎందుకూ పనికిరాకుండా పోయింది' అని కార్తీక్ అంటాడు.
'మీరు చేయని నేరం మీ మీద పడింది. ఇన్నాళ్ళూ మా అందరికీ మీరున్నారు. ఇప్పుడు మీకు మేమున్నాము' అని భర్తకు దీప ధైర్యం చెబుతుంది. తండ్రిని, తమ్ముడిని ఆస్పత్రికి పంపమని, దీపను ఇంటికి పంపిస్తాడు కార్తీక్. తర్వాత ఏమైందనేది రేపటి ఎపిసోడ్ లో చూడాలి.