English | Telugu
మహిళల మనసు గెలుచుకున్న జూనియర్ ఎన్టీఆర్!
Updated : Aug 25, 2021
నందమూరి కుటుంబ సంస్కారం, మహిళలకు ఎంత గౌరవం ఇస్తారనేది 'ఎవరు మీలో కోటీశ్వరులు' కార్యక్రమంతో మరోసారి ప్రజలకు తెలిసింది. ఒక్క అక్షరం, బుల్లితెర కార్యక్రమం పేరులో ఒక్క అక్షరం మార్పు చెయ్యడంతో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మహిళల మనసు గెలుచుకున్నారు. ఆయన నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
జెమినీ టీవీలో 'ఎవరు మీలో కోటీశ్వరులు' కార్యక్రమం ఆగస్టు 22న మొదలైంది. మొదటి ఎపిసోడ్‌కి రామ్ చరణ్ గెస్ట్ కింద వచ్చారు. అదే రోజు చిరంజీవి పుట్టినరోజు కూడా కావడంతో తండ్రితో పాటు 'ఆచార్య' సినిమాకు సంబంధించిన విశేషాలు రామ్ చరణ్ వెల్లడించారు. అయితే, గతంలో 'స్టార్ మా'లో ఈ కార్యక్రమం ప్రసారమైనప్పుడు 'మీలో ఎవరు కోటీశ్వరుడు' అని ఉండేది. కార్యక్రమానికి వచ్చే అతిథులను ఏకవచనంతో సంబోధించడం తనకు నచ్చలేదని, అందుకని 'కోటీశ్వరుడు'ను 'కోటీశ్వరులు' కింద మార్చమని చెప్పానని తారక్ అన్నారు.
టైటిల్ మార్పు గురించి జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ "షోకు వచ్చేవాళ్లను 'డు' అంటూ ఏకవచనంతో సంభోదించడం నాకు ఇష్టం లేదు. మహిళలు కూడా షోకు వస్తారు కాబట్టి 'ఎవరు మీలో కోటీశ్వరులు' అని మార్చాము" అని చెప్పారు. ఈ మాట మహిళల మనసులను తాకింది. తారక్ మీద వారంతా ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.